తప్పని ప్రయాణం:-- యామిజాల జగదీశ్
 పొద్దున్నే ఓ సమాచారం. వెళ్ళితీరాలి. వెళ్ళవలసిన చోటు బహుదూరం. ముప్పావు దూరం వరకూ బస్సులో వెళ్ళి మిగిలిన దూరాన్ని షేర్ ఆటోలో ప్రయాణించి కాలనీలోకి ఓ పావు గంటపైనే నడవాలి. 
అయితే నాముందున్న సమస్యలు రెండు.
ఒకటి - డబ్బులు తక్కువ పడటం. 
రెండు - మోకాలి నొప్పులు.
కానీ వెళ్ళవలసిన స్థితి. 
కనుక బస్సు ఛార్జీలకు అవసరమైన డబ్బులు జేబులో వేసుకుని కుంటుకుంటూ కుంటుకుంటూ బయలుదేరాను. బస్సు ఎక్కాను. దిగాను. అక్కడి నుంచి ఓ మూడు నాలుగు కిలోమీటర్లు నడిచాను. నిజానికి ఇంత దూరం నడవడం నాకేమీ కష్టం కాదు. ఆర్టీసీ సమ్మె వేళ బస్సులు లేకుంటే ఓ పది పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి అలాగే తిరిగీ ఇంటికి నడిచొచ్చిన రోజులున్నాయి. ఐతే అప్పట్లో మోకాళ్ళ నొప్పులు లేవు. కానీ ఇప్పుడు మోకాలి నొప్పులతో నడక వేగం తగ్గింది. దగ్గర దూరాలనుకూడా ఎక్కువ సేపు నడవక తప్పడం లేదు. ఈ నిస్సహాయ నడకకు తోడు ఎండవేడి. చెమటలు కక్కుతూ నడవడం. పైగా మార్గమధ్యంలో ఓ కాలి చెప్పు తెగిపోయింది. తెగిన చెప్పుని కుట్టుకుందామంటే డబ్బులేదు బస్సు ఛార్జీలు తప్ప. కనుక నడక నరకప్రాయమే అనిపించింది. పోనీ చెప్పులు పారేసి ఉత్తి కాళ్ళతో నడుద్దామనుకుంటే ఎండవేడి మామూలుగా లేదు. దారిపొడవునా నీడనేదే లేదు నడుద్దామంటే. ఎలా నడిచానో గమ్యస్థానానికి ఎలా చేరానో ఎలా మళ్ళీ ఇంటికి చేరానో అన్నది ఆ కాళ్ళకూ అరిగిపోయిన చెప్పులకే ఎరుక. 
తిరుగు ప్రయాణంలో ఓ అరటిపండ్లమ్మే బండి దగ్గర ఆగి ఎండిపోతున్న పెదవులూ గొంతునీ తడుపుకోవడానికి నీళ్ళివ్వమని అడిగాను. మంజీరా నీళ్ళయితే ఉంది ఇస్తాను...దుకాణాల్లో అమ్మే సీసా నీళ్ళయితే లేవన్నాడతను. నీ దగ్గరున్న నీరు ఏదైనా పరవాలేదు.... ముందు గొంతు తడుపుకోవాలి...మాడు అదురుతోంది... అడుగు పడటం కష్టంగా ఉంది....దారిలో ఎక్కడైనా పడిపోతానేమో అని అంటుంటే అతను తన దగ్గరున్న నీరిచ్చాడు. ఓ ఆరు గుక్కలు తాగాక అమ్మయ్య అనిపించింది. పోయిన ప్రాణం లేచొచ్చినంత పనైంది. ఆ క్షణంలో అతను దేవుడల్లే కనిపించాడు. 
అతనికి ఒకటికి పదిసార్లు థాంక్స్ చెప్పి, భుజంమీద చెయ్యేసి వస్తానంటూ కాళ్ళీడుస్తూ ఇంటికి చేరాను. 
మరచిపోలేనీ ప్రయాణాన్నెప్పటికీనూ.