మమతలమ్మ పదాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432
మధురమైనది చదువు
సంతోషముకు నెలవు
నేర్చుకుంటే సులువు
ఓ మమతలమ్మ

నేర్చినవి పాఠాలు
ఓర్చినవి కష్టాలు
ఎదిగితే ఈర్ష్యలు
ఓ మమతలమ్మ

చందాలతో బుక్కు
ఇయ్యకుంటే చిక్కు
ఏమిటో ఈ హక్కు
ఓ మమతలమ్మ

పేరు కొరకీ దంద
పెత్తనాలకు చంద
మోసేరు అపనింద
ఓ మమతలమ్మ

పరులపై కోపాలు
పనికిరానేషాలు
రావు ధనధాన్యాలు
ఓ మమతలమ్మ

ఎవరికెవరూ కారు
ఏమిటో ఈ పోరు
అహంకారపు జోరు
ఓ మమతలమ్మ

కపటముండే నేని
రామ అనినా గాని
చించుకుందురు వాని
ఓ మమతలమ్మ

కలము ఖడ్గము కాదు
కవిత కన్నము లేదు
దమ్మిడికి కొరగాదు
ఓ మమతలమ్మ

సంతృప్తి మార్గాలు
రచనలోభావాలు
తెలుసుకుంటే మేలు
ఓ మమతలమ్మ