ఓ.."మహిళా రైతు" అంతరంగం:- సరోజన

 నేను పెద్ద,పెద్ద సదువులు సదవలే.నాకు తెలిసింది కాయ,కట్టం సేసుడు.అవ్.. సేను సెలక పని సేసుడు. ఎండ,ఆన,సలి ఏది లేదు.పంట సేతికి అచ్చినంక గుప్పెడు మెతుకులతో అందరి కడుపు నింపాలే.. అగో గప్పడి దాకా.భూదేవర లెక్క...
నాగళ్లతోని కడుపు సీల్చుకుంట దున్నుతా ఉంటే గా భూదేవర పానం ఎంత తండ్లాతుంది.అయిన గూడ గా తల్లి కడుపు కోసి ఇత్తులు నాటితే..మన అందరిని బతికిచ్చు టానికి పంట నిత్తంది. గి భూమ్మీద ఉన్న పతొక్క జీవ రాసి గా తల్లి బిడ్డలే గా..గందుకే ఎన్ని సేసిన గా భూదేవర ఓర్సుకుంటది. అగో గట్లనే నేను గూడ.
నాతిరి అనక,పగలనక  గట్ల ఎంబడి తిరిగే మమ్ముల ఏ పురుగు,బుషో కుట్టిన,కరెంటు మోటారులతోని మా ఇంటి పెద్ద పానాలు పొయ్యి  మా బతుకులకు కరెంటు షొక్ కొట్టిన.
మల్ల తెల్లారి పొలంకి పొయ్యి నాలుగు ఇత్తులు నలుగురి కడుపు నింపాలే అని మల్ల ఎవుసం సేసుడే.
ఇగ మేము ఎంత కట్ట పడ్డ ఒగో పారి పెట్టువడి సుత రాదాయే.. పెట్టువడి కోసం సేసిన అప్పు  తీర్సు టానికి   పెయ్యి మీద నగలతోని తినే తలే,ముంత అన్ని తాకట్టు పెట్టుడునాయే.
ఇగ పండగకో ,పబ్బానికో పెయ్యి మీద కొత్త బట్ట పేగు లేక పోయిన సినిగిన సీరెకు అతుకులు వెట్టుకొని కాలం ఎల్ల దీసుకొని అయిన మల్ల సేనుకు పెట్టువడి తెచ్చి పెట్టుడినాయే.. గియన్ని సేసిన దలారోని సేతుల బతుకు లేనాయే.. గాడు ఎంత ఇత్తె గంతకే పంటను అమ్ముడాయే..గిన్నిటికి ఓర్సుకునేది.ఆకలి తోని అందరు కడుపు మాడి సావకూడదు అని.
గిన్నీ సేసిన నన్ను మాత్రం గి కాలీగం పట్టించు కోదాయే..
పెద్ద సదువులు సదివి,పెద్ద,పెద్ద కొలువుల సేసే టోళ్లనే మంచిగ సూసుకుంట గాళ్లను మేడం అని పిలుత్తరు,గాళ్ళు అత్తె లేసి నిలవడి అంగి ,అంగి దండాలు వెడుతరు.
సదువు గొప్పదే..కానీ గాళ్ళు బాగ సదివి కొలువు సేయాలి అన్న కడుపుల ఒసర ఉండాలి.కడుపు నిండు తేనె కదా ఒసర ఉండేది..గా కడుపు నింపే మమ్ముల ఇడిసిపెట్టి గాళ్లకు మాత్రమే సలాం కొడుతరాయే..
ఇగ ఇంత పార్టీలల్ల తిరిగి గండ్ల గెలిసిన అక్కల ముచ్చెట సెప్పుడే అక్కర లేదు..ఏడికి పోయిన దండలు ఏసుడు దండాలు వెట్టుడు. ఎనకో నలుగురు ముందో నలుగురు గా అక్క పాణాలకు  కావాలి.
ఇగ నేను మా అవ్వ ఒడిల నేర్సిన భాష నే ముచ్చట సెప్తా.. గది అందరికి మనసున వడుతది కానీ గీళ్ళందరు ఏందో సదువు కున్నోల్లమ్ అని ఏదో పారాయి భాషల ముచ్చెట సెప్తే మా లాంటి ఒల్లకు ఎమ్ మనసున వడుతది.గాళ్ళు ఎమ్ ముచ్చెట సేప్పిండ్రో కూడ తెల్వద్ ఇగ.
ఇగో గిట్ల నాలెక్క పొలం పని సేసే ఎవుసాయా కూలి,పొద్దంత ఇంటడు సారిగెమ్ సేసి తను తినకున్న ఇంట్ల కొలువు పోయే టోళ్లను ఆళ్ళు ఏది అడిగితే అది  అలిట్ట పడకుండ సేసి పెట్టే ఇంట్ల ఉన్న  అవ్వలు,అక్కలు..గీళ్ల కట్టం కూడ ఎవరికి పట్టింపు లేకపాయే..
"మహిళా దినోత్సవం" అని పేరు సెప్పి గా పెద్ద మనుషులను పెద్ద నౌకరి సేసే టోళ్లను ,పార్టీలల్ల తిరిగే టోళ్లనే ఏదిక అని పెట్టి గాళ్లను పిలిసే సంబురంగా శాల్వాలు కప్పుతారాయే..
గింత సేసిన మమ్ముల కింద కూసో వెట్టి గాళ్లకు సప్పట్లు కొట్టించు కుంటరు..
ఇగో పెద్ద మనుషులు ,ఓ.పెద్ద పెద్ద అక్కలు జెరంత ఇగ నన్న  మారుండ్రి..
మాకు మీ లెక్క తగిన గౌరవం ఇయిండ్రి..
కొంచెం అందరిలో ఆలోచన మొదలు అవుతుంది అని ఆశిస్తూ..
 రైతులందరికి నా సంఘీభావం తెలుపుతూ....
అందరికి "మహిళా దినోత్సవ" శుభాకాంక్షలు..
~~ SN ~~
   సరోజన