సామెత కథ :ఎం . బిందు మాధవి


 "ఉభయ కుశలోపరి" 

కాఫీ తాగి హెడ్లైన్స్ చూద్దామని పేపర్ తిరగేస్తున్న శారదని ఒక ప్రకటనఆకర్షించింది. "మా స్వచ్ఛంద సంస్థలో పిల్లలకి కధలు చెప్పే ఆసక్తి గలపెద్దలకి అవకాశం" 

కింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసింది. ఒక పెద్దాయన ఫోన్ తీసి.."మీకు వీలైతే రేపొక సారి మా సంస్థకి రాగలరా అమ్మా" అని అడిగారు. 

మరునాడు స్నేహితురాలు అన్నపూర్ణని తీసుకుని అక్కడికి వెళ్ళింది శారద. అది ఇరవై ఎకరాల స్థలంలో కట్టిన ఒకశరణాలయం. అన్ని వయసుల పిల్లలు దాదాపు 500 మంది దాకా ఉన్నారు. వారి కోసం స్కూల్ ...హాస్టల్, అక్కడ పని చేసేఇతర స్టాఫ్ కి వసతి గృహాలు, వంటశాలలు, కమ్యూనిటీ హాల్స్, ఒక ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, కూరగాయల మొక్కలతో సహాఉన్న పువ్వులతోట ...అన్నీ పొందికగా నిర్మించబడి చూడటానికి ఆహ్లాదంగా ఉన్నది. 

శారద వాళ్ళని చూసి ఆఫీస్ రూం నించి ఒకతను వచ్చి వీరిని రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టాడు. మంచినీళ్ళిచ్చి "అయ్యగారొస్తారమ్మా" అని చెప్పి వెళ్ళిపోయాడు. 

చుట్టూ చూస్తూ, ఆ సంస్థ కార్యక్రమాలు..వారి ఆశయాల గురించి అంచనా కట్టే ప్రయత్నంలో ఉన్నది శారద. 

ఓ పది నిముషాల తరువాత నారాయణ మూర్తి గారు లోపలికి వచ్చి శారద వాళ్ళకి నమస్కరించి ఎదురు కుర్చీలోకూర్చున్నారు. ఉభయ పరిచయాలయ్యాక "అమ్మా మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు? ఎక్కడైనా ఉద్యోగం చేశారా?" అనడిగారు. "నేను సెక్రెటేరియట్ లో పని చేశానండి. మా ఫ్రెండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పని చేసిందండి" అన్నదితన ఫ్రెండ్ అన్నపూర్ణ ని పరిచయం చేస్తూ శారద. 

"మాది అనాధ పిల్లల్ని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి వారికొక జీవనోపాధి చూపించే స్వచ్ఛంద సంస్థ అండి. స్కూల్చదువులు..ఆటపాటలు మామూలుగానే ఉంటాయి. అనాధ పిల్లలు కాబట్టి వారికంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ..ముఖ్యంగా నాయనమ్మలు, అమ్ముమ్మలు, తాతయ్యలు ఉండరు కదా! అందు చేత వారికి సహజంగా వచ్చేపెద్దల అనుభవం అందదు."

"పెద్ద చదువులు చదివి, పెద్ద  ఉద్యోగాలు చేసి పదవీ విరమణానంతరం..పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల కాలక్షేపం లేకపిల్లలతో గడపాలనుకునే వారిని ఇలా వార్తాపత్రికల ద్వారా ఆహ్వానించి వారి వారి ఆసక్తులని బట్టి, వారికి ఏ రంగంలోనైపుణ్యం ఉన్నదో అది పిల్లలకి పంచటానికి నిర్దేశింపబడిన కార్యక్రమమండీ ఇది." అన్నారు నారాయణ మూర్తి గారు. 

అది వినగానే శారదకి చాలా సంతోషం వేసింది. ఇంతలో..చూపులకి చాలా హుందాగా, గౌరవప్రదంగా ఉన్న ఒక ఆవిడవీరున్న గదిలోకి వచ్చి "మూర్తిగారు ఈ రోజు  ఫస్ట్ ఎయిడ్ గురించి పిల్లలకి కొన్ని విషయాలు నేర్పించి..ఎలా చెయ్యాలో కూడాడిమాన్ స్ట్రేషన్ ద్వారా చూపించానండి. మళ్ళీ రెండు రోజుల తరువాత వస్తాను. వచ్చే ముందు ఫోన్ చేస్తాను" అని చెప్పివెళ్ళబోతూ ఉండగా..నారాయణ మూర్తి గారు ఆమెని ఆపి "ఈమె డాక్టర్ పావని గారండి. సిటీ హాస్పిటల్ లో జనరల్ఫిజీషియన్ అండి. ఆమె వారంలో రెండు సార్లు వచ్చి పిల్లలకి కొన్ని మెడికల్ విషయాలు నేర్పించి వెళతారండి" అని శారదవాళ్ళకి పరిచయం చేశారు. 

శారద ఆమెని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఆమె అనుభవం గురించి, హస్తవాసి గురించి అదివరకు చాలాగొప్పగావిన్నది. అంతటి మనిషి కూడా తన బిజీ దైనందిన జీవితంలో వెసులుబాటు చేసుకుని, ఇలా స్వచ్ఛంద సేవచేస్తారన్నమాట అనుకున్నది. 

"అలాగే ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు వచ్చి పిల్లలకి ఇంగ్లీష్, మ్యాత్స్ నేర్పిస్తారు. ఇంకా పిల్లల చేత నాటకాలు వేయించటం, వక్తృత్వ పోటీలు నిర్వహించటం..గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చెయ్యటం... స్టేజ్ ఎక్కి పదిమందిలో భయం లేకుండామాట్లాడటం నేర్పిస్తారు."

"ఒక బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి పెద్ద క్లాస్ పిల్లలకి ప్రాక్టికల్ ఫైనాన్స్, ఎకనామిక్స్ నేర్పిస్తారు. బ్యాంకు పరీక్షలు వ్రాయటానికిఅవసరమైన తర్ఫీదు ఇస్తారు".

"ఒక పెద్దావిడ వచ్చి ఆసక్తిఉన్న పిల్లలకి వంటలు-పిండివంటలు తయారు చెయ్యటం నేర్పిస్తారు. ఒకరు వచ్చి టైలరింగ్, ఒకరు వచ్చి కంప్యూటర్ ఆపరేషన్, డేటా ఎంట్రీ, మరొకరు హౌస్ కీపింగ్...ఇలా  రోజూ సాయంత్రం ఒక గంట...పిల్లలకి తమకాళ్ళ మీద తాము నిలబడటానికి కావలసిన అనేక మెళకువలు నేర్పిస్తారండి. అన్ని విషయాలు చదువులో భాగంగానేర్పలేము కదా! అందుకే ఇలా ప్లాన్ చేశాం" అన్నారు. 

"పూర్వం కంటే ఇప్పుడు జీవితాలుక్లిష్టంగా తయారయ్యాయండి. టెంత్ క్లాస్ అయ్యేనాటికి వారికి  ఏదో ఒక స్పెషలైజేషన్లో తర్ఫీదు ఇప్పిస్తే తరువాత వారు  ఆత్మస్థైర్యంతో జీవితం గడపగలుగుతారు. ఇటు పెద్దలకున్న అనేక రకాల అనుభవంపిల్లలకి  ఉపయోగ పడుతుంది, అటు కాలక్షేపం కోసం అలమటించే పెద్దలకి పిల్లలతో గడపటమనేది యాక్టివ్ గా ఉంచేఒక నూతన అనుభవం అవుతుంది. దానితో పిల్లలు దగ్గర లేరని దిగులు పడి ఏ కాలక్షేపము లేకుండా, ఒంటరిగా ఇళ్ళల్లోగడుపుతున్న వారి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి."

"పెద్దలు ఈ సేవలని ఉచితంగా అందిస్తారు కాబట్టి,  మాకు కూడా ఆర్ధికంగా ఏ భారమూ లేకుండానే పిల్లలు అనేకవిషయాలు నేర్చుకుంటారు. ఎవరికి వీలుగా ఉన్నప్పుడు వారు వస్తారు కాబట్టి, ఒకరితో ఒకరికి క్లాష్ లేకుండా వీక్లీ టైంటేబుల్ తయారు చేసి పెట్టుకుంటాము."

"పూర్వం ఇంట్లో పెద్దల ద్వారానే పిల్లలు అనేక విషయాలు నేర్చుకునే వారు. ఇప్పుడు పిల్లలు వేరే దేశాల్లో ఉన్నందువల్ల ఈపెద్దల అనుభవాన్ని అందిపుచ్చుకుని జీవితాలని చక్కదిద్దుకునే అవకాశం లేకుండా పోతున్నది. అలా వారి జ్ఞానము, అనుభవము వృధా అవకుండా మేము ఇలా అనాధ పిల్లలకి అందించే ఏర్పాటు చేస్తున్నామండి" అన్నారు నారాయణమూర్తి గారు.

వారి ఆశయాలు...ఆలోచనలు బాగా నచ్చి శారద, అన్నపూర్ణ ...మంగళ వారం, గురువారం ఆ సంస్థ కి వస్తామనిచెప్పారు.  టెంత్ క్లాస్ తరువాత వెళ్ళగలిగిన పోటీ పరీక్షలకి కావలసిన తర్ఫీదు ఇస్తానని శారద చెప్పింది. వంటలుచెయ్యటం నేర్పిస్తామని అన్నపూర్ణ చెప్పింది. 

తన అనుభవాన్ని పిల్లలకి పంచే అవకాశం దొరికినందుకు తృప్తిగా అనిపించిన శారద.. ఇంటికొచ్చి అమెరికాలో ఉన్నకూతురికి ఫోన్ చేసి ఇవాళ్ళ జరిగినవన్నీ చెప్పి తన ఆనందాన్ని పంచుకుంది. "నాతో పాటు అన్నపూర్ణ ఆంటీ కూడావస్తానన్నారు. దీనిలో బలవంతం ఏమీ లేదు. ఎన్నాళ్ళు చెయ్యగలిగితే అన్నాళ్ళు  సమాజ సేవ చేద్దామనుకుంటున్నాను" అని ముగించింది. 


కామెంట్‌లు