సాయం:-- యామిజాల జగదీశ్
 సాయం! ఈ మాటలో ఒదిగి ఉన్న నిజమైన అర్థాన్ని పూర్తిగా గ్రహించి అనుభవిస్తున్న నేను మాత్రం ఒక్క సాయం చేయలేకపోవడాన్ని తలచుకుంటుంటే సిగ్గేస్తోంది. ఏదో తప్పు చేసిన సంకుచితత్వం నా మనసుని నలుపుతోంది.
మాది ఓ సామాన్య కుటుంబమే. మా నాన్నగారు స్కూల్లో తెలుగు మాస్టారుగా రచయితగా కుటుంబాన్ని నడిపించారు. మేం ఆరుగురు అన్నదమ్ములం. ఆరుగురిలో ఒక అన్నయ్య నలభై రెండేళ్ళ క్రితం పోయాడు. 
ఉన్నంతలోనే తినడానికి ఏ లోటూ రానివ్వక అమ్మ ఎలా ఇల్లు నడిపించిందో తెలీదు. 
ఒకానొకప్పుడు మా నాన్నగారు ఆంధ్రప్రభ దినపత్రికకు రాస్తున్న రోజుల్లో ఎంత కావాలని అడిగితే అమ్మ లెక్కలేసుకుని లోటు పూడ్చడానికి ఎంత అవసరమో అంతే చాలని తక్కువ డబ్బులు అడగడం తెలుసు. ఈ విషయం తెలిసి మరింత అడిగి ఉండొచ్చు అని చెప్పిన వాళ్ళున్నారు. కానీ అమ్మ ఆ పని చేయలేదు. అటువంటి వాతావరణంలో పెరిగిన నేను పెళ్ళయి కాపురం చేస్తూ వస్తున్నాం. ముప్పై ఏళ్ళు మీడియాలో పని చేసినా నేను కూడబెట్టిందేమీ లేదు. కూలీనాలీ చేసుకుని బతుకుతున్నట్లే ఉంటున్నాను. రకరకాల ఉద్యోగాలు చేసిన వాడిని. ఏ ఉద్యోగమూ నాకు తిన్నగా వచ్చింది కాదు. ఎవరో ఒకరి సిఫారసుతో ఏదో ఒక సంస్థలో చేరడమే. 
ఉద్యోగంలో నుంచి ఇవతలకు వచ్చి మెల్లగా గుట్టుగా ఇల్లు గడుపుతుంటే అనుకోని సమస్య మమ్మల్ని నిండా ముంచింది. ఓ మూడున్నరేళ్ళయితే మానసిక క్షోభ. మమ్మల్ని పీల్చిపిప్పి చేసిన సమస్యతో మా అబ్బాయిమీద మోయలేని భారాన్ని పడేసాను. ఇందుకు నా తప్పటడుగే కారణం. వాడి కళ్ళల్లోకి తిన్నగా చూసి మాట్లాడే సాహసం చేయలేని స్థితినాది. వాడికి నావంతు సాయం చేయలేక పోతున్నాను. మా కుటుంబం ఊపిరి పీల్చుకోవడానికి చూట్టాలూ సన్నిహిత మిత్రులూ అండగా నిలిచారు. ఇలా ప్రతి దశలోనూ ఎవరో ఒకరి చేయూత లేనిదే ముందడుగుపడటం లేదు. 
నమ్ముకున్న రాతకోతలతో నెలకు రెండు వేలు పొందుతున్న నాకు టైపింగ్ తెలీడంవల్లకూడా కొంత లభిస్తోంది. టైపింగ్ విషయమప్పుడల్లా వసంతలక్ష్మి అమ్మమ్మగారైన సుందరమ్మగారు గుర్తుకొస్తుంటారు. నేను టైప్ లోయర్ పరీక్షకు వెళ్ళినప్పుడు ఎగ్జామ్ ఫీజ్ కట్టింది సుందరమ్మగారే. 
డెబ్బయికి మూడేళ్ళ చేరువలో ఉన్న నేనొకటి చెప్పగలను...
నా మొహమాటం 
నా చేతకానితనం 
నా చొరవలేనితనం
నా పిరికితనం
ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీని నా అసమర్థత
నన్ను కష్టపెట్టడమే కాక నన్ను నమ్ముకున్న భార్యనూ కొడుకునీ ఒత్తిళ్ళకు లోను చేసాయి. నేను ఓ మంచి భర్తనూ కాను. అలాగే మంచి తండ్రినీ కాను.