ద్రౌపదీ ఏకపాత్రాభినయం:-*స త్య వా ణి కుంటముక్కుల*--8639660566

 అన్నా! శ్రీకృష్ణా! వచ్చితివా? వదినమ్మలందరూ కుశలమే కదా! సాధ్వీమణి రుక్మిణి వదినగారు, నా కొరకు చీరె సారెలు పంపినారా? చాల సంతోషము.
       
ఆ .....ఏమీ? నా పతిదేవులు ధర్మరాజు మిమ్ము  కౌరవులతో సంధి కార్యము చేయుటకు పిలిపించినారా?
           
అన్నా! శ్రీకృష్ణా! 
అరివీర పరాక్రమవంతులైన నా భర్తలు, కౌరవులు మా పట్ల జరిపిన దురాగతము లన్నీ మరచి, పౌరుష హీనులై, కేవలం ఐదు ఊర్ల కొరకు సంధి చేసుకొందురా? భూమండల మంతా పాలించల సమర్ధులైన నా పతులు ఏల ఈపాటి బేల పలుకులు పలుక వలె ?
జూదమాడుట తప్పు అని తెలిసియూ ఆనాడు,  నాపతి ధర్మజులు నిండు సభలో వినోద క్రీడ కొరకు,
భార్యననే చులకన భావంతో, సొమ్మును పందెంలో ఒడ్డినట్లు నన్నునూ పందెంలో ఒడ్డుట  న్యాయమా?
             
తాను అలా నన్ను హీనపరచుట వలననేదా, ఆ ధూర్తుడు, దుశ్శాసనుడు ఏక వస్త్రనైన నన్ను, సభలోనికి జుట్టు పట్టి ఈడ్చుకు వచ్చి వలువలు విప్ప యత్నించినాడు.
        
ఆ తుచ్చుడు, దుర్యోధనుడు, "అన్నభార్య, తల్లితో సమానమనే" ఇంగితం మరచి, తన ఊరువులు చూపించి  అచ్చట కూర్చోమని మదోన్మత్తుడై సైగలు చేస్తూ వికటాట్టహాసం చేసినది.
ద్రుపద రాజ పుత్రికను,  పాండురాజు కోడలినైన నన్ను, అంతటి అవమానమునకు గురిజేసినాడంటే వాడికి ఎంత ధైర్యము ? ఎంత కండ కావరము ? 
            
అందరు విజ్ఞులూ, పెద్దలూ,  వయో వృధ్ధులు వుండి కూడా, ఒక  కులస్త్రీకి, అందునా, తమ ఇంటి కోడలికి, ఆ వదరుబోతు, గర్విష్టీ, బుధ్ధిహీనుడగు ఆ దుర్యోధనుడు అంతఃపురం నుండి నన్ను పట్టి తెమ్మని ఆదేశించినప్పుడు, ఆ పశువు దుశ్శాసనుడు, నా వలువలు  విప్పయత్నించినపుడు ఒక్కరంటే ఒక్కరైననూ వలదని వారించ లేని పిరికిపందలుగా చూస్తూ వుండిరి కదా.   
అన్నా!దయామయుడవైన నీ వలన కదా, ఈ దృపథరాజ పుత్రిక మానము కాపాడ బడినది. నీ దయవలన కదా ఈ మానవతి ద్రౌపది ఈనాడిట్లు ప్రాణములతో  నీ ఎదురుగా మిగిలి వున్నది !
      
ఆనాడు ఆ హీనుడు ,ఆ దుర్మదాంధుడు తాకిన, నా ఈ కేశములను, ఆనాటి నుండి నా కరములతో తాకక,  మర్రి ఊడల వలె జడలు కట్టినను వదిలివేసిన కారణం, భీమసేనులవారు ఆనాడు ,ఆ దుశ్శాసనుడి కరములు ఖండించి, ఆ ధూర్తుని రక్తంతో తడిసిన   తన స్వహస్తములతో నా కేశములు ముడివేయుదునన్న శపథమును మరచినారా? 
ఆ క్షణము కొరకు ఎన్నినాళ్ళనుండి ఎదురు చూచు చుంటినో కదా!
         
ఆనాడు సభలో ఈ పాండు వీరులు పలికిన శపథములన్నియూ వట్టి ప్రగల్భాలేనా? భీమసేనులవారికి కండ  బలమే కానీ, గుండె బలము లేకనే  ఆ ధూర్తులతో సంధికి ఒడంబడు చున్నారా?
       
ధర్మరాజులవారు  చేసినదంతా చేసి, శాంతి మంత్రములు పఠించుచు సంధి మాటలను పలుకుమని అనుచున్నారా?
          
మరి విజయుడనే కీర్తి నార్జించిన, అర్జునుడు, శివ మహా దేవుడిని మెప్పించి పొందిన, పాశుపతాస్త్రమును నిర్వీర్యం చేసి అగౌర పరచుటయేకదా!
       
ఇక మా చిన్నత్త మాద్రి పుత్రులు, నకుల సహదేవులు, అన్న ధర్మజుని మాటకు తలవొగ్గి, తాన అంటే, తందాన అందురే ?  కానీ వారి కంటూ స్వంత అభిప్రాయములు లేక, అన్న ధర్మజుని మాటకు మారు పలుకరు కదా!
         
అన్నా! శ్రీకృష్ణా! మానవతి అయిన నీ చెల్లెలు ద్రౌపది,  ఇటుల పలుకు చున్నదేమి అనుకొనుచుంటివా ? 
నీవుసంధి కార్యమునకు వెళ్ళుట నా కెంత మాత్రమును అభిమతం గాదు. నీ బావల మాట మన్నించి నీవు వెళ్ళిననూ," ఆ సంధి పొసగకుండు గాక" ! 
మనస్పూర్తిగా నేను కొలుచు నా దైవానివైన, నిన్నే మనసున తలచుకొని ప్రార్థిస్తున్నాను.
         
జరగబోవు కురుక్షేత్ర యుధ్ధములో నా భర్తల విజయము కొరకు, వేయి కనులతో ఎదురు చూచు చుందును.
  
అన్నా! శ్రీకృష్ణా! సంధికి  పోయిరమ్ము. కానీ, సోదరినైనను నేను, "విజయీ భవ" అని నీకు తిలకమును మాత్రము నా చేతులతో నీ నుదుట దిద్దలేను. సంధి ఒడంబడికలు సాగ నేరవు కృష్ణా ! సమరమే మన విజయానికి మార్గము. ఈ సోదరి మాటలే సత్యము. నా యీ సత్యవాణీ నినాదము మదిలో నిలిపి మంతనములు చేయుము కృష్ణా !