పాఠాలు నేర్చుకోకపోతే ఏమవుతుంది?
దీనికి జవాబు చివరికి చెప్పుకుందాం!కాస్తా ఆగాలి!!
పాఠాలు రెండు రకాలు ఉంటాయి! పాఠాలు అంటే లెసన్స్ కద!? ఇపుడంతా ఇంగ్లీషు కద!?
స్కూల్లో చెప్పే లెసన్స్ ఒకరకం! అవన్నీ రకరకాల సైన్స్ ల గురించి చెప్పే లెసన్స్! లెక్కలు కెమిస్ట్రీ ఫిజిక్స్ జీవశాస్త్రం రకరకాల పదార్థవిజ్ఞాన శాస్త్రాలు , భూగోళం సౌరమండలం పాలపుంత అనంతమైన విశ్వం గురించి దాని పుటుక గురించి - అవన్నీ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ లలో చెప్తారు.రాజకీయ తత్వశాస్త్రాలను కూడా బోధిస్తారు.
కానీ, మరో రకం పాఠాలు, లేదా,లెసన్స్ ఉంటాయి. అవి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ లలో బోధించరు.ప్రత్యేకంగా వాటికి స్కూల్స్ వగైరా ఉండవు! వాటిని 'జీవిత పాఠాలు' అంటారు.జీవితమే ఓ పేద్ద స్కూల్!జీవితమే ఓ పేద్ద గురువు!
యూనివర్సిటీ అంటే నిజానికి ' మొత్తం ప్రపంచం' అని కద!
అసలైన యూనివర్సిటీలో చాలా మంది టీచర్స్ ఉంటారు.
ప్రతీ మనిషి, మరో మనిషికి టీచరే- అదే సమయంలో విద్యార్ధి కూడా!ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి , రఫ్ గా మాట్లాడితే ,చెంప దెబ్బ కొట్టే పోలీసు కూడా ఓ టీచరే!
'ఇలా వెళ్తే,అలా అవుతుంది' అన్న జ్ఞానం అలా కలుగుతుంది!అదో జీవిత పాఠం!
జీవిత పాఠాలు అంటే ,ఈ జీవితం అంటే ఏమిటి? ఈ పుట్టడం ఏమిటి? ఆ బ్రతకడం ఏమిటి? చివరికి చావడం ఏమిటి? ఏది మంచి బ్రతుకు? ఏది చెడ్డ బ్రతుకు?అవి ఎలా ఉంటాయి?
అసలు ఇదంతా ఏమైనా అర్థం ఉన్న విషయమేనా?
ఈ జీవితంతో- ఈ మందితో ఎలా వేగడం?
ఈ జీవిత పాఠాలను నేర్పడానికి ,అనాదిగా తల్లిదండ్రులు మొదటి గురువులు. తరువాత మన చుట్టూ ఉన్న సాటి మానవులు.బంధువులు ,స్నేహితులు ,సహ విద్యార్థులు తోటి ఉద్యోగులు ,ఇంటా బయటా అనేక మంది కూడా ఎవరికి తోచిన విధంగా వారు ,తమ తమ అనుభవాల ద్వారా నేర్చుకోవాల్సి వస్తుంది.
జీవితంలో మనం ఎలా మెదలాలి? అదో పెద్ద జీవిత పాఠం.అందులో అనేక అధ్యాయాలు. ఆ పాఠాలకు అంతులేదు!
అనాదిగా మౌఖిక సాహిత్యం, కొంత ఆ పని చేస్తూ వచ్చింది. రాయడం చదవడం అందుబాటులోకి వచ్చిన తరువాత ,రాత సాహిత్యం ,సినిమా వగైరా ఆధునిక కాలంలో ఆ పనిని కొంత చేస్తూ వస్తున్నాయి.జీవితం అంటే ఇదీ అని!
ఇప్పుడు చక్కగా పాయింట్ వద్దకు వస్తున్నాను.
గత పదహారు నెలలుగా ప్రపంచం యావత్తూ ఒకే ఒక్క అంశం చుట్టూ తిరుగుతున్నది.అది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది.ప్రపంచం పుట్టిన దగ్గర నుండి అది ఇలాంటి ఉత్పాతాన్ని ఎన్నడూ ఎరగదు! ఎరిగినా ఎక్కడికక్కడ చిన్న చిన్నగా వచ్చి పొయ్యాయి.ఇలా హోల్ ప్రపంచమే ,దేశాలకు దేశాలే - ధనిక పేద అగ్ర అథమ తేఢా లేకుండా, అదే ఒకే ఒక్క సమస్యతో సతమతం అవుతున్నాయి. అదేమిటో మనకు తెలుసు. అది కోవిడ్ వైరస్.
ప్రస్తుతం కోవిడ్ వైరసే ప్రపంచానికి అతిపెద్ద పాఠం చెబుతోంది. అందులో మళ్లీ అనేక ఉప పాఠాలు!
అది గురువు కూడాను , అదే అంతులేని పాఠం కూడానూ! ఇలా ప్రపంచానికి ఇంత పెద్ద పాఠం ఇప్పటి వరకు మరేదీ లేదు.
దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ,ఈ కోవిడ్ వైరస్ పాఠాన్ని వింటూ చర్చిస్తూ ఉన్నారు. ఆ పాఠంలో ప్రధానంగా 'రోగనిరోధక శక్తి- బలవర్ధకమైన ఆహారం' అనేవి అతి ముఖ్యమైన విషయాలు. చర్చకు అయితే వస్తున్నాయి కానీ, వాటిని నేర్చుకునేవారు ఎందరూ అనేది ప్రశ్న!
మన రసాయన ఎరువుల ,పురుగుమందుల ,పాలిష్డ్ , ప్రాసెస్డ్ ,విపరీతంగా ఉడికించి మసాలాలు దట్టించిన ,మృత ఆహారం తినడం- శారీరక శ్రమ నుండి దూరంగా బ్రతకాలనుకోవడం- ఎక్కువ సంపాదించి ఎక్కువ తినాలనుకోవడం- మనుషుల్లో అనుభవాదం పెరగడం- వ్యవస్థకు లాభాపేక్ష పెరగడం- ఫలితంగా పర్యావరణానికి భూగర్భానికి జరుగకూడని చెడు జరగడం- ఇదంతా తగనిదని ఒకవైపు చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటి నుండి పాఠాలు నేర్చుకునేవారు ఎందరు?
కోవిడ్ వైరస్ మూలంగా ప్రభుత్వాలను నడిపే పార్టీలను విమర్షించడానికి , సమస్త విధాలైన ప్రతిపక్ష పార్టీలకు ఎడతెగని సబ్జెక్టు దొరికింది. ప్రపంచంలో తొంబై శాతం మంది నానావిధ మేధావులు కూడా చేటల కొద్ది దుమ్మును ఎత్తి ప్రభుత్వాల మీద పోస్తున్నారు.అందులో ఒక్క చేటెడు దుమ్ము కూడా తమ మీద పోసుకోవడం లేదు. ప్రజల జీవనశైలి మీద పళ్లెత్తు విమర్శ చెయ్యడం లేదు! చేస్తే తమకు కూడా తగులుతుంది.విపరీతంగా మద్యం సేవించి మాంసాహారం భుజించి,ఊబకాయాలను తెచ్చుకుని,ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ప్రశ్నించడానికి ఎంత దమ్ము ఉండాలి!?వారి ధైర్యాలను మటుకు అభినందించాలి!
జీవితం అనేక పాఠాలు చెబుతూనే ఉంది అనాదిగా!
నేర్చుకునేవారు నేర్చుకుంటున్నారు.నేర్చుకోలేని వారు మధ్యలోనే రాలిపోతున్నారు!
జీవితం చెప్పే పాఠాలను నేర్చుకోని వారికి,
జీవితం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది.
ప్రస్తుతం అదే జరుగుతోంది.
మనం పాఠాల వైపా? గుణపాఠాల వైపా??
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి