గుడ్మార్నింగ్ -(181 వ రోజు)-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'వృత్తిని బట్టి కంఠస్వరం' అని ఓ రష్యన్ మహా రచయిత- 'కుప్రిన్' అనే ఆయన ,తాను రచించిన ఓ కథలో ఒక చోట రాస్తాడు! ఓ నలబై అయిదు సంవత్సరాల క్రితం అనుకుంటాను,నేను ఆ మాటను చదివాను! 
ఆ మాట ఎంతో నిజం అనిపించింది!
నేను పుట్టి పెరిగిన మా గ్రామంలో ఉన్న వివిధ రకాల వృత్తుల వారిని- రైతులను , గ్రామంలో ఉన్న అధికార కుటుంబ సభ్యుల కంఠస్వరాలు వివిధ కులాల మనుషుల కంఠస్వరాలు మనసులో ధ్వనించాయి!
అప్పటి గ్రామంలో ఓ దొర కంఠస్వరం, ఓ దొరసాని కంఠస్వరం ఎలా ఉంటాయో నాకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి! ఓ దొర కంఠస్వరం లాగా ,ఓ పాలేరు కంఠస్వరం ఎందుకు ఉండదు? తేఢా దేనివల్ల?
నేను పారిశ్రామిక ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం వచ్చిన తరువాత,నా చుట్టూ ఉన్న మనుషులను వారి వృత్తులను ఉద్యోగాలను పనులను , వారి వారి కంఠస్వరాలను గమనించడం అలా ప్రారంభం అయింది! 
మనం జాగ్రత్తగా గమనిస్తే?
పోలీసులు ,ఉపాధ్యాయులు ,రకరకాల వ్యాపారాలు చేసేవారు,మధ్యతరగతి గృహిణులు, బిక్షాటన చేసేవారు, అధికార్లు,పనివారు,ఇలా ఆధునిక యుగంలో ఉన్న, లేదా పారిశ్రామిక విప్లవ తదనంతర కాలంలో కొత్తగా ఏర్పడిన అనేక ఉద్యోగాలను మనుషులను గమనించడం ప్రారంభం అయింది! కుప్రిన్ మహాశయుని ఆ మాటలు ఎంత వాస్తవమో అర్థం కావు! 
కొన్నాళ్ళ పాటు ఓ వృత్తో ఉద్యోగమో వ్యాపారమో లేదా బ్రతకడానికి అవసరమయ్యే ఏదో ఒక పని చేసుకుని జీవించేవారి కంఠస్వరాలు‌ మారతాయి.ఒకే వృత్తి చేసే వారి కంఠస్వరాలు సుమారు ఒకలాగే ధ్వనిస్తాయి! 
ఆ కంఠస్వరాలను బట్టి ,వారు సుమారు ఏ వృత్తులు చేస్తారో అంచనా వెయ్యవచ్చు! బొగ్గుగనుల్లో పనిచేసే వారు కొన్ని ఉద్యోగాలు చేసేవారి కంఠస్వారాలు సుమారు ఒకే లాగా ధ్వనించడం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది!
ఓ కింది స్ధాయి జర్నలిస్టును గమనిస్తే, అతని కంఠస్వరం ఎలా మారిందో బోధ పడుతుంది!
అంతలా మారతాయి కంఠస్వరాలు!
మానవజీవితాన్ని కాచి వడబోసి , దాని సారాంశాన్ని ఒక మాటలో చెప్పిన కొటేషన్ అది!
నేను ఆ మాటను మనసులో పెట్టుకుని, దాన్ని ఓ గైడ్ లైన్ గా పెట్టుకుని, చూస్తున్న క్రమంలో ,మరో అబ్జర్వేషన్ కు దారి తీసింది! అదేమిటి అంటే?
'వృత్తిని బట్టి శరీరం' అని కూడా అర్థం అయింది!
వృత్తులు ఉద్యోగ వ్యాపార తదితర వ్యవహారాలు మనుషుల కంఠస్వరాలను మార్చడం ఎంత నిజమో,అలాగే వారి శరీరాలను కూడా మారుస్తాయనేదీ కూడా అంతే నిజం అనిపించింది!ఇదంతా ఇప్పటి మాట కాదు- దాదాపు ఓ నలబై ఐదు సంవత్సరాల క్రితం!
ఇప్పుడు కుప్రిన్ గారి మాట- నా అబ్జర్వేషన్ పాత మాటలు కావచ్చు కానీ, అప్పటికి అవి కొత్తమాటలు! నన్ను నేను జాగ్రత్త పడేలా చేసిన మాటలు- అబ్జర్వేషన్!
నా తరపు వాళ్లలో- నా తరువాత తరపు వాళ్లలో చాలా మంది అలాగే మారిన వారు ఉన్నారు! 
ఓ పోలీసు తన డ్యూటీ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా ,అతని ప్రవర్తన మాట తీరు అలాగే ఉంటుంది! ఓ ప్రభుత్వ ఉపాధ్యాయున్ని గమనిస్తే, అతను తరగతి గది బయట కూడా తాను ఉపాధ్యాయుడు గానే బిహేవ్ చేస్తాడు- నటిస్తాడు!
అలాగే చాలా మంది నటిస్తారు!
కొంతమంది తెలుగు సినిమా హీరోలను మనం గమనిస్తున్నాం కద!? నిజంగానే వారు తమకు తాము హీరోలం అని భ్రమపడుతూ ఉంటారు! వారి కంఠస్వరాల్లో కూడా మార్పు ఉంటుంది!
తాము వేసింది వేషం అని,అది నటన అని మరిచిపోతారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఈ జబ్బు ఉండదు గమనించండి!
కొందరు హీరోయిన్లలో కూడా మళ్లీ ఇలాంటి జబ్బే ఉంటుంది!
వృత్తులను ఉద్యోగాలను వ్యాపార వగైరా వ్యవహారాలు బ్రతుకుతెరువు కోసం చెయ్యవలసి ఉంటుంది. అవి మన జీవనవిధానాలు కాకూడదు! వాటన్నిటినీ 'వేషాలు' గా భావించాలి! మేకప్ విప్పగానే, తిరిగి సాధారణ మనుషుల వల్ల మారాలి. 
వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు మన శరీరాలను మన కంఠస్వరాలను మార్చడమే కాదు, ఏమరుపాటుగా ఉంటే,మన స్వభావాలను కూడా మారుస్తాయి! జాగ్రత్తగా ఉండాలి! వృత్తి వేరు- జీవితం వేరు!