మైథిలి క్రీగంట శ్రీరాముని చూసింది
పురుషులకు సైతం మోహనంగా కనిపించే
ఆ రూపాన్ని మనసులో చిత్రించుకుంది
రాముని చూపు సీతపై పడింది
చూపులు చూపులు కలిసాయి
రాముని తనువు విద్భుద్ధనువైతే
సీత మేను సిగ్గుల హరివిల్లే అయింది
విశ్వామిత్రుని ఆశీస్సులు అందాయి
శివధనస్సుని సమీపించాడు రాముడు
సీత బరువైన పూలజడ మదిలో మెదిలింది
ఈ విల్లునే ఎత్తలేనా అని
అలవోకగా శివధనువునెక్కుబెట్టాడు
ఆ ధనుష్టంకారానికి పృథ్వి దద్దరిల్లింది
పిడుగుపాటు ధ్వనితో ఫెళ్ళున విల్లు విరిగింది
సీత పెదవి పై చిరునవ్వు విరిసింది
మిథిలలో సంబరాలు అంబరాన్నంటాయి
సీతమ్మ పెళ్లి కూతురయ్యింది
సీతారాములు కళ్యాణమాలలు మారాయి
ముత్యాల తలంబ్రాలు మురిసాయి
దేవపారిజాతాల పుష్పవృష్టిలో
సీతారాములు పరిమళభరితులైన వేళ
ఆ వేడుక చూడతరమా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి