మన భాష తెలుగు-తెలుసుకుంటే వెలుగు--తెలుగు ఒడిలో..5:-మొగలి:--రాజావాసిరెడ్డిమల్లీశ్వరి

 మొగలి అనగానే ఆంగ్ల కథలైన జంగిల్ బుక్ లో మోగ్లి, మొగల్ వంశ రాజులు గుర్తొస్తున్నారా?  అవేవీ కావు. మొగలి అనేదొక మొక్క. అంటే మామిడి, వేప, చింత మొదలైన చెట్లలా పెద్ద చెట్టనుకోకండి. చిన్న చెట్టు ఇది. 
ఈ మొగలి చెట్టు గుబురుగా ఉంటుంది.... పొదలాగా దీని ఆకులు ఆకుపచ్చగా, సన్నగా పొడవుగా ఉంటాయి. ఆకుల చివర వాడిగా, ముల్లులా, సూదిలా ఉంటుంది. అందుకే ఈ మొగలి చెట్టును మొగలి పొద అని అంటారు. ఈ మొగలి చెట్టుకు పూసే పూలు మొక్కజొన్నపొత్తుల్లా ఉంటాయి. సన్నని పచ్చని రేకులతో పొడవుగా ఉండే మొగలి పూవు మధ్యలో సన్నని ఈనెలా ఉంటుంది. మొగలి పూవును మొగలి పొత్తు అని కూడా అంటారు.
దేవుడి పూజకు పనికి రాని ఈ పూవును ఆడపిల్లలు జడలో పెట్టుకుంటారు. ఈ పూలను రకరకాల అమరికలలో కత్తిరించి పూలదండను చేస్తుంటారు. మొగలి పూలతో జడ వేసుకుంటారు అమ్మాయిలు . మంచి వాసన రావటానికి పూర్వపు రోజులలో ఈ మొగలి పూలను బట్టల మధ్యలో ఉంచేవారు.
అమ్మాయిల ఆటపాటలలో ‘మొగలీ పూవుంటి మొగుణ్ణీయవే...’ – అనే పాటలు ఉన్నాయి. వాటినెప్పుడైనా విన్నారా? 
కాళిదాసు అనే సంస్కృత కవి తాను రచించిన మేఘ సందేశము అనే కావ్యంలో ఈ మొగలి పూల గురించి గొప్పగా వర్ణించాడు. మోటుగాడికేం తెలుసు మొగలిపూల వాసన – అనే సామెతలున్నాయి. మొగలి పేరుతోనూ.... ఆకు బారెడు – తోక మూరెడు....అనే పొడుపు కథలు ఉన్నాయి.
పూజకు పనికిరాని పువ్వు
పడతులు మెచ్చే పువ్వు..వంటి మాటలతో పాటు....
పచ్చని పెట్టెలో విచ్చుకుంటుంది
తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది – అని,  
పచ్చని పెట్టెలో పిచ్చుక,
పట్టుకొంటే గిచ్చిపెట్టు.... అనే పొదుపు కథలున్నాయి.
ప్రేమ దేవత అని పిలువబడే మన్మధుడి వెన్నెల నారితో ఉపయోగించే ఒక పూల బాణము పేరు మొగలి పూవు.  అంతే కాదు  చంపూ రామాయణంలో ఈ మొగలి ప్రస్తావన వుంది. 
జగన్నాథ పండితరాయలనే మహా పండితుడు ఓ నది పక్కనుండి వెళ్తుంటే ఎవరో గొణిగినట్టనిపించి.. ఎవరిది..అంటే ...మహేశ్వరుడికి అంటరానిదాన్ని..అని మొగలి డొంక కదలాడిందట.అపుడాయన ....
ఓ కేతకీ!నిన్ను విభూతి
                      రాయం
డాకాశకేశుండుత్యజించె
                  నంచున్
శోకింకే నిన్ శిరసా
            వహింపన్
లోకాన లేరో నర దేవ
              దేవుల్....
అని మొగలిని ఓదార్చాడట. అంటే....
ఆ విభూతి రాయుడు నిను  పట్టించుకోకపోతే నీకేం నష్టం? నరులెందరు లేరు నిను
నెత్తిమీద పెట్టుకోవటానికి...అని ఓదార్చాడట.
ఇంతకీ  ఈ మొగలి పూవును ఇంకా ఏఏ పేర్లతో పిలుస్తారో తెలుసా?  ఇందుకళిక, కంటదళము, కేతకి, చామర పుష్పము. తీక్ష ద్రోణి దళము, సూచీ పుష్పము, అమర పుష్పము. సూచీ పుష్పము, దీర్ఘపత్రము. స్థిర గంధ మొదలగు ఎన్నో పేర్లతో మొగలి పూవును పిలుస్తారు. 
కాలువ గట్ల మీద సహజంగా పెరిగే ఈ మొగలి చెట్లు – శ్రావణ మాసంలో తెల్లని పూలను పూస్తాయి. మాఘ మాసంలో, ఫాల్గుణ మాసాలలో పచ్చని పూలను పూస్తాయి. పూర్వకాలంలో ఈ మొగలి చెట్లను ప్రత్యేకించి పెంచేవారు కాదు. పూలను ఎగుమతి చేసేవారు కాదు. ప్రస్తుత కాలంలో గోదావరి జిల్లాల్లో ఈ మొగలి పూల తోటలు విరివిగా పెంచుతున్నారు. కారణం మొగలిపూలను వ్యాపార వస్తువుగా చూడటమే. దాని వలన అధిక ధనాన్ని ఆర్జించటమే. 
నొప్పులు, మరికొన్ని వ్యాధుల్ని తగ్గించే ఔషధాలను తయారు చేయటానికి అత్తరు మొదలైన పరిమళ ద్రవ్యాలను తయారు చేయడానికి కావలసిన నూనెను ఈ పూల నుండి తయారు చేస్తారు. పూలను అందమైన అల్లికలుగా కత్తిరించి దండలుగా చేసి అమ్ముతుంటారు. గృహాలంకరణలోను వీటిని ఉపయోగిస్తారు. 
పట్టణ వాసులకు అంతగా తెలియని ఈ మొగలిని శివుడు శపించాడట. ఎందుకో తెలుసా?  శివలింగము యొక్క ఆద్యంతాలను తెలుసుకోవాలని విష్ణువు, బ్రహ్మ బయలుదేరినపుడు బ్రహ్మకు మొగలిపువ్వు ఆ విషయం చెప్పిందని, ఈ పూవు శివాగ్రహానికి గురై పూజార్హతను పోగొట్టుకుందని శివపురాణ కథ ఉంది. 

కామెంట్‌లు