ఏంటో తెలుసుకోవాలి:-- యామిజాల జగదీశ్

 మనం పిల్లలకు వాళ్ళకి ఫలానాది ఇష్టమనుకునో లేక మన దగ్గర డబ్బుంది కదానో ఏవేవో ఊహించేసుకుని బొమ్మలు గట్రా కొనిస్తుంటాం. నిజానికి వాళ్ళకు ఏది ఇష్టమో తెలుసుకోం. తీరా మనం ఓ ఖరీదైన బొమ్మేదో కొనిస్తే వాళ్ళకు అది నచ్చకపోతే మనస్సు చివుక్కుమంటుంది. వాళ్ళతో బలవంతంగా ఆ బొమ్మతో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అలాకాకుండా వాళ్ళకేది ఇష్టమో తెలుసుకుని అది ఇస్తే వారి ఆనందానికి అంతుండదు. 
సరే కానీ ఓ కథలోకొస్తాను. ఓరోజు విక్రమరాజు ఓ గుర్రంమీద మందీమార్బలంతో రాజధానిలో తిరగడం మొదలుపెట్టాడు. తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటూ పర్యటన కొనసాగిస్తున్నాడు. 
మార్గమధ్యంలో ఓ జ్ఞాని ఓ కఫాలాన్నే భిక్షపాత్రలా చేతిలో పట్టుకుని రాజుకి ఎదురెళ్ళాడు. చూడడానికి ఆ జ్ఞాని ఓ బిచ్చగాడిలా ఉన్నాడు. అత్యంత సాధారణమైన బట్టలు కట్టుకున్నాడు. రాజుగారి గుర్రం ఆగడంతోనే ఆ జ్ఞాని దగ్గరకు వెళ్ళి "భిక్ష వెయ్యండి" అని అడిగాడు. 
రాజుకి కోపమొచ్చింది. "నేనెవర్ననుకున్నావు? ఈ దేశానికి రాజుని. ఇలా అడ్డంగా వచ్చి భిక్షమడుగుతున్నావు. పక్కకు తప్పుకో" అన్నాడు రాజు. 
కానీ జ్ఞాని ఏమాత్రం అదుపుతప్పలేదు. అయినా పక్కకు తప్పుకోక "నేనడిగింది ఈ కఫాలమంతే...అంతకన్నా నాకేమీ అక్కర్లేదు" అని జ్ఞాని అన్నారు.
అప్పుడు రాజు అతను మామూలు భిక్షగాడు కాదని గ్రహించి "సరేగానీ, రేపు ఉదయం మా ఆస్థానానికి రండి. మీకేం కావాలంటే అది ఇస్తాను" అన్నాడు.
జ్ఞాని అలాగేనని మరుసటిరోజు ఉదయం రాజుగారి సభకు వెళ్ళారు. 
"ఏంకావాలో కోరుకోండి. మణులా మాణిక్యాలా బంగారమా నవరత్నాలా మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నేనీ దేశపు రాజుని....నేను ఇవ్వలేనిదంటూ ఏదీ ఉండదు" అన్నాడు రాజు.
అయితే జ్ఞాని "ఇదిగో ఈ చిన్నపాటి కఫాలంలో ఎంత పడుతుందో అన్ని కాసులివ్వండి చాలు. అంతకంటే నాకేమీ అక్కర్లేదు" అంటారు.
రాజు భటుణ్ణి పిలిచి కఫాలంలో కాసులు వెయ్యమంటాడు. తీరా ఓ పది పదిహేను కాసులకే కఫాలం నిండిపోయినట్టనిపిస్తుంది.
కానీ మరు క్షణమే అది ఖాళీగా కనిపిస్తుంది. జ్ఞాని చాచిన చేతులు చాచినట్టే ఉన్నాయి. రాజుకి ఆశ్చర్యం వేస్తుంది అందులో వేసిన కాసులు ఏమయ్యాయని. కఫాలంలో భటులు వేస్తున్న కొద్దీ ఖాళీ అవుతోంది తప్ప నిండిన దాఖలాలు లేవు. 
ఇలాగైతే తన దగ్గరున్న ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది కదాని మనసులో అనుకుని సింహాసనం దిగి జ్ఞాని దగ్గరకొస్తాడు. 
"మీ కఫాలపాత్రలో ఓ రెండు గంటలుగా వేస్తున్న కాసులన్నీ ఏమవుతున్నాయో అర్థం కావడంలేదు. అదేమన్నా మాయపాత్రా?" అని అడుగుతాడు రాజు. 
అంతట జ్ఞాని "ఇదేమీ మీరనుకున్నట్టు మాయపాత్రకాదు. నేను నిన్ననే మీ దగ్గరకు బయలుదేరాను. దారిలో ఓ శ్మాశనం కనిపిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఈ కఫాలం కనిపిస్తే అది చూడ్డానికి భిక్షపాత్రలాగా అనిపించింది. సరేకదాని తీసుకున్నాను. ఇంతకూ ఈ కఫాలం ఎవరిదంటే అత్యాశలతో చనిపోయిన ఓ మనిషి కఫాలమిది. కనుక ఇందులో మీరే కాదు ఎవరెంత వేసినా ఏమి వేసినా నిండదిది. అటువంటి ఆశల పాత్ర. అంతేతప్ప ఇది మాయ, మంత్రాల పాత్రకాదు....." అంటారు.
అందుకే అంటారు ముందువెనుకలు తెలుసుకుని ఇస్తాననే మాటివ్వాలని. మాట ఇచ్చాక తప్పడం సరికాదు కదా!?