గుడ్మార్నింగ్ (196 వ రోజు):-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని , పూర్వ పండిత లోకంలో 
ఓ సుభాషితం ఉంది. అంటే , అన్నం సాక్షాత్తూ ఆ పరమేశ్వర స్వరూపం , లేదా ఆ పరమేశ్వరి స్వరూపం అని అర్ధం! అన్నాన్ని దైవంగా భావించి, పొదుపుగా భుజించారు గత అనేక తరాల వారు! అన్నానికి‌ అంతటి విశేషమైన విలువను కల్పించుకున్నారు పూర్వులు!
అటువంటి మాటను మొదటిసారి చెప్పిన వారో , లేక, రాసిన వారో , వారు ఎవరో కానీ, వారికి ఈ పొద్దు నమస్కారించాలి అని అనిపిస్తోంది!
నిన్న సాయంత్రం నేను మా మిద్దెతోటలో అటూఇటూ పచార్లు చేస్తూ , మిత్రులు ఒకరితో సెల్ ఫోన్ నుండి మాట్లాడుతూ ఉండగా, కింద అటువైపు ఒక స్త్రీ గిన్నె నిండా అన్నాన్ని తెచ్చి చెత్త మీద విసిరేసి ఇంట్లోకి వెళ్లింది. ఆమెకు ఓ ముప్పై సంవత్సరాల లోపే ఉంటుంది వయసు.ఒక మేషన్ మేస్త్రీ భార్య ఆమె!ఇప్పుడు హౌస్ వైఫ్ గా 'మారింది'- ఇంతకుముందు మేషన్ కూలి ఆమె!
అన్నాన్ని అలా పారేస్తుంటే , నాకు ఆశ్చర్యం కలిగించింది!
బాధా  కలిగించింది. అలా అన్నాన్ని ఎలా పారెయ్యగలిగింది? పోనీ ,ఇంటిముందు కాస్తా మంచి జాగాలో పెడితే ఏ వీధికుక్కో పందో తింటాయి కద,అలా చెత్తలో పడేస్తే వృథా అవుతుంది కద? అనిపించింది!
ఇలా అన్నాన్ని పారెయ్యడానికి , ఈమె మొదటిది కాదు,చివరిది కాదు,ఈ తరపు ప్రధాన లక్షణం,మిగిలిన అన్నాన్ని పారెయ్యడం!
నాకు నాలుగు తరాల మనుషులు తెలుసు! మా తాతా నానమ్మ అమ్మల నుండి మా అమ్మాబాపులు - తరువాత నా తరం,మా అబ్బాయి తరం,ఇప్పుడు అయితే అయిదో తరం కూడా వచ్చింది, మనవరాలి తరం!
ప్రాణశక్తి కారణమైన అన్నం పట్ల- 'ఆయొక్క పరబ్రహ్మ స్వరూపం' అయిన అన్నం పట్ల , ఈ నాలుగు లేదా అయిదు తరాలలో మార్పు ఏమి కలిగింది? కారణాలు ఏమిటి??
మా నానమ్మ తాతల తరంలో అన్నాన్ని పారేయ్యగా నేను చూడలేదు. తినేటప్పుడు ,లేదా కలిపేటప్పుడు ఒక మెతుకు పళ్లెం పక్కన కింద పడితే,జాగ్రత్తగా వ్రేలు చివరితో తీసి కళ్లకు అద్దుకుని తిరిగి పళ్లెంలో వేసుకునేవారు.అప్పుడు ఇప్పటి లాగా ఇళ్లల్లో మార్బుల్ వగైరా పరిచేవారు కాదు,మట్టి నేలలు- దానికి ఎర్రమట్టి పేడ వేసి ,నీళ్లలో కలిపి ఇంటి నేలను అలికేవారు- దాని కోసం ప్రతీ ఇంట్లో  'అలుకు కుండ' ప్రత్యేకంగా ఉండేది.
మట్టినేల మీద పడిన మెతుకును కూడా తీసుకునేవారు అని చెప్పడానికి అది చెప్పాను!
అప్పుడు మా గ్రామానికి రాజరికాల కాలంలో నిర్మాణం చేసిన ఓ పెద్దచెరువు,మరో చిన్న నీటికుంటలు మూడు ఉండేవి. వాటికింద ఓ నాలుగువందల ఎకరాల విస్తీర్ణంలో సంవత్సరంలో ఒక పంట వరి సాగు అయ్యేది. రెండో పంట ఓ నూటా యాబై ఎకరాల వరకు మాత్రమే సాగు అయ్యేది. తక్కిన మరో పదహారు వందల ఎకరాల భూమి కేవలం వర్షాధార వ్యవసాయమే!తెల్లజొన్న ఇతర పప్పు ధాన్యాల ఉత్పత్తి సాగేది.
అప్పుడు ఆ విధంగా, అన్నం మెతకును పవిత్రంగా భావించే వారు! మా అమ్మాబాపు తరం కూడా అలాగే భావించారు!
మా బాపు తరంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మొదటి ప్రధానమంత్రి కాలంలో దేశవ్యాప్తంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు జీవనదుల మీద నిర్మాణం జరిగింది! లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో అదనంగా వరి సాగు పెరిగింది. ఇక అన్నానికి కొరత లేకుండా పోయింది!
ఇప్పటికీ నేను ఒక్క పిడికెడు అన్నాన్ని కూడా బయట పారెయ్యలేదు.పెడితే వీధికుక్కలకు‌ జాగ్రత్తగా పెట్టడమే కానీ, ఒక్క మెతుకును కూడా పారెయ్యలేదు!
పిడికెడు అన్నాన్ని ఉత్పత్తి చెయ్యడానికి ఎన్ని రకాల శ్రమలు ఉంటాయో,ఎన్ని రకాల వనరులను వాడుతారో,
మన పళ్లెంలో ఉన్న అన్నం చరిత్ర ఎవరికైనా ఇప్పుడు తెలుసా అని? ఇళ్లల్లో చెప్పరు.స్కూల్ కాలేజ్, ఎక్కడా ఎవరూ ఇప్పుడు 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనగా వినలేదు నేను.
మధ్యాహ్నం వండిన అన్నం కాస్తా మిగిలితే  , సాయంత్రం లేదా రాత్రి పూట తినరా?
రాత్రికి మిగిలిన అన్నాన్ని ఉదయం పోపుకు వేసుకుని టిఫిన్ లాగా తినరా? ఆశ్చర్యకరంగా ఉంది ఈ తరంలో ఈ పరిణామం!
ఒకప్పుడు మా ఇళ్లల్లో ఓ అమ్మమ్మ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటే గమనిస్తూ ఉండేది.
ఓ మనిషి జాగ్రత్త మనిషో ,అజాగ్రత్త మనిషో ఆ మనిషి భోజనానంతరం ఆమె ఓ అంచనా వేసుకునేది.
'మెతుకు కింద పోకుండా తిన్నడు- తిన్నది' అని మెచ్చుకోలుగా చెప్పేది! 
ఓ ఆరు సంవత్సరాల క్రితం, నేను ఓ ప్రైవేటు జూనియర్ కాలేజి హాస్టల్ భోజనశాలను చూసాను. ఓ నూరు మంది స్టూడెంట్స్ తిన్న తర్వాత , వాష్ కెనాల దగ్గర చూస్తే సుమారు పదికేజీల అన్నాన్ని పారెయ్యడం చూసాను.
మనసుకు బాధ కలిగించింది! అప్పుడు ఆ వాష్ కెనాల్ ఎదురు గోడమీద ఒక కొటేషన్ రాస్తే బాగుంటుందని నిర్వాహాకులతో చెప్పాను. వారు తరువాత అలాగే రాయించారు "ఆహార దుర్వినియోగం, సామాజిక నేరం' అని! 
ఇప్పటి పెళ్లిళ్లలో గమనించే ఉంటారు మీరందరు.ఎంత అన్నాన్ని పళ్లాల్లో వదిలేస్తారో!
రహదారుల వెంట ఎడతెగకుండా వరి ధాన్యాన్ని ఎండబెడుతూ , ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో తెలియక ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగం దుస్ధితిని చాలా మంది గమనించే ఉంటారు!
ఇప్పుడు అన్నం లేకపోవడం ఎవరికీ సమస్య కాదు.అంతలా పెరిగింది వ్యవసాయ ఉత్పత్తి! ఇంకా నీటిపారుదల మీద డబ్బు ఖర్చు పెట్టకూడదు! విద్య వైద్యం ఉపాధి అవకాశాలు వగైరా మీద ఖర్చు చెయ్యాలి.