ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 2971 999


 గిప్పుడున్న 
కరెంటు మోటార్లు 
లేకముందు,రాకముందు
ఎనుకట 
సెరువుల నుంచి 
కాల్వల పొంటి పొలాలల్లకు
లీల్లు పారిచ్చుకునేటోల్లు.
సెరువు కింద పొలమున్నోల్లు
ఏడు,యెనిమిది గజాల లోతు 
బాయి తవ్వితే లీల్లు పడేటివి.
గా బాయిల ఆతం తోని  
లీల్లను తోడి, దొయ్యలను పారిచ్చుకునేటోల్లు.
అటెన్క రాటు,మోట అచ్చినయి. 
గవి అచ్చినంక
ఎవుసం జేసుడు 
ఎక్వ జేసిండ్రు
ఎక్వ పొలం పారేది,
ఎక్వ పంట అచ్చేది.
గా రాటు,మోట పొయి
డంకిన్ అచ్చింది.
డంకిన్ల డీజిల్ పోత్తే 
డంకిన్ నడిసేది.
గా డంకిన్ పదిహేను,ఇరువై
గజాల లోతులున్న లీల్లను గుడ గుంజేది. 
నలబై ఐదు యేండ్ల కిందట
మారుపాక రాయేశ్వ ర్రావ్
( చెన్నమనేని రాజేశ్వరరావు యం.యల్ ఎ, సిరిసిల్ల ) 
మా మల్లారం కు కరెంటు దెచ్చిన దేవుడు. 
ఎందుకనో
ఆ దొరకు ఆళ్ళ ఊరు మారుపాక కంటే 
మా ఊరు  మల్లారం అంటే 
ఎక్వ ఇట్టం ఉందేటిది.
ఇగ గప్పటి నుంచి
పొలాలకు కరెంటు మోటార్లు అచ్చినయి. పంటలు బగ్గ పండుతున్నయి.
బజార్లల్ల తంబాలు పడ్డయి.
గా తంబాలకు బుగ్గలు అచ్చినయ్. బుగ్గలు ఎలిగి 
ఊరంతటికి ఎలుగు అచ్చింది.
ఇండ్లల్ల గుడ
గాంచు నూనె దీపాలు, ఆందెపు నూనె దీపాలు,
కందిల్లు పోయి
కరెంటు బుగ్గలు అచ్చినయి.
గప్పటి నుంచి మా ఊరు
ఎలుగులతో మెర్సి పోతున్నది
గిదంత 
గా మారుపాక రాయేశ్వ ర్రావ్ దొర పున్నెమే.
ఔ మల్ల!