భారతీయ సంస్కృతి - భారతీయ మూలాలు - హిందూ ధర్మం

 ఈ విషయం మీద మనల్ని చాలామంది, ఎవరిదాకానో ఎందుకు, మన ఇంట్లో మనపిల్లలు మనల్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పడానికి తడుముకుంటాము.  ఎలాగో కష్టపడి,వారిని తృప్తి పరిచే సమాధానం చెప్పాము అని మనకు మనం చెప్పుకుంటాము కానీ, "అబ్బే! సరిగ్గా చెప్పలేకపోయావురా అబ్బిగా!" అని మన మనస్సు మనకు చెప్తూనే వుంటుంది. అదుగో, సరిగ్గా అలాంటప్పుడు ఈ క్రింది వాక్యాలు మనకు సహకరిస్తాయేమో! ఆలోచించండి దయచేసి.
*సర్వేత్ర సుఖినః సంతు సర్వేసంతు నిరామయాః!*
*సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిద్దుఃఖ మాప్నుయాత్*
--రుగ్వేదం
అందరూ సుఖంగా, ఆరోగ్యం గా వుండాలి. అందరూ మంచినే చూడాలి. సమాజంలో ఒక్కరికి కూడా దుఃఖం కలగకూడదు.  ఇది కదా సనాతన భారతీయ భావన. మానవ చరిత్రలో మొట్టమొదటి పుస్తకం రుగ్వేదం చెప్తున్న మాట.
*సమానో మంత్ర సమితిః సమానీ సమానం మనః సహచిత్త మేషామ్!*
*సమానం మంత్ర మభిమంత్రయేవః సమానేన హవిషాజుహోమి!!*
*సమానీవ ఆకూతిః సమానాహృదాయానివః!*
*సమానమస్తు వోమనో యథావః సుసహాసతి!!*
---రుగ్వేదం
సమితులలోనూ,సమితులు చేసే నిర్ణయాలలో ఐకమత్యం వుండాలి. వారిలో భేదభావం వుడకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆనందంగా సౌహార్ద్రంతో నిండిన హృదయాలు కలిగి వుండాలి.
(మన అసెంబ్లీ, పార్లమెంటు, మంత్రవర్గాలు గుర్తుకొస్తున్నాయి)
*ఇది కదా భారతీయత. ఇది కదా మన సంస్కృతి. దీనికోసమే కదా మనం తపించ వలసింది*
ఇది సాధించాలంటే ఏమి చేయాలో కూడా చెప్పారు----
*ధృతేదృహమా, మిత్రస్వమాచక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతామ్, మిత్రస్వాహం చక్షుషా, సర్వాణి భూతాని సమీక్షే, మిత్రస్య చక్షుషా సమీక్షామహే!!*
ఈ ప్రపంచంలో వున్న అన్ని ప్రాణులూ నన్ను స్నేహంతో నిండిన చూపులతో చూడలని కోరుకుంటున్నాను. నేను అన్ని ప్రాణులనూ స్నేహ పూర్వకంగా చూడగలగాలి. మనమందరంలో మైత్రీ భావం నిలిచి కనిపించాలి.
*ఎంత చక్కని భావనండీ, నిజంగా.*
సమాజంలో అందరనీ సమదృష్టితో, తనవారు అనుకుని చూడాలి అంటే దానికి పునాది ఇంటినుండి పడాలి. కుటుంబం లో అందరి మనసులు కలవడం, ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం జరిగితే అప్రయత్నంగా ఈ విషయాలు సమాజంలో కనిపిస్తాయి.  అందుకే కుటుంబం ఎలా వుండాలో కూడా చెప్పారు.
*అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః!*
*జాయాపత్యే మధుమతీంవాచం వదతుశాంతిదామ్!!*
*మాభ్రాతాభాతరం ద్విక్షన్మా స్వసారముతస్వసా!*
*సమ్యఞ్చః సంవ్రతాభూత్వా వాచంవదత భద్రయా!!*
తండ్రి పాటించే నియమాలను కొడుకు పాటించాలి. తల్లితో ఎంతో ప్రేమగా మంచి మనసుతో ఉండాలి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు
 ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా ప్రేమతో వుండాలి.  కుటుంబం లో అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకే భావనతో మంచి మాటలు మాట్లాడుతూ వుండాలి.
*ఇంత వివరంగా కలసి బతకడం గురించి చెప్పబడింది కనుకే, భారతీయత మూలాలు వేదాలలో వున్నాయి.* 
*ఇంత చక్కగా కలసి జీవించడం గురించి చెప్తోంది మన సంస్కృతి. మన హిందూ ధర్మం.*
కానీ మనం ఏమి చేస్తన్నము.  సమాధానం ఎవరికి వారికే.
*సర్వే జనా సుజనో భవంతు!*
*సర్వే సుజనా సుఖినో భవంతు!!*
*భవంతు కృత పుణ్యానామ్!!!*
*అందరూ బావుండాలి. ఆ అందరిలో నేనుండాలి.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss