గుడ్మార్నింగ్ (190 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు!
ఉగాది అంటే? ప్రధానంగా ఇది వ్యవసాయ నాగరికతకు సంబంధించిన పండుగ! వాతావరణ సంబంధిత పండుగ!
వచ్చే సంవత్సరం ఎలా గడవబోతోందో తెలుసుకోవడానికి ప్రధానంగా ఆసక్తి చూపుతారు! భవిష్యత్తును తెలుసుకోవడానికి కుతూహలాన్ని చూపుతారు!
ఈ ఉదయం నుండి టీవీ కార్యక్రమాల్లో ఉగాది గురించి,దాని పుట్టుపూర్వోత్తరాల గురించి, దాని ప్రశస్తి గురించి , ఉగాది పచ్చడి గురించి చర్చిస్తారు! పనిలో పనిగా రకరకాల దైవభక్తుల గురించి ,రకరకాల ప్రవచనకారులు హితబోధలు చేస్తూ ఉంటారు!
సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది.టీవీలు అందుబాటులోకి వచ్చిన తరువాత, ఇటువంటి కార్యక్రమాలు విపరీతంగా నిర్వహిస్తున్నారు!
పంచాంగ పఠనం చేసే పండితులు ధగధ్ధగలాడే పట్టు వస్త్రాలు ధరించి, తెల్లని నూలు చలువ వస్త్రాల పరివేష్టిత అధికారం ముందు వారి అస్మదీయుల ముందు ,కాస్తా ఒద్దికగా, కాస్తా దర్పంగా కూర్చుని, పంచాంగ పఠనం చేస్తుంటారు- ఆహూతులు వింటూ ఉంటారు!తమ తమ రాశుల వారికి అదృష్టాలు ఎలా ఉండబోతున్నాయో ఎంతో క్యూరియాసిటీతో వింటూ చర్చిస్తూ ఉంటారు! కాంట్రాక్టులు పర్సంటేజీలు వగైరా - పంచాగ పండితులు కూడా రాజకీయ పార్టీల వారీగా చీలిపోయి ఉన్నారు! అధికారంలో ఎవరు ఉంటే, వారికి అనుకూలంగా భవిష్యత్తు గురించి చెప్తుంటారు!కార్యక్రమాలను చేయించే వారికీ,పంచాంగ పఠనాన్ని కావించేవారికి ,ఏవో పరస్పర స్వప్రయోజనాలు సిద్దిస్తాయి! అదంతా వారి వ్యవహారాలు!
వీటన్నిటికీ పరాకాష్ఠగా కవిగాయకనటవైతాళికలు కూడా కొందరు అధికారాన్ని భజిస్తూ కీర్తి గానాలు చేస్తారు!
ఒకప్పుడు- ఓ అర్ధ శతాబ్దం క్రితం- ఓ తెలుగు గ్రామంలో- రోడ్డు రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థ లేని కాలంలో- ఓ పెద్ద చెరువు, మరో మూడు నీటి కుంటలు ఉన్న - అన్ని కులవృత్తుల సమాజంలో- ఎడ్ల నాగళ్ల వ్యవసాయ ఉత్పత్తి సాగిన ఓ పురాతన గ్రామంలో, ఉగాది ఉత్సవం ఎలా ఉండేది?
గ్రామాధికారులు మధ్యాహ్నం ఉగాది ఉత్సవం నిర్వహించేవారు.గ్రామ సర్పంచి, పోలీసు పటేల్ ,పట్వారీ లు , ఆ పనిని గ్రామ పురోహితుడి ద్వారా చేయించేవారు. అందరు రైతులను ఆహ్వానించేవారు.అప్పుడు ప్రధానంగా అందరి ఆసక్తి వాతావరణం మీద ఉండేది! ఆ రోజుతో ప్రారంభం అవుతున్న కొత్త సంవత్సరంలో వర్షాలు ఎలా కురువబోతున్నాయో అనేది మాత్రమే రైతులకు ఆసక్తికరమైన విషయం అయ్యేది! తమ అదృష్ట దురదృష్టాలన్నీ వర్షాలు కురవడం మీద ఆధారపడి ఉన్నాయి అని రైతులు భావించేవారు. అప్పటికి స్వాతంత్ర్యానంతర ప్రభుత్వ విధానాల వల్ల దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన 'వ్యవసాయ రంగ సంక్షోభం' మారుమూల గ్రామాల వరకు కూడా వచ్చి చేరింది. రైతు బ్రతుకు మార్కెట్ కు ముడివేయబడింది.పెట్టుబడులు పెరగడం - యాంత్రీకరణ- గిట్టుబాటు ధరలను ప్రభుత్వాలు పెంచకపోవడం- బ్యాంకులు అప్పులు - ఇక అప్పులు ఎరుగని భారత రైతులు ఆత్మహత్యల దాకా వచ్చారు.స్వాతంత్ర్యానంతరం జరిగిన ఆత్మహత్యల్లో అత్యధిక శాతం జనం భారతీయ రైతాంగమే! దేశానికి అన్నం పెట్టిన పాపానికి ,ప్రభుత్వాలను నడిపిన రాజకీయ పార్టీలు అన్నదాతలకు ఉరితాళ్లను- పురుగు మందులను ప్రతిఫలంగా ఇచ్చాయి!
