గుడ్మార్నింగ్ (185 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 చిన్న చిన్న విషయాల గురించి ,మనం పెద్దగా ఆలోచించం!
నిజానికి అవి చిన్న చిన్న విషయాలు కావు! చాలా ముఖ్యమైన విషయాలు! అవి మన మనస్తత్వాలను ,మన సంస్కారాలను బయట పెడతాయి! మన పెంపకం, మన అశ్రద్దను ఎత్తి చూపుతాయి! కొందరి దృష్టిలో మన పట్ల చులకన భావం ఏర్పడుతుంది!
ఉదాహరణకు తిన్న పళ్లాలు , తాగిన గ్లాసులు కడగడం గురించి చెప్పుకుందాం! మన మన ఇళ్లల్లో మనం తిన్న పళ్లాలను మనం కడిగి పెడుతున్నామా , మనం తాగిన గ్లాసులను మనం శుభ్రం చేసి పెడుతున్నామా అనేది ఇతరులకు అవసరం లేని విషయం! కానీ, మనం ఇతరుల ఇళ్లల్లో భోజనాలు చేసినప్పుడు, తాగినప్పుడు,మన పాత్రలను మనం శుభ్రం చేసి పెడుతున్నామా? లేక తిని తాగి త్రేన్చి , పాత్రలను అలాగే టేబుల్ మీద వదిలేసి లేస్తున్నామా అనేది , మన మొత్తం తత్వానికి చెందిన విషయం అవుతుంది! మన మూతిని మరొకరు కడిగితే మనకు ఎలా ఉంటుంది? బాగుండదు కద? అసహ్యం కలగదూ!? అలాగే మనం తిని తాగిన పాత్రలను ఇతరుల ఇళ్లల్లో మనం వదిలెయ్యడం కూడా అలాగే ఉంటుంది!షేమ్ అనిపిస్తుంది!
స్నేహితుల బంధువుల ఇళ్లల్లోకి వెళ్లినప్పుడు,విందులు వగైరాలకు వెళ్లినప్పుడు, మనం తిన్న పాత్రలను మనం శుభ్రం చెయ్యడం కనీస మర్యాద! అది మనలోని సంస్కార దారిద్ర్యాన్ని బయట పెడుతుంది! మనం నామోషి అనుకున్న పనిని మరొకరు ఎలా చేస్తారని మనం ఆలోచన చెయ్యాలి! అదీ మన పనే అయినప్పుడు- అందులో మనం తిని తాగిన పాత్రలను కడగడం గురించి అయినప్పుడు ఎలా ఉంటుంది?
అసలు చాలా మంది తాము తిన్న పాత్రలను తామే శుభ్రం చెయ్యాలనే జ్ఞానం కూడా కలిగి ఉండరు.అదంతా ఇంటి ఆడవారి పని అని‌ అనుకుంటారు! మన ఇంట్లో మనం అనుకుంటే అది మనిష్టం- మందికి సమస్య కాదు!
మనం ఇతరుల ఇళ్లల్లో తిన్నప్పుడు, మన పాత్రలను మనం శుభ్రం చేసి పెట్టడం మన కనీస ధర్మం!
మనం తిన్న పళ్లాన్ని మనం కడగడానికి లేస్తే, ఇంటివారు వద్దవద్దు అని అంటారు చాలా ఇళ్లల్లో! దాని కోసం పోరాటం చేసినంత పని ఔతుంది! ఇతరుల శ్రమల మీద పడి బ్రతికే మనుషులు ఒకప్పుడు ఇతరుల పళ్లాలు కడిగితే పుణ్యం లభిస్తుంది అని ప్రచారం చేశారు. అలా చెప్పేవారు ఎవరూ ఆ పని చెయ్యరు.అది శ్రమ కనుక!
దొంగలకు కూడా , దొంగ సిద్దాంతాలు ఉంటాయి!
కొందరు ఆడవారు నిజంగానే ఫీలౌతారు,మనం కడగబోతుంటే! అలా అలవాటు అయింది మన ఆడవారికి- అలా చేసారు మగవారు! 
మనం మన ఇళ్లల్లో ఏ పని చెయ్యకపోయినా పరవాలేదు కాని, మనం తిని తాగిన పాత్రలను మనం కడగడం మన కనీస సంస్కారం! అమ్మ అక్క చెల్లి భార్య ఎవరైనా కావచ్చు , అయినా మనం తిని తాగిన పాత్రలను మనమే కడగాలి, వారిచే కడిగించేలా చెయ్యకూడదు!
ఏదో చిన్నప్పుడు వేరు,లేదా ఏదైనా సిక్ అయినప్పుడు వేరు,అప్పుడు ఇతరుల సహాయం అవసరం అవుతుంది. అది వేరు. కాళ్లూ రెక్కలు ఆరోగ్యం అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు, మనం తిని తాగిన పాత్రలను మనమే కడగి పెట్టాలి. మనం కడగబోతున్నప్పుడు వద్దు వద్దని వారించే స్త్రీలు , మనం కడిగిపెట్టిన తర్వాత 'ఇలా అందరు మగవారు ఉంటే ఎంత బాగుండును' అని నిట్టూరుస్తారు!
మనసులో మనల్ని అభినందిస్తారు!