ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 2971 999

 గప్పట్ల
పల్లెలల్ల
ఇంటి ముంగట ఆకిలి, 
ఆకిట్ల పందిరి,
మంచి లీల్ల సాద బాయి 
ఉండేటివి. 
గా బాయి పక్కన ఆడోల్లు సాటుకు అవుతలికి పోవుటానికి, తానం జేసుటానికి తడుకలను 
అడ్డం కట్టెటోల్లు. ఇంక జాలారు,గోలెం,లీల్ల కుండలు, 
ఇత్తడి గంగాళం, ఇత్తడి బకిటి,
ఇత్తడి సెంబు, ఇత్తడి 
కంచు ముంత గుడ ఉండేటివి.
ఆడోల్లు పొద్దుగాల లేత్తె లేత్తెనే
ఆకిలి ఊడ్సి, అలుకు జల్లి,.
ముగ్గులు లోసేటోల్లు. 
అటెన్క బోల్లు తోమి
కట్టెల పొయ్యి మీద కలి తోని
బియ్యం పెట్టేటోల్లు.
ఇగ  మొగోల్లైతే
ఎగిలి వరంగనే లేసి
పొలం కాడికి పోయేటోల్లు
అంబటాల్లకు
సద్ది గట్టుకొని .
ఎవరి పన్లల్లకు
ఆల్లు పోయేటోల్లు
మా ఇంటి ముందు
నాలుగు గిరుకలతో బగ్గ
లోతుల,పెద్ద సలంద్ర బాయి
ఉండేటిది.శానా మంది ఎవల్ల
శాతాడు  ఆల్లు తెచ్చుకొని లీల్లు సేదుక పోయేటోల్లు. 
గా లీల్లు తాగుటానికి పనికచ్చేటివి కాదుల్లా,! ఎందుకో ఎరికేనావుల్లా? 
తీట పోర గాండ్లు గా బాయిల
కట్టె పుల్లలో,రాల్లో ఏదో వొక సెత్త  ఏసేటోల్లు.గందుకే గా లీల్లను ఎవ్వలు సుత తాగ పోదురు. గా లీల్లను
అలుకు జల్లుటానికో,
బట్టలు పిండు టానికో , కాల్జేయి కడుక్కోడానికో, తానం జేసుటానికో 
ఆడుకునేటోల్లు.
కొందరి బాయిలల్ల 
ఉప్పు లీల్లు ఉండేటివి.
మాకైతే మంచి లీల్ల బాయుండేదుల్లా!
మా లీల్లు తియ్యగ, సల్లగ మంచిగ ఉండేటివి. గందుకనే
శానా మంది అచ్చి
మా బాయిల లీల్లను 
సేదుక పోయేటోల్లు. 
ఇగ 
పైసలను,రూపాయలను , బంగారు,ఎండి నగలను సందుగులల్ల గాని, 
పెద్ద కాగులల్ల గాని
దాసుకునేటోల్లం. 
గప్పుడు 
మా  మల్లారం సుట్టు పక్కల 
గీ బేంకులు గీంకులు లేవు.
గట్లనే కుండల్ జేసే కుమ్మరోల్లు గుడ
మా మల్లారంల లేరు.
మరిపల్లి నుంచో
బొల్లారం నుంచో కుండలు కొనుక్కునేటోల్లం.
ఔ మల్ల!