గత సంవత్సరం ఇదే సమయంలో చైనా దేశంలో ప్రారంభం అయిన కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల పేరుతో ప్రభుత్వాలు దేశ పౌరుల జీవితాలను అస్తవ్యస్తం చేసాయి- అప్పుడు కూడా వ్యవసాయం మాత్రమే అందరినీ ఆదుకున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత, చెరువుల పూడిక- నీటి పారుదల సౌకర్యాలు పెరగడం-సాగు భూముల విస్తీర్ణం పెరగడం-యాంత్రీకరణ పెరగడం- రైతుబంధు పతకం పేరుతో ప్రతీ రైతుకు పెట్టుబడి సహాయంతో- ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చెయ్యడం వంటి అతి ప్రధానమైన కార్యక్రమాలు సాగడం వల్ల ,రైతాంగం ఎంతో కొంత ఊరట పొందింది.ఫలితంగా ఎక్కడ చూసినా తారు రోడ్ల మీదనే ఎండబెట్టిన వరిధాన్యం 
మొక్కజొన్న కండెల దృశ్యాలు ,కనీస కాపలా ,తగిన రక్షణ లేకుండా ఎడతెగకుండా కనిపిస్తున్నాయి.వాటిని వెంటది వెంట కొనే దిక్కూ దివాణం లేదు. అన్నింటినీ మించి అంత అవసరం లేదు! ఓ అర్ధ శతాబ్దం క్రితం వరి కల్లాల్లో ధాన్యం దొంగతనాలు జరిగేవి.అప్పుడు తిండి దారిద్ర్యం ఉండేది. రైతులకు కూడా'కొత్త పాత' సందులో తిండి గింజలకు కొరత ఉండేది!చెయ్యి రికామీ లేకుండా పనులు ఉండేవి,అయినా తిండికి కొరతగా ఉండేది! అప్పుడు సంపన్న వర్గం సంఖ్య తక్కువ ఉండేది. 
అప్పుడు తిండి తక్కువ అవడం వల్ల సమస్యలు,
ఇప్పుడు తిండి ఎక్కువ అవడం వల్ల సమస్యలు!
ఎన్ని రకాల వ్యాధులో- ఎంత డబ్బు హాస్పిటల్ల వైపు ప్రవహిస్తోందో!?అభివృద్ధి అంటే ఎమిటి?
పండగలు అంటే, మూగజీవులను చంపి తినడం, మద్యాన్ని తాగడంగా దిగజారిందేమిటి?
మన ఉగాదులన్నీ మన ఉషస్సులన్నీ ,మూగజీవుల చావులకు వస్తున్నాయి ఏమిటి? ఇంతటి శాఖాహారాన్ని ఉత్పత్తి చేసుకుని తినే దశకు ఎదిగినా, ఇంకా జంతువులను దేవతల పేరుతో బలి ఇచ్చి వండుకుని తినే అనాగరిక క్రూరత్వాన్ని ఇంత నాగరికత నేర్చిన తరువాత కూడా కొనసాగించడం ఏమిటి? ఈ అమానవీయ చర్యలు, మనకు కల్యాణ ప్రదం కాదు! కాస్తా మనసుతో ఆలోచనలు చెయ్యాలి. మెదడును హృదయాన్ని కలిపి ఆలోచనలు చెయ్యాలి. కరుణ దయ కలిగి బ్రతకడానికి ప్రయత్నం చెయ్యాలి!
పెట్టుబడిదారీ రాజకీయాలు- విపరీతంగా వస్తూత్పత్తులు- ప్రజల్లో వినియోగ తత్వాన్ని పెంచడం- భూమిని భూగర్భాన్నీ పర్యావరణాన్నీ నాశనం చేసే విధానాలు-అవినీతి- బంధుప్రీతి - వగైరా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసలైన వైరస్ వ్యాధులు!
ప్రతీ వారికీ ఇప్పుడు రూలింగ్ క్లాస్ లైఫ్ స్టైల్ ఓ నెరవేర్చుకోవలసిన డ్రీమ్! మనుషులు సౌకర్యాలకు సంతృప్తి పడటం లేదు, సుఖాలకు మరుగుతున్నారు! సుఖాలకు మరిగిన వారిని,వ్యాధులు మరుగుతున్నాయి!
ఇప్పుడు చాలా మందికి తిండి దారిద్ర్యం లేదు, ప్రేమ దారిద్ర్యం ప్రారంభం అయింది! దాన్ని పెంచడానికి టీవీలు సినిమాలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి!
ఉగాదులు వస్తూ పోతున్నాయి , ఉగాది రోజున తన భవిష్యత్తు గురించి ఆసక్తిని కనపరచడం మాత్రం మనిషి మరువలేదు. ఎందుకని?
వర్తమానంలో సరిగా వ్యవహారించ లేనివారు,
భవిష్యత్తు గురించి బెంగతో ఆసక్తితో ఉంటారు!

కామెంట్‌లు