ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 2971 999

 మా ఊల్లే
యాబై యేండ్ల కిందట
అడ్లు,జొన్నలు, మక్కలు దంచుటానికి 
రోలు, రోకలి, కుందెన ఉండేటిది. 
గట్లనే
పెసల్లు, సెనిగెలు, కందులు,మక్కలు ఇసురుటానికి అందరి ఇండ్లల్ల 
పెద్ద ఇసురు రౌతు , 
సిన్న ఇసురు రౌతు ఉండేటివి. 
అడ్లను ఎండల ఎండవోసి
బగ్గ ఎండినంక దంచేటోల్లు.
తవుడుతో ఉన్న బియ్యం
తియ్యగా ఉండేటివి.
గా తవుడును బర్రెలకు పెడితే
బగ్గ పాలిచ్చేవి.
గట్లనె పెసల్లను, సెనిగెలను, మక్కలను గుడ ఎండవోసి
ఇసురెటోల్లు.
పొట్టుతో ఉన్న పప్పులు కమ్మగ, తియ్యగ ఉండేటివి.
మా మల్లారంల
యాబై యేండ్ల కిందట 
గిట్లనే జేసేటోల్లు.
అటెన్క పతాప రెడ్డి, కమ్మరోల్లు
అడ్ల గిర్ని పెట్టిండ్రు.
గప్పటి నుంచి 
పల్ల అడ్లైన గని
జెర సేపట్లనే బియ్యమయ్యేటివి.
గట్ల ఒక్కొక్క దాంట్ల
మిశిన్లు ఆచ్చినంక
పనులు జెప్ప జెప్ప అవుతున్నయి గని
మనుషులకు 
శెమ తగ్గింది, 
పనులు గుడ తగ్గినయి.
మనిషికి బగ్గ పని ఉన్నప్పుడు
ఎక్వ రోగాలు రాకుండే.
మరిగిప్పుడు 
చేతులకు పని తక్వ అవుట్ల
రోగాలు ఎక్వ అయినయి.
గిప్పటి కన్న 
ఎనుకట్నే మంచిగుండే. 
అందరు కట్ట పడేటోల్లు, అందరి పానాలు మంచిగుండేటివి.
ఔ మల్ల!

కామెంట్‌లు