తెల్లవారితే క్రిస్ట్మస్.
"సుధా ఇంకా పడుకోలేదా? ఏం చేస్తున్నావు" అనడిగింది అమ్మ.
తనకేంకావాలన్నా శాంటానడగటమే తెలుసు సుధకి. అక్కకి ఒక మంచి సంబంధం చూడమని శాంటాతో చెబుతుంటే, అమ్మ మధ్యలో డిస్టర్బ్ చేసోంది!
"ఇదిగో శాంటా, వచ్చే బావగారు నాతో ఆడుకోవాలి. నన్ను షికార్లకి తీసుకెళ్ళాలి. రోజీ కి వాళ్ళ బావ ఇచ్చే గిఫ్ట్స్ కంటే , మంచి మంచి బహుమతులు కొనివ్వాలి. షీలా వాళ్ళ బావ లాగా చెడ్డవాడు కాకూడదు. అతను బాగా తాగేసొచ్చి షీలావాళ్ళ అక్కని కొడతాడు. వాళ్ళ బుజ్జి బాబుకి మంచి బట్టలు అస్సలు కొనడు. పాపం వాడేమో మొన్న పండక్కి చిరిగినబట్టలు వేసుకున్నాడు. వింటున్నావా, అర్ధమయిందా" అని తన చిన్ని మనసులో కలిగిన ఆలోచనలన్నీ శాంటాతో ఏకరువుపెట్టి పడుకుంది.
"శాంటా" వచ్చేసరికి తను మెలకువగా లేకపోతే, తెచ్చిన బహుమతులు ఇవ్వకుండా వెళ్ళిపోతాడేమో! బావ ఎలాఉంటాడో? అని సుధకి రాత్రంతా కలత నిద్రే!
చిన్నప్పటి నించీ తను కోరుకున్నవన్నీ ప్రతి క్రిస్ట్మస్ కి శాంటానే తెచ్చిచ్చేవాడు.
త్వరగా అన్నం తినేసి పడుకోకపోతే "శాంటా" రాడు అని అమ్మ బెదిరింపు!
మంచం మీద పడుకుని, తనకి రాబోయే బహుమతులు తలచుకుంటూ కళ్ళు మూసుకుంది. శాంటా వచ్చినట్టు, లైట్స్ సరిగా లేక క్రిస్ట్మస్ ట్రీ కనిపించనట్టు, తెచ్చిన బహుమతులు చేతిలో పెట్టుకుని అటూఇటూ వెతుకుతున్నట్టు కలలు.
ఎప్పుడు నిద్ర పట్టేసిందో, భళ్ళున తెల్లారింది. అమ్మ "సుధా చూడు..శాంటా నీకేమిచ్చాడో, అక్క చూసేస్తోంది" అన్నపిలుపుకి మంచం మీంచి ఒక్క గెంతులో సుధ ఆ గదిలోకెళ్ళింది.
శాంటా బావనిచ్చేశాడేమో, బావ తను అనుకున్నట్టే ఉన్నాడో, లేడో? గిఫ్ట్స్ అంటే ప్యాకెట్ లో పెట్టి ఇస్తాడు, మరి మనిషినిఎలా ఇస్తాడు అని మనసు నిండా సందేహాలే?
ఇప్పటి వరకు తను అడిగినవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వడు? అని అమాయకంగా ఆలోచిస్తూ, తనకంటే ముందు అక్క బావని చూసేస్తుందేమో అని గబ గబా బ్రష్ చేసేసుకుని పరుగెత్తుకొచ్చింది. తను కోరుకున్న బ్రేస్ లెట్, స్కూల్ బ్యాగ్, ఫాన్సి షూస్ ఇచ్చాడు. అయినా సుధ మొహం చిన్న బోయి ఉంది. సుధ తన గిఫ్ట్స్ చూసుకుని గంతులేస్తుంది అనుకున్న అమ్మ, చిన్నబోయిన మొహంతో ఒక మూలకెళ్ళి కూర్చున్న కూతురినిచూసి బుజ్జగింపుగా "ఏమ్మా ఎందుకు ఏడుపు మొహం పెట్టావు" అన్నది.
"అక్క కోసం మంచి బావనిమ్మని అడిగితే "శాంటా" మర్చిపోయాడమ్మా! రాత్రి చాలా సార్లు చెప్పాను కూడా! రాత్రి మంచినీళ్ళు తాగటానికి లేచినప్పుడు మర్చిపోవద్దని కూడా మళ్ళీ చెప్పా! అయినా ఇవ్వలేదు" అని కళ్ళు తుడుచుకుంది.
"పిచ్చి పిల్లా ఇస్తాడులే! తెస్తూ ఉంటాడు. రాత్రి నాకు కనిపించాడు. సుధని ఏడవద్దనిచెప్పండి. అల్లరి చెయ్యకుండా, బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే ఇస్తానని నీతో చెప్పమన్నాడు" అని బుజ్జగించి, తనకి కేక్ చెయ్యటంలోసహాయం చెయ్యమని కబుర్లల్లో పెట్టి వంటింట్లోకితీసుకెళ్ళింది.
"పాపం పిల్లలు మనం ఏం చెబితే అది అమాయకంగా నమ్ముతారు. శాంటా ఒక కల్పిత పాత్రే అయినా అతని పేరు చెప్పితల్లిదండ్రులు చేసే "మాయ", పిల్లలు తమకి కావలసినవాటి కోసం ప్రతి సంవత్సరం"శాంటా" కోసం ఎదురు చూడటంతల్చుకుంటే పెద్దలైన మనమూ ఆ మాయలో పడిపోవటం ఆశ్చర్యం!
"అలా అడగ్గానే శాంటా ఇచ్చేట్టయితే, మనకి రూపాయి ఖర్చు ఉండదు కదా" అని అమ్మా-నాన్న ముసి ముసిగానవ్వుకున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి