చిత్రకళా వేదిక
వేళయ్యింది
మూసారు తలుపులు
ప్రేక్షకులు
బయటకు వచ్చేసారు
కొందరి కళ్ళల్లో
వర్ణాలు
ప్రతిబింబిస్తున్నాయి
నిశ్శబ్ద రాత్రిలో
వర్ణాలు
నదీప్రవాహమై
వేదిక గదినిండా
వ్యాపించింది
ఆరోజు రాత్రి వరకూ
అందరినీ ఆకట్టుకున్న
చిత్రాలన్నీ ఒకదానికొకటి
దగ్గరయ్యాయి
ఓ చిన్నారి
పరుగున వచ్చి
మరొక చిత్రంలో ఉన్న
పెద్దాయనను
బాగున్నావాని పలకరించింది!!
ఇంకొక చిత్రంలో ఉన్న
పసుపు వన్నె పువ్వులను
రెండో చిత్రంలో ఉన్న చిన్నారి
నెమ్మదిగా కోసింది
వర్ణాలలో
మునిగి తేలుతున్నాయి
పువ్వులూ
మనుషులూ
ప్రదేశాలూ
ఇంకొక చిత్రంలో
భయం భయంగా
చూసే పిల్లిని
ఎత్తుకొస్తోంది
ఓ తల్లి
ఆమె చేతులను
నాకుతోంది పిల్లి
ప్రేమ వర్ణాలు మెరియగా
ఆకలిగొన్న చిన్నారి
ఎరుపు రంగులోని స్వీటుని
లాగించి
పచ్చ రంగులోని
రసాన్ని తాగింది
ఆత్మానందం కోసం
వర్ణాలకూ
కుంచెలకూ
అంకితమైన చిత్రకారుడు
తన మనసంతా
సంగమించిన తీరును చూసి
హాయిగా నవ్వుకుని
సేదదీరాడు
వర్ణాల పరిమళం
అతనిలో
అణువణువూ వ్యాపించింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి