మన భాష తెలుగు -తెలుసుకుంటే వెలుగు-తెలుగు ఒడిలో...5:-వ్యాసకర్త: -రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

 

బంతి పూవు
బంతి అనగానే ఆటవస్తువైన బంతి గుర్తుకొస్తోంది కదా.లేదా పూబంతి గుర్తొస్తుంది కదా !కాని ఈ బంతి ఆ బంతి కాదు. ఈ బంతి ఒక పూవు.  ఒకప్పుడు కేవలం నవంబరు నుండి ఫిబ్రవరి దాకా మాత్రమే కన్పించే ఈ బంతిపూలు ఇప్పుడు ఏడాది పొడవునా ఏదో ఒక బంతి పూవుగా కనిపిస్తూనే వుంది. 
ఊక బంతి, రేకు బంతి, రవ్వ బంతి, పొగడ బంతి ముద్దబంతి, కారబ్బంతి, మొదలైన రకాలుగా ఉండే బంతిపూలు ఎరుపు, తెలుపు, పసుపు వంటి ఎన్నో రంగుల్లో మనకు దర్శనమిస్తాయి.  
బంతి పూవు అనేది నిజానికి ఒక పూవు కాదు. అదొక పూలగుత్తి అన్నమాట. కారణం బంతిపూవులో ఉండే ఒక్కొక్క రేకు ఒక్కొక్క పూవన్నమాట.
 జినియా, డాలియా మొదలైన పూలు ఆంగ్లభాషలో మారిగోల్డ్ గా పిలువబడే. పూలు  ఈ బంతి పూ జాతికి చెందినవే. 
రకరకాలుగా ఉండే బంతి పూల తోటలు ఎంతో అందంగా ఉండి కనువిందు చేస్తూ చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. బంతి ఆకులు కూడా చాలా కళాత్మకంగా ఉంటాయి. అందుకే వాటిని అరచేతిలో ఉంచుకుని పైన గోరింటాకు పెట్టుకొని ఆడపిల్లలు డిజైన్లు వేసుకుంటారు. అంతేకాదు సంక్రాంతి పండుగ రోజులలో ఈ బంతి పూలదే అందం
అంతా..  చూచిన వారిదే ఆనందం అంతా. ముగ్గులలో బంతిపూల నుంచి గొబ్బిపాటలు పాడుతారు ఆడపిల్లలు.
బంతులోయ్ ముద్దబంతులోయ్
బంతులోయ్ ముద్దబంతులోయ్
అంతులేని అందాలోయ్
ముద్దుగొలిపే బంతులోయ్
అతివ తీర్చు ముగ్గుల్లోన
అచ్చనైన సింగారాలోయ్
సింగారాల సిరులోయ్
నవకాంతుల బంతులోయ్ – అంటూ పాడుకోవటం జరుగుతుంటుంది.
అంతేకాదు, చూడముచ్చటగా ఉన్న అమ్మాయిని ముద్దబంతిలా ఉందని బంతిపూవుతో పోలుస్తారు. 
సంక్రాంతి మొదలైన పండుగ రోజులలో ఈ బంతిపూలతో మాలలు లేదా దండలు కట్టి గడపలకు తోరణాలుగా కడతారు. బంతిపూల వాసనకి దోమలు మొదలైన క్రిమికీటకాలు రావంటారు. గృహాలంకరణలోను బంతిపూలు స్థానాన్ని పొందాయి. ఔషధంగాను పనిచేసే ఈ బంతిపూలు దేవుడి పూజకు మాత్రం నోచుకోలేదు. పూల సంబరాలైన, సింగారాలైన బంతిపూలు బతుకమ్మ పండుగలో బతుకమ్మను చేయటంలో వంతు తీసుకుంటాయి.
“పిడికెడు సూదులు – ఫిరంగి చెక్కలు” – అనే పొడుపు కథలలోను స్థానం పొందాయి ఈ బంతిపూలు.