జంతువుల ఉపకారం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

         ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు.
       చెట్టుక్రింద ఉచ్చులు వేశాడు.
        పొదలలో దాగి పొంచి చూస్తున్నాడు.
        అదే సమయంలో ఓ అడవి గొర్రె వచ్చింది. 
       పచ్చిక తింటూ ఉచ్చులో చిక్కుకుంది.
        వేటగాడు చూసి  గొర్రెను గట్టిగా పట్టుకున్నాడు.
       “ఆహా! ఈ గొర్రె భలే బలిసింది. 
       నా అదృష్టం కొద్దీ దొరికింది. 
       దీనితో ఊరు మొత్తానికి విందు చేస్తాను" అనుకున్నాడు.
       వేటగాని మాటలను గొర్రె గ్రహించింది. 
       విడిపించమని బ్రతిమలాడాడు.
       "అయ్యా వేట దేవరా! మేము అమాయకులం. 
       ఎవరి మీదా ఆధారపడక బ్రతుకుతున్నాము. 
       మీరు తెలివైనవారు. 
       ఇతరులను హింసించి జీవించటం మీకు న్యాయమా?
        మా జంతువులు లేనిదే మీ మానవ మనుగడే ఉండదు
తెలుసుకోండి. 
       రోజు ఇలా జంతువులను పట్టుకొని చంపుతూ పోతే పర్యావరణం ప్రమాదంలో పడుతుంది" అన్నది.
        గొర్రె మాటలు వేటగానికి ఆసక్తి కలిగించాయి.
        “గొర్రె! మీ జంతువులు మామానవులకు ఎలా ఉపయోగపడుతున్నాయో, ఉపకారం చేస్తున్నాయో చెప్పవా?” అని అడిగాడు.
       గొర్రె ఇలా చెప్పింది. “మానవుడా! మీకు పాలు ఇస్తున్నాము. 
       మా పేడను సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు.
        మాతో పనులు చేయించుకుంటున్నారు. 
        జంతు ప్రదర్శనశాలల్లో, సర్కలో వినోదాన్ని
కలిగిస్తున్నాము. 
       కుక్కలాంటి జంతువులు విశ్వాసంగా ఉంటూ కాపలా కాస్తున్నాయి. 
       ఇవన్నీ బ్రతికి ఉన్నప్పటి ఉపయోగాలు. 
        చనిపోయిన తర్వాత లెక్కలేనన్ని మేలులు చేస్తున్నాము.   
      మా వెంట్రుకలతో మీరు ఉన్ని వస్త్రాలు ధరిస్తున్నారు. 
       మా చర్మంతో పాదరక్షలు, బుష్ కోట్లు తయారు చేస్తున్నారు.
        మా కొమ్ములు, గిట్టలతో అలంకార సామాగ్రి తయారు అవుతుంది. 
       మా ఎముకలను ఎరువుల పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. 
       నరాలతో వాయిద్య పరికరాలు, ఆట వస్తువులు తయారుచేస్తారు. 
      పేగులు ఇతర గ్రంధులను వైద్యంగా ఉపయోగిస్తున్నారు.   
        ఏనుగు దంతాల సంగతి మీకు తెలియంది కాదు.
        ఇక మా మాంసం మీకు విందే.
        మా శరీరంలోని ప్రతి అవయవం మీకు పనికి వచ్చేదే.   
        అందుకే మమ్మల్ని బ్రతకనివ్వండి" అన్నది.
         గొర్రె మాటలు వేటగాడిలో మార్పు తెచ్చాయి.
         ఆ రోజు నుండి వేట మానేశాడు.
        నీతి : జంతువుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటిని చంపరాదు.
కామెంట్‌లు