మైత్రి విలువ (కథ) -సరికొండ శ్రీనివాసరాజు


  ఆ అడవికి రాజైన సింహం జీవానురంజకంగా పరిపాలిస్తున్నది. దాని పరిపాలనలో అన్ని జీవులూ సురక్షితంగా ఉండేవి. కానీ ఆ సింహం ఎవరితోనూ కలవకపోయేది. ఎవరు స్నేహం చేయాలన్నా వాటికి దూరంగా ఉండేది. ఆపద వేళ జంతువులను ఆదుకొని ఆ తర్వాత వాటికి దూరంగా ఉండేది. ఒకరోజు ఏనుగు సింహానికి సలహా ఇచ్చింది. "మృగరాజా! మీరు అడవి జీవుల ఐక్యతకు కృషి చేస్తారు. కానీ మీరు ఎవరితోనూ స్నేహం చేయరు? అది మీకే ప్రమాదం." అని. అప్పుడు సింహం "నీకేమైనా పిచ్చా? మహారాజునైన నాకు అల్ప జీవులతో స్నేహమా? ఇంత భారీ శరీరం కలవాణ్ణి. నాతో పోరాటానికి వచ్చే సాహసం దేనికి ఉంది? నన్ను నేను రక్షించుకోగలను. మహారాజుగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ఉచిత సలహాలను ఇవ్వడం ఆపేసి, నీ దారిన నువ్వు వెళ్ళిపో!" అంది సింహం.


       ఇలా ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మాయదారి సింహం ఆ అడవిలో పడి, విచ్చలవిడిగా వేటాడుతూ జంతువులను తింటుంది. ఆ అడవిలోని జంతువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. సింహానికి కొన్ని జంతువులు మొర పెట్టుకున్నాయి. సింహం తాను ఆ మాయదారి సింహాన్ని కనిపెట్టి చంపుతానని వాగ్దానం చేసింది. ఒంటరిగా అడవి అంతా కలియతిరిగి ఆ మాయదారి సింహాన్ని కనిపెట్టింది. దాని మీదకు యుద్ధానికి దిగింది. చాలాసేపు పోట్లాడుకున్నాయి. వనరాజు శక్తి బాగా తగ్గిపోయింది. తన చావు ఖాయం అంటున్నాడు. కానీ హఠాత్తుగా అడవిలోని అనేక జంతువులు అక్కడ ప్రత్యక్షమై మాయదారి సింహంపై దాడి చేశాయి. క్షణాల్లో మాయదారి సింహాన్ని చంపేశాయి. 

      తనను రక్షించడానికి ఇన్ని జంతువులు మూకుమ్మడిగా రావడం సింహానికి కనువిప్పు కలిగించింది. స్నేహం విలువ తెలిసింది. అన్ని జీవులతో స్నేహం చేసింది.

కామెంట్‌లు