*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౬౪ - 64)

 కందము :
*దుర్వార చక్రధరకర*
*శర్వాణీభర్తృవినుత | జగదాధారా*
*నిర్వాణనాధ మాధవ*
*సర్వాత్మక నన్నుగావు | సరగున కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
ఎంతటి ధైర్యవంతుడు కూడా ఎదురు నిలబడ సాహసించలేని అప్రతిహతమగు చక్రమును చేతిలో ధరించినవాడవు.  పార్వతీ దేవి భర్త అయిన మహేశ్వరుని చేత పొగడబడిన వాడివి.  ఈ సకల చరాచరములకు ఆధారమైన వాడివి.  ఎటువంటి వారికైనా మోక్షము నీయగల వాడవు. లక్ష్మీ దేవి భర్తవు.  అన్ని జీవులలోనూ ఆత్మగా వున్నాడివి.  ఇటువంటి నీవు త్వరత్వరగా వచ్చి నన్ను రక్షించు,  సర్వేశా, పరంధామా...అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*" ఆకాశము, భూమి, నీరు, గాలి, ప్రకృతి, ఇలా అన్నిటా నిండి వున్నవాడవు నీవే.  పరాత్పరా, ఈ సర్వ జగత్తు గుండె చప్పుడు నీవే అయినప్పుడు.  నువ్వు కాక నన్ను ఇంకెవ్వరు రక్షించగలరు. ఉద్ధరించగలరు.  "నీవు తప్ప ఇతః పరంబెరుగ. అన్యథా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ. రక్ష రక్ష మహేశ్వరా. రక్ష రక్ష జనార్ధనా"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss