బిచ్చగాడి చర్య:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

          గొడ్డుటావు బితుక కుండ చేకొని పోవ

         పండులూడదన్ను పాలనీదు

          లోభివాని నడుగ లాభంబు లేదయా

           విశ్వదాభి రామ వినుర వేమ।


       "అయ్యా గ్రామాభివృద్ధికి పురప్రముఖులనుండి,

వ్యాపారవేత్తల నుండి కొంత ధనం సేకరిస్తున్నాము,తమరు కూడా మీకు తోచినంత ఇస్తే ఊరు బాగు పడుతుంది,తమరి పేరును శిలాఫలకంలో వేయిస్తాము"అని చెప్పారు గంగవరం గ్రామ పంచాయితీ నుండి వచ్చిన అధికారులు.

        "అయ్యో,నా బండ్లు పాడైపోయాయి,నా ధాన్యపు గిడ్డంగి కొంత భాగం పాడై పోయింది,వాటికే డబ్బులు విరివిగా ఖర్చు అయిపోయాయి.ప్రస్తుతం నేను డబ్బు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను"అన్నాడు ధాన్యం వ్యాపారం చేసే నారాయణ.

        "సరే మీ ఖర్చులు మీవి,గ్రామ రహదారులు బాగుపడితే మీ ఎడ్ల బండ్లకు కూడా మంచిది"అని చెప్పి అధికారులు నిరాశగా వెళ్ళిపోయారు.

          అధికారులు సేకరించిన డబ్బుతో రహదారులు బాగు చేయించారు.

        నారాయణ బండ్లు ఏ ఇబ్బందులు లేకుండా తిరగసాగాయి.మంచి రహదారుల వలన వారాయణ వ్యాపారం కూడా అభివృద్ధి చెందసాగింది.

        ఇలా ఉండగా ఊరి చెఱువు ఎండి పోసాగింది.అనేక మంది ఇళ్ళలో బావులు ఎండిపోసాగాయి.

      పంచాయితీ అధికారులు వెంటనే పక్క నగరంలోని నీటి జాడ తెలుసుకునే శాస్త్రజ్ఞణ్ణి పిలిపించి గంగవరంలో నీటి జాడ తెలుసుకునేందుకు నేలను పరిశీలించమని చెప్పారు. శాస్త్రజ్ఞడు అన్ని నేలలు పరిశీలించి ఊరు బయట ఉన్న భూమిని పరిశీలించి అక్కడ పుష్కలంగా నీరు ఉన్నట్టు చెప్పాడు.ఊరందరికీ ఉపయోగపడే బావి త్రవ్వించాలంటే చాలా ఖర్చు అవుతుంది.అందుకోసం మరలా ప్రజలనుండి,వ్యాపారస్థులనుండి డబ్బు సేకరించి బావి త్రవ్వించాలని నిర్ణయించారు.అలా గ్రామస్తులు తమకు వీలైనంత డబ్బు బావి త్రవ్వడానికి ఇచ్చారు.మరలా గ్రామాధికారులు నారాయణ వద్దకు వెళ్ళి "అయ్యా నారాయణ గారూ మన ఊరిలో నీటి ఎద్దడి మీకు తెలిసిందే కదా,అందుకే అందరికీ ఉపయోగ పడేటట్టు ఊరి బయట బావి త్రవ్విస్తున్నాము.తమరు కూడా మీకు వీలైనంత ఇస్తే బావి త్రవ్వ కానికి ఉపయోగపడుతుంది,నీటి ఎద్దడి తీరుతుంది"అని చెప్పారు.

        "ఇప్పుడు నేను కొత్త గిడ్డంగి కడుతున్నాను.డబ్బంతా దాని మీదే పెట్టాను,ఈ పరిస్థుతుల్లో మీకు ఏమీ ఇవ్వలేకున్నాను...అదిగాక మాఇంట్లో బావి ఎండి పోలేదు. మా ఇంటికి సరిపడానీళ్ళు దానిలో ఉన్నాయి.నాదగ్గర  బాగా డబ్బు ఉన్నప్పుడు తప్పక మీకు ఇస్తాను"అని డబ్బు ఇవ్వకుండా దాట వేశాడు పరమ లోభి అయిన నారాయణ.

       "ఇతనిని డబ్బు అడగటం కన్నా చెట్టును అడిగినా అదిమేఘం నిలిపి వాననిస్తుంది,ఏ స్వార్థం లేకుండా మంచి పూలు,పండ్లు ఇస్తుంది" అనుకుంటూ అధికారులు వెళ్ళి పోయారు.

          కొద్ది రోజుల్లోనే నారాయణ ఇంట్లో బావికూడా ఎండి పోయింది!

         ఇంతలోఊరి బయట బావి త్రవ్వటం పూర్తి అయింది.దానిలో పుష్కలంగా నీళ్ళు పడ్డాయి.ఊరిలో అందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు.ఆ బావి విషయం నారాయణకు తెలిసి అక్కడికి వచ్చాడు.

         బావి చుట్టూ గోడ కట్టి కప్పీలు పెడితే బావి పని అయినట్లే.బావిలో పుష్కలంగా నీరు ఉండటం చూసి నారాయణ ఆశ్చర్యపోయాడు.మరి తన ఇంటికి నీళ్ళు కావాలి కదా!

        తనేమో డబ్బు ఇవ్వలేదు.ఊరి ప్రజల ముందుతను నీళ్ళు తెచ్చుకోవాలంటే నారాయణ మొహమాట పడిపోయాడు.అప్పుడే అక్కడికి ఓ బిచ్చగాడు వచ్చాడు.వాడు కూడా బావిలోని నీళ్ళను చూసి ఎంతో సంతోషించి,అక్కడే ఉన్న గ్రామాధికారికి తన జోలె లోంచి పది రూపాయలు తీసి ఇచ్చాడు.

          బిచ్చగాడి వితరణ చూసి నారాయణ ఆశ్చర్య పోయాడు.తన దగ్గర అంత డబ్బు ఉన్నా ఊరు రహదారి కోసం,బావి కోసం ఒక్క పైసా ఇవ్వలేదు.అదే ఒక బిచ్చగాడు తను రోజూ అడుక్కున్న డబ్బుల్లోంచి పది రూపాయలు ఇచ్చాడు! బిచ్చగాడి చర్య నారాయణను ఆలోచింప చేసింది. తాను ఏమీ ఇవ్వక పోయినా తన బండ్లు   ప్రజలు వేయించిన రహదారి మీద వెళుతూ తనకు బండ్ల మరమ్మత్తులు ఖర్చులు తగ్గించాయి.

       అందరూ కలసి త్రవ్వించిన


బావి అందరికీ తనకు కూడా ఉపయోగపడబోతున్నది.

       ఆ బిచ్చ గాడి కన్నాతను ఉన్నత స్థితిలో ఉన్నా వాడి మంచి తనం ముందు తను ఎందుకూ కొరగాని వాడు అయిపోయాడు.ఈ ఆలోచన నారాయణలో మార్పు తెచ్చింది.

        వెంటనే ఇంటికి వెళ్ళి  వెయ్యి రూపాయలు తెచ్చి గ్రామాధికారికి ఇచ్చాడు.లోభి అయిన నారాయణ లోని మార్పును చూసి గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు.

        నారాయణ పేరును,బిచ్చగాడి పేరును కూడా శిలాఫలకం పై చెక్కించి బావి దగ్గర ప్రతిష్టించారు.అప్పటినుండి నారాయణకూడా తన చేతనైనంత సహాయం చేస్తూ ఊరు అభివృద్ధికి పాటుపడ సాగాడు.

         


కామెంట్‌లు