అక్షరమే...అతనై....!!: -..--ఝాన్సీ.కొప్పిశెట్టి.-ఆష్ట్రేలియా(హైదరాబాద్)
దిగుళ్ళ నెగళ్ళతో నలుగుతూ
 కోటి ఆశల రేణువులతో 
అతని రాకకై నిరీక్షిస్తూ ఆమె.... !
గాలిబ్ గేయంలా మది  ముందుకూ 
అడుగు వెనక్కూ వేస్తూ 
సందిగ్ధంలో ఊగిసలాడుతూ అతను...!
ఆపలేని శిశిరాన్ని తరుముతూ 
మానస వసంతంలా రానే వచ్చాడతను.

అణువణువూ ఉద్విగ్నతతో 
వేల రాగాలాలపిస్తూ విపంచిలా ఆమె....!
తొలకరి జల్లులా చెదరని-
 చిరుదరహాసంతో  అతను...!
కిటికీలోంచి తొంగి చూస్తూ
 తన చాతుర్యం ఓడి  
మబ్బులచాటున నక్కిన చందమామ.!

తన ఉనికిలో ఇంకిపోయిన అతని తలపుల్లో తలదాచుకోవాలని తహతహలాడుతూ ఆమె...!
ఆమె ఉనికినే మరిచి తాదాత్మ్యంలో తదేకంగా చూస్తూ అల్లంత దూరాన అతను....!
నిఘంటువులో తన తాత్పర్యాన్ని పరమార్ధాన్ని వెతుక్కుంటూ "అమలిన శృంగారం".

ఊసుల గుసగుసలన్నీ గుభాళించేయాలని మౌనంతో పోరాడుతూ ఆమె....!
ఆమె భావాల లోతులను స్పృశించి 
కళ్ళతోనే సంభాషిస్తూ అతను....!
అమాయకంగా నిలువుటద్దంలో 
మనసు భాషలో సంభాషించుకుంటూ 
వారి ప్రతిబింబాలు.

గుండె చప్పుళ్ళ వాయిద్యంలో 
 తడబడే అడుగులతో తొణికిపడుతున్న 
కాఫీ కప్పుతో ఆర్తిగా ఆమె....!
దరిచేరే ఆమె ఉచ్చ్వాసనిశ్వాసల ప్రకంపనల అనిర్వచనీయానుభూతిలో  పరవసిస్తూ అతను....!
ఇద్దరి మూగ ప్రేమ మధ్య అనంత ప్రేమను ఆవిష్కరిస్తూ స్తంభించిపోయిన కాలం.

ఆమె చేతి అమృతపు చివరి బొట్టు 
గొంతులోకి  జారీజారగానే
 కళ్ళతోనే సెలవంటూ అయిష్టంగా  అతను.....!
గోముగా ఆ క్షణాన్ని వాటేసుకుంటూ 
మౌనంగా తలూపుతూ ఆమె...!
వారిద్దరి వీడ్కోలుకి సాక్ష్యాలుగా 
ఆకాశంలో తళుకులీనుతూ లక్షల్లో నక్షత్రాలు.

ఊహాతీతమైన అతని స్మృతుల ఆనందాన్ని ఆస్వాదిస్తూ దృశ్యీకరించుకునే కవిత్వమై ఆమె.....!..
ఆమె ప్రేమైక కలల కవనానికి 
ప్రాణం పోసే అక్షర రాశుల
 మేరువు పర్వతమై అతను......!
నిరక్షరమైన కవిత్వం --
'అతను లేని ఆమె'....!!
                 ....