కొత్త తరం కథలు - 07:-- రక్షిత సుమ
 విచ్చలవిడిగా అడవి జంతువులను తినేసే సింహం.... బావిలో ఇంకో సింహం ఉందని చెప్పి దాని ఆట కట్టించిన కుందేలు.... గుర్తున్నాయా...? వాటి తరవాతి తరం కథే ఇది...!
ఆ సింహం చనిపోయిన తరువాత జంతువులన్నీ ఏ యిబ్బందీ లేకుండా జీవిస్తుండేవి.కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆ సింహం మనవడు వచ్చి మళ్ళీ అడవిని అతలాకుతలం చేయ్యసాగాడు.దాని బాధనుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని కనుకుందామని జంతువులన్నీ ఒక చోట సమావేశం అయ్యాయి.
జంతువులన్నీ తీవ్రంగా చర్చిస్తుండగా,చప్పట్లు కొడుతూ ఒక కుందేలు పక్కనే ఉన్న రాయి పైకి ఎక్కి " వినండి వినండి! నాకొక ఆలోచన వచ్చింది.నేను వెళ్లి దానికి బుద్ది చెప్పి వస్తాను" అని అంది.
"నువ్వా..!" ఆశ్చర్యంగా అన్నాయి జంతువులన్నీ.
"ఇదిగో పిల్లా..అప్పుడంటే ఏదో మీ తాత అదృష్టం బావుండి ఆయన ప్లాన్ వర్కవుట్ అయ్యింది.ఇప్పుడు ఆ పప్పులేమి ఉడకవ్."గుంపులొంచి బయటకి వస్తు అంది ఎలుగు బంటి.
"మీరేం కంగారు పడకండి,ఆ సింహం సంగతి నేను చూస్కుంటా." హామీ ఇచ్చింది కుందేలు.
జంతువులన్నీ జాగ్రత్తలు చెప్పయి.కుందేలు సింహం దగ్గరికి బయల్దేరింది.
గుహ బయట నిలబడి " సింహం మామా.. ఓ సింహం మామా, గుహలో ఉన్నావా?"అంటూ పిలిచింది.
"మామా దోమా అని వెధవ వరసలు కలపకు..నువ్వు ఎందుకొచ్చవో తెలియదు గానీ, మాంచి మధ్యాహ్నం సమయంలో వచ్చావు.ఈ పూటకి నా ఆహారం నువ్వే" అంటూ గుహ బయటకి వచ్చింది సింహం.
"ఎంత మాట అన్నవ్ మామా...!నువ్వు ఆ తప్పు చెయ్యకూడని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను."కొంచెం భయంగా చెప్పింది కుందేలు.
"తప్పా...ఏం తప్పు...సరిగ్గా చెప్పు..లేదంటే ఇప్పుడే చంపేస్తా"
"అయ్యో...అదికాదయ్య సామి...అప్పట్లో మీ తాత చేసినట్టే నువ్వూ విచ్చలవిడిగా జంతువులని చంపుతున్నవ్ కదా! అయితే..మా తాత రాత్రి కలలోకి వచ్చి నిన్ను హెచ్చరించమని చెప్పారు."
" హెచ్చరికా...?! నాకు హెచ్చరికా..!!?! ఎంత ధైర్యం నీకు..!?!"కోపంతో పంజా చూపించింది సింహం.
"నువ్వు నమ్మకపోతే ఈ గుహ పక్కన ఉన్న బావి దగ్గరకి రమ్మన్నాడు.అక్కడ చెప్తాడట" గబగబా చెప్పింది కుందేలు.
కళ్ళు పెద్దవి చేసి, ఏదో ఆలోచిస్తూ..."ఓహో.....ఆ బావి దగ్గరకా... పద వెళ్దాం!"అండి సింహం.
రెండూ నడవడం మొదలుపెట్టాయి.
అక్కడికి చేరుకోగానే " ఇక్కడికే నా రమ్మన్నది." చిన్నగా నవ్వుతూ అడిగింది సింహం.
"ఆ..అవును.." సింహం ప్రవర్తనకి కాస్త అనుమాన పడుతూ చెప్పింది కుందేలు.
"ఈ బావిలో మా తాత గొంతు ఇంకా వినిపిస్తుంది తెలుసా.అందుకే ఇక్కడికి ఎవ్వరూ రారు.అలాంటిది చచ్చిపోయిన మీ తాతా ఇక్కడికి వచ్చాడంటే ఆశ్చర్యమే....కావాలంటే విను" అంటూ కుందేలును బావిలోకి తోసేసింది.
