రామశర్మ బండి లో పని మీద పక్క ఊరికి బయలుదేరాడు. పక్క ఊరికి వెళ్ళాలంటే ఓ చిన్న అడవి దాటి వెళ్ళాలి.
అలా ఆ అడవి లో ఎవరైనా ప్రయాణీకులు,వ్యాపారం మీద వెళ్ళే వాళ్ళని గంగన్న అనే దొంగ దోచుకునే వాడు. అందుకే ఎవరైనా అడవి దాటాల్సివస్తే కనీసం ఐదు మందో పది మందో కలసి వెళ్ళే వారు. కానీ పని తొందర వలన రామశర్మ ఒక్కడే బండిలో బయలు దేరాడు.
అలా రామశర్మ అడవిలో కొంతదూరం వెళ్ళాక చెట్ల మధ్య ఒక వ్యక్తి పడి ఉండటం కనుపించింది!
వెంటనే రామశర్మ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు.బహుశా అతనిని ఏ పురుగో,పామో కరచి ఉండవచ్చు,రామశర్మ అతని శ్వాస ఆడుతోందో లేదో అని చూస్తే శ్వాస ఆడుతోంది! నిజానికి ఆవ్యక్తిని ఎక్కడో చూసినట్లు ఉంది! ఇక ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని తన బలమంతా ఉపయోగించి బండిలో జాగ్రత్తగా పడుకో పెట్టాడు. బండిని వేగంగా పక్క ఊరికి తీసుకవెళ్ళి ధన్వంతరి అనే వైద్యుడి వద్దకు తీసుకవెళ్ళి అతను అడవిలో పడిపోయి ఉన్నట్లుచెప్పి,తగిన వైద్యం అందించమని అందుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని రామశర్మ చెప్పాడు.
ఆ వ్యక్తిని చూసిన ధన్వంతరి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను గజదొంగ గంగన్న అని ధన్వంతరికి తెలుసు,కొంతకాలం క్రితం గంగన్న ధన్వంతరిని అడవిలో దోచుకున్నాడు! అయినా ధన్వంతరి రోగి ఎవరైనా తను తన ధర్మం నిర్వర్తించాలి అనే మంచి మనసుతో గంగన్నకు తగిన మూలికలతో వైద్యం చేసి స్పృహ వచ్చేట్టు చేశాడు.
మెల్లగా కళ్ళు తెరచిన గంగన్న ధన్వంతరిని చూసి ఆశ్చర్యపోయి నమస్కారం పెట్టాడు."అయ్యా అప్పుడు చేసిన తప్పుకి నన్ను క్షమించండి" అని పశ్చాత్తాపంతో చెప్పాడు.
"నీకు విషపు తేలు కరచి అడవిలో పడిపోయి ఉంటే ఈయన బండిలో నా వైద్యశాలకు తెచ్చి తన డబ్బుతో వైద్యం చేయించాడు"అని రామశర్మను చూపించాడు.
రామశర్మను చూసిన గంగన్న మరింత ఆశ్చర్యపోయాడు! ఎందుకంటే రామశర్మ పాడి ఆవును గంగన్న ఒకప్పుడు దొంగలించాడు! ఆ విధంగా రామశర్మకు తాను ఎరుకే! అయినా రామశర్మ ఎంతో మంచి మనసుతో గంగన్నను మృత్యు వాత పడకుండా వైద్యం చేయించాడు. తాను దోపిడీ దొంగ అని తెలిసినా తను చావకుండా మంచి వైద్యం అందించి తనను ధన్వంతరి బతికించాడు! వారి మంచితనం ముందు తనలో ఉన్న చెడుబుద్ధి మాయమయిపోసాగింది!
ఒక్కసారి గంగన్న రామశర్మ,ధన్వంతరి కాళ్ళపై పడ్డాడు.
గంగన్న తన తప్పు తాను తెలుసుకున్నట్టు ఇద్దరికీ అర్థం అయింది.
"నీవు ఇక దొంగతనాలు,దోపిడీలు మాని కొత్త జీవితాన్ని ప్రారంభించు.మంచిగా బతుకుతే ఆ ఆనందం వేరు,ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు,నీకు చేతనైనంత మంచి చేస్తే నీకు తెలియకుండానే మంచి జరుగుతుంది" అని చెప్పాడు ధన్వంతరి.
"అయ్యా, ఇన్ని రోజులు నేను చాలా నీచంగా బతికాను,ఈ రోజు నుండి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను.ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను,ఈ రోజునండి చెడ్డ పనులు మాని పనిచేసుకుని బతుకుతాను,మీకు ఏసహాయం కావాలన్నా నేను చేసి పెడతాను"అని ముకిళిత హస్తాలతో చెప్పాడు గంగన్న.
గంగన్న లో వచ్చిన మంచి మార్పుకి రామశర్మ,ధన్వంతరి సంతోషించారు.
చూశారా అపకారికి కూడా ఉపకారం చేస్తే అపకారి మనసు మారి మంచివాడుగా మారవచ్చు!అందుకే మనందరం ఏ పరిస్థితిలో అయినా మంచి చేస్తూనే ఉండాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి