ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

 ఊర్లల్ల
ఓ నలభై,యాబై యేండ్ల కిందట 
ఎక్కువకెక్కువ 
మట్టి గూన పెంకలతో
బవంతులే కట్టుకునేటోల్లు.
ప్యాదోళ్ళయితే
అరిగడ్డి తోనో, ఈత కమ్మల తోనో, తాటి కమ్మలతోనో
గుడిసెలు ఏసుకుంటే
కొంచెం ఉన్నోల్లు 
సిమెంట్ గూనతోనన్న 
బెంగుళూరు గూనతోనన్న మట్టి గోడలతో 
ఇండ్లు కట్టుకునేటోల్లు.
ఇగ
కలిగినోల్లయితే 
సున్నం, ఉసికె తొని
మిద్దెలు కట్టుకునేటోల్లు.
ఆ ఇండ్లల్ల  అర్రలు ఉండేటివి.
నడిమిల్లు, దేవుని అర్ర, 
రెండు సంకలు, అరుగు,
అంటిల్లు,ముసలోల్లకు సాయమాను ఉండేది.
కట్టెలో, పిడికలో,గోనె సంచులో,ఇంకేమన్నా పెట్టుకోడానికి అటుకు 
గుడ ఉండేది.
ఎవ్వలైనా సరే!
ఇంట్ల ఉండే అర్రలల్ల
పెద్ద గుమ్మిల్లల్ల, 
పెద్ద కాగుల్లల్ల అడ్లు ,
కొంచెం పెద్ద కుండలల్ల
పట్టిచ్చిన బియ్యం
నూకలు,పెసర్లు,కందులు,
సెనిగెలు,అనుములు, బబ్బెర్లు గిట్ల అరొక్క పప్పులను పోసుకునేటోల్లు.
గా పెద్ద కుండల మీద
రెండు మూడు సిన్న కుండలు, 
పటువలు,కడ ముంతలు, సిన్న సిన్న గురిగిలు
గుడ ఉంచేటోల్లు.  
తాగే లీల్ల కుండలు, బువ్వ కుండలు, కూర కుండలు
కూరాడు కుండలుండేటివి. కూరాడు కుండల కలి ఉండేది. గా కలి తోని ఎసరు పెట్టి
మంటి పొయి మీద 
కట్టెల తోని బువ్వఅండేటోల్లు. కూర,పచ్చి పులుసు,దప్పుడం గటుక,అంబలి గుడ
కుండలల్లనే సేసుకునేటోల్లు.
మర్తవాన్లల్ల మాడి కాయ తొక్కు, నిమ్మ కాయ తొక్కు, తమాట తొక్కు ,సింత కాయ తొక్కు పెట్టుకునే టోల్లు. 
పని తీరక కూరండక పోతే,
అడివి పనికి పోయేటప్పుడు
గీ తొక్కులనే ఏదో ఒకటి సద్దిల పెట్టుకొని పోయేటోల్లు.
కూర లేక పోయినా
ఉడుకుడుకు బువ్వల తొక్కేసుకొని, నెయ్యో, పెరుగో
పోసుకొని తింటుంటే.. అబ్బా!
ఎంతో కమ్మగ ఉండేటిది.
ఔ మల్ల!