గుడ్మార్నింగ్ (191 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 ఉదయాన్నే నిద్ర లేచి , వాకింగ్ చేసేవారిని, జాగింగ్ చేసేవారిని, ఆ రెండూ చెయ్యడం నెపంగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి నడకలు నడిచే వారినీ,నడిస్తే కాసింత కొవ్వు ఎక్కడ కరిగిపోతుందో అనే దిగులుతో అయుండాలి, కాళ్లూ చేతులు ఊగడం మినహా అసలైన బాడీ కదల్చకుండా వాకింగ్ జాగింగ్ వగైరా ఎలా చెయ్యవచ్చునో మనం నిత్యం పట్టణాలలో గమనిస్తూ ఉంటాం కద!?
ఇవాళ పల్లెటూళ్లలో కూడా 'వాకింగ్ కల్చర్' వ్యాపిస్తోంది!
ఈ వాకింగ్ వీరులు వీరమ్మల్లో చాలా మంది , డాక్టర్లు గట్టిగా చెప్పడం వల్ల ,ఉదయమో లేదా సాయంత్రమో వాకింగ్ వగైరా చేస్తూ ఉంటారు- బాగా ముదిరిపోయి పెళ్లిళ్లు కాని బ్రహ్మచారులు కూడా ,మాటి మాటికి ముందుకొచ్చిన చిరు బొజ్జలను చేత్తో తడుముకుంటూ  'దేవుడా' అనుకుంటూ వాకింగ్ వగైరా తిప్పళ్లు పడుతుంటారు!
ఉదయం నిద్ర లేవడమే ఒక విప్లవాత్మక చర్య!
మనం నిద్ర లేవడానకి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనల్ని బద్దకం వెనక్కి లాగుతూ ఉంటుంది! బద్దకంతో పోరాడి గెలిచిన తరువాత, నోరు శుభ్రం చేసుకుని మలవిసర్జన నానా ఇబ్బందులు పడి కానిచ్చుకుని , బూట్లు ట్రాక్ సూట్ వగైరా ధరించి, చెవులకు ఇయర్ ఫోన్లు తగిలించుకుని
బయటకు వచ్చి చూసేసరికి ' సూరయ్యగారు' (సూరమ్మ అని కూడా అందాం- వాళ్లను ఎందుకు చిన్నబుచ్చాలి)
వెక్కిరిస్తూ ఉంటారు!
మరికొందరు మరో తరహావారు ఉంటారు. వీరిది ధ్యాన వ్యవహారం! అందులో మళ్ళీ అనేక మంది గురువులు పద్దతులు ఉచ్చారణామంత్రాలు కూడా ఉన్నాయి!
ఓ గంటో ఎంతో, ఇహ శ్వాస క్రియ మీద మనసు పెట్టి, మళ్ళీ దాంట్లో ఏవో పద్దతులు ఎగబీల్చడాలు కాసేపు, దిగబీల్చడాలు మరి కాసేపు- నాకు ఎన్నటికి అర్థం కానీ విషయం ఈ ధ్యానం అనేది! అజ్ఞానంలో మనం ఉన్నప్పుడు మహా ఉత్తమమైన విషయాలు మనకు అర్థం కావు- ఇదీ అలాగే!
మరి కొందరు జిమ్ లకు వెళతారు.వ్యాయామం చెయ్యడానికి. పనిలో పనిగా కండలు పెంచడానికి కొన్ని వారాలో నెలలో ప్రయత్నాలు చేసి, పొడులు ద్రావణాలు వగైరా సేవిస్తూ, ఆ కారణంగా గుడ్లు వగైరా అదనంగా లాగిస్తూ , తరువాత కొనసాగేవారు అరుదుగా ఉంటారు.
మరికొందరు డబ్బుకు లోటు లేనివారు ప్రకృతి వైద్యం కోసం
శరీర బరువు తగ్గించుకోవడాని , దాన్ని షడ్డౌన్ చేయించుకుని రిపేరు వగైరా చేయించుకుని సన్నబడి వస్తారు. తిరిగి యధావిధిగా బరువు పెరుగుతారు!
ఇలా రకరకాల పాట్లు పడేవారిని మన ఆధునిక సమాజంలో ఎంతో మందిని గమనిస్తూ ఉంటాం!
అటువంటి వారికి నాదొక మనవి!
ఏమిటి అంటే?
మీరు ఉదయాన్నే ఆదరాబాదరాగా లేచి రోడ్లు పట్టుకు కాలుష్యం మధ్య పరుగులు పెట్టనవసరం లేదు!
ముక్కు మూసుకుని గంటల తరబడి ధ్యానం చెయ్యనక్కరలేదు.గంటలకు గంటలు జిమ్ముల్లో కండలు కరగదియ్యనవసరం లేదు- వేలకు వేలు పోసి ప్రకృతి ఆశ్రమాలకు వెళ్ళి రోజుల తరబడి ఉపవాసాలు ఉండనక్కరలేదు!
అయితే, మరేమిటి? అని అనుమానిస్తున్నారా?
కొంపదీసి పాత పాట మిద్దెతోట చెయ్యండి జనులార- ఆయురారోగ్యాలు పొందండీ జనులారా అని చెప్తాను అనుకుంటున్నారా? చఛ కాదు!
ఇది చాలా సులభమైన- ప్రతీ రోజూ మనం చేస్తూ ఉన్న
ఓ పనినే కాస్తా గుర్తెరిగి చెయ్యాలి.
అదేమిటి?
స్నానం!
ఔను! స్నానమే! గుర్తెరిగి చేస్తే , స్నానాన్ని మించిన వ్యాయామం లేనే లేదు మరి!
ఉదయాన్నే నిద్రలేచి దంతాల శుభ్రం-మంచినీరు తాగి, మలవిసర్జన వగైరా కానిచ్చీ - ఇక స్నానానికి ఉపక్రమించండి! స్నానం అంటే ఏవో నాలుగు మగ్గుల నీళ్లను ఒంటిమీద గుమ్మరించుకోవడం కాదు సుమా!
సబ్బు రాసి ఒళ్లంతా గట్టిగా రుద్దుకుని- ఒకటికి రెండుసార్లు
కాళ్లు చేతులు పొట్ట - సమస్త శరీర అవయవాలను మాలిష్ చేసుకోవడం- అలా చేస్తే , అన్ని శరీర భాగాలకు వ్యాయామం వల్ల అవాంతరాలు తొలగి తిరిగి రక్తప్రసరణ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది!
మనం నిద్రావస్థ నుండి జాగ్రదావస్ధకు మారాంటే- మన శరీరాన్ని తిరిగి చైతన్యవంతం చేసుకోవాలంటే- స్నానాన్ని మించిన వ్యాయామం లేదు- అదీ దాన్ని గుర్తెరిగి చేస్తేనే సుమండీ! స్నానాన్ని కూడా ఓ వ్యాయామం లాగా చెయ్యాలి! స్నానం చేసేటప్పుడు ధ్యాన దృష్టితో చెయ్యాలి! కంప్లీట్ గా మనస్సును స్నానం మీద లగ్నం చేసి, శరీరాన్ని బాగా రాసి రాసి తోమి తోమి కడగాలి.అప్పుడు శరీరంలోని ప్రతీ కణం ఉత్తేజితం అవుతుంది. శరీరం శక్తిని ఉత్పత్తి చెయ్యడం ప్రారంభిస్తుంది. నిజంగా స్నానం చేసిన తరువాత మన శరీరం ఒక పవర్ స్టేషను లాగా పనిచేస్తుంది. ఇక రోజంతా ఉత్సాహం మన వెంటే ఉంటుంది! ఇక ఎన్ని పనులైనా చకచకా చేసుకోవచ్చు.
చాలా మంది పనుల అనంతరం అలసట చెంది, దాన్ని పోగొట్టుకోవడానికి చివరికి స్నానం చేస్తారు.కానీ దినచర్య ప్రారంభమే ,స్నానంతో ప్రారంభించి చూడండి.
శరీరంతో కద ? మనం మన సమస్త కార్యకలాపాలు సాగించేది.మనల్ని మనం చైతన్యవంతం చేసుకోవాలి అంటే, నిద్ర లేవగానే మనం స్నానం చెయ్యాలి.శరీరం చైతన్యవంతం అవుతుంది. దాంతో పాటు మనసు కూడా చైతన్యవంతం అవుతుంది!
అయితే, స్నానాన్ని గుర్తెరిగి చెయ్యాలి. ఓ వ్యాయామం లాగా చెయ్యాలి- అదీ సంగతి! చిత్తగించాలి!

కామెంట్‌లు