బాల్యంలో ఒక ఆట: - సత్యవాణి 8639660566

 అద్దం ఎండలో కిరణాలకెదురుగా వుంచేను
మెరిసే ప్రతిబింబాన్ని 
గోడపైకి పంపించి
తమ్మూణ్ణీ,చెల్లెల్నీ నీడను పట్టుకొమ్మన్నాను
వాళ్ళకందకుండా ఆ నీడను
అందీ అందకుండా ఆడించేను
అందిదా వాళ్ళకు 
ఆనందంతో తప్పట్లు కొడుతూ
కేరింతలు కొట్టారు
అందలేదా బిక్కమొఖాలేశారు
ఆనాడు వారిని అది ఆట అని ఆడించాను
వారి ఆనందం విచారం చూసి
నేనానందించాను
ఆనాడు నేనాడించి ఆనందించిన ఆ ఆట
తరువాత నా జీవితంలో భాగమైయ్యింది
నేను కావాలనుకొన్నవన్నీ
అద్దంలో  నీడలా
నాకు అందీ అందక ఊరిస్తాయని
ఆనాడు నాకు తెలియదు
నేను ఈనాడు
ఆనాటి నాతమ్ముడూ చెల్లెలులా
నీడల ఆశల వెంట పరుగులు తీస్తూనేవున్నాను
అవి ఈనాటికీ 
నన్ను ఊరిస్తూ ఆడిస్తూనే వున్నవి