"ఒక్కసారి పిచ్చోళ్ళం అయ్యాం కదా అని ,మళ్ళీ మళ్ళీ ఆటలు ఆడితే ఇలానే అవుతది " అంటూ గట్టిగా గర్జిస్తూ వెళిపోయింది సింహం.
కుందేలుకు అలా జరిగిందని తెలిసి జంతువులన్నీ బాధపడ్డాయి.
ఆ రోజు రాత్రి సింహం, గుహలో విశ్రాంతి తీసుకుంటుననప్పుడు,ఒక విచిత్రమైన ఆకారం యొక్క నీడ దాని గుహ ముందు కనిపించింది.
ఎప్పుడూ చూడని ఆకారం కావడంతో కాస్త గాబారాగా అనిపించినా ధైర్యం తెచ్చుకొని."ఎవరది..?" అని అడిగింది.
"నా హెచ్చరికను పట్టించుకోకపోవడమే కాకుండా అది చెప్పడానికి వచ్చిన నా మనవరాలిని కూడా బావిలోకి తోసి,పెద్ద తెలివైన వాడివనుకుంటువ్ కదా..ఇప్పుడు చెప్తా ఆగు నీ పని"అంటూ పెద్ద శబ్దం చేస్తూ ముందుకు కదులుతోంది ఆ ఆకారం.
"వామ్మో...కుందేలు వాళ్ళ తాతా...?!! ఆ కుందేలు చెప్పింది నిజమే కావొచ్చు.నేనే దాని మాట అనవసరంగా వినలేదు"అని లోపల అనుకుంటూ..
"లేదు లేదు....నన్నేం చెయ్యకండి తాతగారు. ఆ కుందేలు అబద్దం చెప్తుందనుకున్నను.మీరు నిజంగా వస్తారనుకొలేదు.నేను అలా చెయ్యడం తప్పే 
కానీ ఏంచెయ్యమంటారు,నా ఆహారమే అవి కదా!"కాస్త భయంగా చెప్పింది సింహం.
"అలా అని అవసరానికి మించి ఇష్టం వచ్చినట్టు చంపేయడం కూడా న్యాయం కాదు కదా!
నీలో మార్పు వచ్చిందా సరే సరి,లేదంటే నేను మళ్ళీ వస్తాను.ఈసారి వచ్చానంటే నిన్ను కూడా మీ తాత దగ్గరికే తీసుకెళ్తా జాగ్రత్త."అని చెప్తూ ఆ నీడ మాయమైంది.
అప్పటినుంచి ఆ సింహం అనవసరంగా వేటాడటం మానేసింది.సింహం లో ఈ మార్పుని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి.
కానీ ఆ తరువాత కుందేలుని బావిలో తోయడం, కుందేలు వాళ్ళ తాత విచిత్రమైన నీడ రూపంలో సింహం గుహదగ్గరుకి వచ్చి దానిని హెచ్చరించడం గురించి నక్కా ,ఎలుగుబంటి తెలుసుకున్నాయి .
ఈ విషయాన్ని మిగతాజంతువులకి చెప్పడం కోసం వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.జంతువులన్నీటితోపాటూ మొన్న సింహం బావిలోకి తోసిన కుందేలు కూడా రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యంతో నోర్లువెల్లబెట్టాయి.
అది చూసిన కుందేలు చిన్న నవ్వు నవ్వి "కంగారు పడకండి,నేను చనిపోలేదు.మొన్న ఆ సింహం నన్ను బావిలోకి తోసి వెళ్ళిపోయాక నేను ఆ బావిలో ఉన్న నా మిత్రుడు తాబేలు సహాయంతో బయటకి వచ్చి ఆ సింహానికి బుద్దిచెప్పే ప్లాన్ అమలు చేసాను."
జంతువులన్నీ ఆసక్తిగా వినసాగాయి.
"నేను నా మిత్రుడు తాబేలు మీద ఎక్కి,తాటాకులు,కొబ్బరి పుల్లల లాంటి వాటితో ఒక భయంకరమైన ఆకారంలా తయారయ్యాం. మా వెనక ఒక చిన్న మంట వెలిగించి ఆ విచిత్రమైన నీడని సింహం గుహలో పడేటట్టు చేసాము. వెదురు బొంగు సహాయంతో మా గొంతు బిగ్గరగా భయంకరంగా వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్కున్నాము.ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుకదా"అంటూ నవ్వేసింది కుందేలు.
తన తెలివితో అంత పెద్ద సమస్యనుంచి జంతువులన్నీంటిని బయటపడేసిన కుందేలుకీ,
దానికి సహాయం చేసిన తాబేలుకీ జంతువులన్నీ కృతజ్ఞతలు చెప్పి,ఘనంగా సన్మానించాయి.


కామెంట్‌లు