ఒక అడవిలో పెద్ద చెట్టు ఉంది.
దాని మీద అనేక పక్షులు గూళ్లు కట్టుకొని ఉన్నాయి.
దగ్గరలో ఓ జంగు పిల్లి నివసిస్తోంది.
అది పక్షులతో కపట స్నేహం చేస్తుంది.
ఒకరోజు పిల్లికి ఆకలి దంచేస్తోంది.
పక్షి పిల్లలను తిని కడుపు నింపుకోవాలి అనుకుంది.
పెద్ద పక్షులు బయటకు వెళ్లాయని తెలుసుకుంది.
మెల్లగా చెట్టు ఎక్కింది.
అందిన పిల్లలను అందినట్టుగా తినేసింది.
మూతి తుడుచుకుని చెట్టు దిగింది.
ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లింది.
ఆహార సేకరణకు వెళ్లిన పక్షులు సాయంత్రానికి గూడు చేరాయి.
పిల్లలు తగ్గి ఉండటం గమనించాయి.
దుఃఖంతో విలపించాయి.
పిల్లి దగ్గరకు పోయి "పిల్లి పిన్ని! మా పిల్లలు చాలా తగ్గాయి.
ఏ పాడు జంతువో పొట్టన పెట్టుకుంది.
దాని నోరు పడిపోనూ, దాని పిల్లలకు కళ్లు పోనూ.....మా ఉసురు తగలక మానదు.
దాన్ని నీవు ఏమైనా చూశావా? చూస్తే చెప్పవూ?" అని అడిగాయి.
"రామ రామ! నాకేం తెలుసు. అంత పని జరిగిందా? పసి కూనలను తిన్న ఆ పాపికి తగిన శాస్తి జరుగుతుంది.
మీ శాపం తప్పకా తగులుతుంది. ఇక నుంచి అలా జరగదులే. నేను కనిపెడుతూ ఉంటాగా. వెళ్లి రండీ" అంది పిల్లి.
ఇలా కొన్నాళ్లు గడిచాయి.
రుచి మరిగిన పిల్లి ఊరకనే ఉంటుందా? మరో రోజు మళ్లీ వెళ్లింది.
చెట్టు ఎక్కి గూట్లో చెయ్యి పెట్టింది.
గుడ్డు పెట్టటానికి వచ్చిన పక్షి తల్లి పైన చెయ్యి పడింది.
తుర్రునా లేచి పిల్లిని చూసింది.
పక్షులు వచ్చాక అంతా చెప్పింది.
అవి అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి.
అప్పటికప్పుడు పిల్లి నివాసానికి వెళ్లాయి.
పిల్లి ఇంట్లో లేదు.
దాని పిల్లలు ముడుక్కుని పడుకున్నాయి.
ఆ పసివాటి కళ్లను ముక్కులతో పొడిచి గోర్లతో రక్కాయి.
మాంసపు ముద్దలుగా చేసి ప్రతీకారం తీర్చుకున్నాయి.
తరువాత పిల్లి వచ్చి గుడ్డివైన పిల్లలను చూసుకుంది.
లబోదిబోమని మొత్తుకుని తలపట్టుకొని ఏడ్చింది.
నీతి : మనం హాయిగా ఉండాలంటే ఇతరులకు హాని చేయకూడదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి