ఉజ్జయినీ సామ్రాజ్యాన్ని తిరుమలేశ్వర వర్మ అనే మహారాజు పరిపాలించేవాడు. అతని పరిపాలన రామ రాజ్యాన్ని తలపింపజేసేది. అతడు కళాపోషకుడు కూడా. అతని ఆస్థాన గాయకుడు రాజేంద్రుని గానం సంగీతాన్ని ఇష్టపడని వారిని కూడా మంత్ర ముగ్ధులను చేస్తుంది. అంతటి మహా గాయకుడు చుట్టు పక్కల ఏ ప్రాంతంలో కూడా లేడు. తన గంధర్వ గానంతో ఎంతో మంది ప్రముఖ గాయకులతో పోటీ పడి, వారిని చిత్తుగా ఓడించేవాడు. రాజుగారు ప్రతిసారీ అతణ్ణి ప్రశంసల వర్షంలో ముంచెత్తేవాడు. తరచూ రాజుగారు కురిపించే బహుమతులతో రాజేంద్రుడు కుబేరుడు అయ్యాడు. రాను రాను రాజేంద్రలో గర్వం తలకెక్కింది. తాను ప్రపంచంలోనే మేటి అనుకునేవాడు. మహారాజుతో సమానంగా తనను అందరూ గౌరవించాలని అందరితో అనేవాడు.
శ్రీపురంలో రంగనాథుడు అనే గాయకుడు కూడా మంచి ప్రతిభావంతుడు. అనేక రాజ్యాలు తిరుగుతూ ఎంతోమంది గాయకులతో సవాలు చేస్తూ వారిని ఓడించి, విలువైన బహుమతులు సంపాదించేవాడు. తిరుమలేశ్వర వర్మకు రంగనాథుడు సందేశాన్ని పంపాడు పదిహేను రోజుల్లో ఉజ్జయినీ కి వస్తానని ఆ ఆస్థానంలో తనను ఎవరైనా ఓడిస్తే వారికి అంతులేని బహుమానాలు ఇస్తానని, తాను గెలిస్తే రాజుగారు కూడా అంతులేని బహుమానాలు ఇవ్వాలని. రాజుగారు రాజేంద్రుని పోటీకి సిద్ధం కమ్మన్నాడు. ఇదే అదనుగా భావించిన రాజేంద్రుడు తాను పోటీకి సిద్ధమని, గెలిస్తే సగం రాజ్యాన్ని తనకు ఇవ్వమని షరతు విధించాడు. ప్రజా శ్రేయస్సే మిన్నగా భావించిన మహారాజుకు గర్విష్టి అయిన రాజేంద్రునికి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. కానీ పరుల ముందు తన రాజ్యం పరువు పోతుందని బాధ పడ్డాడు.
ఉజ్జయినీ రాజ్యంలో ఓ కుగ్రామంలోని ఒక ఇంట్లో మంగమ్మ మరియు ఆమె మనవరాలు సుశీల ఇద్దరే ఉండేవాళ్ళు. మంగమ్మ ఇంటి పనిని పూర్తిగా మనవరాలి పైనే ఉంచి, తాను మాత్రం ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు చెప్పడానికి వెళ్ళేది. మూడు పూటలా తినడం, ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు చెప్పడం ఇదే మంగమ్మ దినచర్య. సుశీల పన్నెండేళ్ళ బాలిక. మంగమ్మ సుశీల చేత గొడ్డు చాకిరీ చేయించడమే గాక చిన్న పొరపాటు చేసినా గొడ్డును బాదినట్లు బాదేది. వినరాని నీచమైన తిట్లు తిట్టేది. పశువులు కాయడానికి బయటికి వెళ్ళినప్పుడు సుశీల తన కష్టాలను పాటలుగా పాడుకునేది. అలాగే తాను విన్న ప్రసిద్ధమైన గీతాలనూ పాడేది. చాలా పాటలను ఎవ్వరి సాయం లేకుండానే నేర్చుకుంది. అలా పాటలు పాడుతూ మనశ్శాంతిని పొందుతుంది.
ఒకరోజు పశువులు కాస్తూ సుశీల శ్రావ్యంగా పాటలు పాడుతుంది. మనశ్శాంతి కోసం మారు వేషంలో సంచరిస్తున్న రాజుగారు ఆ పాటలు విన్నాడు. ఎంతో ఆశ్చర్యపోయాడు. సుశీల వద్దకు వెళ్ళి ఆమె వివరాలు అడిగాడు. సుశీల వెంటనే ఉన్న సుశీల మిత్రురాలు శ్రావణి సుశీల వివరాలతో పాటు సుశీల కష్టాలను వివరించింది. రాజుగారు సుశీలతో ఇలా అన్నాడు. "నాకు మహారాజు చాలా సున్నిహితుడు. నేను ఎలా చెబితే రాజుగారు అలా నడుచుకుంటాడు. నా వెంట రా. నీ కష్టాలను తీరుస్తాను." అన్నాడు. సుశీల ఎంతో ఆశతో రాజు వెంట వెళ్ళిపోయింది. మారువేషంలో వచ్చింది రాజుగారే అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. రాజుగారు సుశీలకు మరిన్ని మంచి పాటలు నేర్పించారు.
ఆరోజు రానే వచ్చింది. రంగనాథుడూ వచ్చాడు. గాన కళలో సుశీల ప్రతిభను చూసి, రంగనాథుడు ఆశ్చర్యపోయాడు. తన ఓటమిని ఒప్పుకుని సుశీలకు అంతులేని బహుమానాలు ఇచ్చాడు. రాజుగారు సుశీలను దత్తత తీసుకున్నాడు. సుశీల నాయనమ్మ మంగమ్మను సుశీలకు దాస్యం చేయడానికి నియమించాడు. సోమరి మంగమ్మకు కష్టాలు మొదలయ్యాయి. సుశీలకు మంచి రోజులు వచ్చాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి