శ్రీపురం గ్రామంలో మధు అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా అల్లరి పిల్లవాడు. చెడ్డ పనులు చేస్తూ అందరితో తిట్లు తింటూ ఉండేవాడు. అయినా తన వంకర బుద్ధిని మార్చుకోవడం లేదు. పైగా ఇతరులను వాళ్ళ రూపంలోని లోపాలను ఎత్తి చూపుతూ హేళన చేసేవాడు. అందుకే అతనికి స్నేహితులు తక్కువ. అలాంటి కొంటె లక్షణాలు గలవారు మధుతో స్నేహం చేసేవారు.
ఈ మధ్యనే ఒక తేనెతెట్టను చూశాడు మధు. దాని మీదకు గురిచూసి రాయి విసరడం వేగంగా పరుగెత్తడం చేసేవాడు. దాంతో ఆ కందిరీగలు దారిన పోయే వేరే వారిని కుట్టేవి. అది తెలుసుకున్న మధు తన అల్లరి బృందాన్ని వెంట వేసుకుని ఆ బాధితుల వెనుక నుంచి నవ్వేవాడు. ఒకరోజు అలవాటు ప్రకారం తేనెతెట్టపై రాయి విసిరి పరుగెత్తాడు. ఒక కందిరీగ వచ్చి మధు మూతి మీద కుట్టింది. మూతి బాగా వాచింది. అందరూ మధును చూసి అరేయ్ కోతిరా! తోకలేని కోతి. షర్టు, ప్యాంటు వేసుకున్న వింత కోతిరా! అంటూ వెంటపడి మరీ హేళన చేయసాగారు. మధు చేత అవమానాల పాలు అయిన వారు, మధుపై కోపం ఉన్నవారు జత కలిశారు. అదే పనిగా హేళన చేస్తున్నారు. "కెమెరా ఉంటే చూడండిరా! ఈ వింత జంతువు మళ్ళీ కనిపించదు. ఫోటో తీసుకుందాం." అన్నాడు సోము. "జంతు ప్రదర్శనశాలకు తరలిద్దాం." అన్నాడు విష్ణు.
ఒకరోజుతో ఆగిపోలేదు. ప్రతిరోజూ ఈ అవమానాలు జరుగుతున్నాయి. చెడ్డ పనులు చేసినా, ఇతరుల పట్ల అమానుషంగా ప్రవర్తించినా వాళ్ళకు ఖచ్చితంగా అవమాన పడే రోజులు వస్తాయి. కాబట్టి మనం ఇతరుల పట్ల స్నేహభావాన్ని కలిగి ఉంటూ మంచి ప్రవర్తనను అలవరచుకోవాలి. మధు బుద్ధిగా ప్రవర్తిస్తూ చదువుపై శ్రద్ధ చూపించడం మొదలు పెట్టాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి