పెద్దల మాట:-పండుగాయలసుమలత.గొట్లూరు.కర్నూలుజిల్లా

 
అమ్మమ్మ వాళ్ల  ఊరిలో ప్రైవేట్ పాఠశాలకు చంటి, చిన్ని ఇద్దరు వెళ్లేవాళ్లు.చంటి హోమ్ వర్క్ చేయడం లేదని ఉపాధ్యాయురాలు మందలించింది. చిన్నిని మెచ్చుకుంది.అది చంటికి నచ్చేది కాదు.అలా చంటి రోజురోజుకి అల్లరి పిల్లాడిగా, మొండిగా తయారయ్యాడు.
ఒక రోజు వాళ్ల ఉపాధ్యాయురాలు చంటి అమ్మమ్మ, తాతయ్యలకు వాళ్ల మనవడిగూర్చి చెప్పింది.తాతయ్య చంటికి తెలివి వచ్చేలా ఏదో ఒక శిక్ష వేద్దామనుకున్నాడు. అది తెలిసిన అమ్మమ్మ "చిన్న పిల్లలు అలాగే ఉంటారు.అందుకు శిక్షిస్తావా...? నేను నచ్చచెబుతాను చూడు""అంది.
"చంటి ఇలారా!" అంటూ పిలిచింది.
"ఏంటి అమ్మమ్మ!"అంటూ వచ్చాడు చంటి. "నీవు చదువు పట్లనిర్లక్ష్యంగా ఉన్నావు కదా! నిన్ను పాఠశాలలో ఎప్పుడూ మందలిస్తుంటారు కదా! చంటి నేనొక మంచి మాట చెబుతా విను.సత్యకాలంలో దేవుడైన బాల కృష్ణుడే వెన్న దొంగతనం చేస్తే యశోదమ్మ రోకలికి కడుతుంది.శ్రీ కృష్ణుడే శిక్షను ఒప్పుకున్నాడు, మనం ఎంత ?నువ్వు హోమ్ వర్క్ చేయలేదు అనే కదా వాళ్లు నిన్ను అరిచేది.ఆ హోమ్ వర్క్ ఏదో ఏ రోజుది ఆ రోజు చేస్తే సరిపోతుంది కదా! బాగా చదువుకుని, క్రమశిక్షణగా పెద్దలమాట విన్న వాళ్ళు జీవితంలో సుఖంగా బతుకుతారు.పెద్దల మాట పెడ చెవిన పెట్టేవాళ్ళు ఎప్పుడూమంచి జీవితాన్ని గడపలేరు.పట్టుదలతో, ఏకాగ్రతతో కష్టపడి చదవటం అలవాటు చేసుకో.మాకు నీకు మంచి పేరు వస్తుంది." అంటూ హితబోధ చేసింది అమ్మమ్మ.
అలాగే అంటూ చంటి తలదించుకున్నాడు. అప్పటి నుండి చంటి తన మొండితనాన్ని వదిలేసి,అల్లరి మాని శ్రద్దగా మనసును చదువువైపు మరల్చాడు.
.