విజిటింగ్ కార్డు:---కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 (ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ విజిటింగ్ కార్డు చూసిన తరువాత వచ్చిన ఆలోచనే   ఈ కథ)
  ************************
      పార్వతీశం గారికి రసాయనాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఆ రసాయనాలు తయారు అవుతున్నప్పుడు ఏర్పడే ప్రమాదకర వ్యర్థాలు భూమి లోకి ఇంకి  భూజలాలు పాడవకుండా ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అదిగాక ఫ్యాక్టరీ పొగ గొట్టాలనుండి వెలువడే కర్బన తదితర విష వాయువులు ఊరి మీదకు వ్యాపించి వాతావరణం కలుషితం కాకుండా కూడా ఆయన అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. విష వాయువుల్ని, బొగ్గు పులుసు వాయువుల్ని  కొన్ని రకాల చెట్లు అధిక మోతాదులో గ్రహిస్తాయని తెలుసు కదా! అందుకే ఫ్యాక్టరీ చుట్టూ అటువంటి అనేక చెట్లను పెంచాడు. అనేక ఇతర దేశాలు తిరిగి అక్కడి వారు వాతావరణం భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకునే చర్యలు గమనించి వారి నుండి అనేక సలహాలు తీసుకుని తన ఫ్యాక్టరీ లో పాటించడమే కాకుండా ఇతర ఫ్యాక్టరీల వారికి  ఆదర్శ ప్రాయుడయ్యాడు!
        ఫ్యాక్టరీ వలన ఎవరూ ఇబ్బందులు పడకుండా ఆయన తీసుకుంటున్న  జాగ్రత్తలు మెచ్చి ప్రభుత్వం,అనేక విశ్వ విద్యాలయాలు బిరుదులు,గౌరవ డాక్టరేట్ తో గౌరవించాయి. 
        తను ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తాను చేయవలసింది ఎంతో ఉందనిపించింది పార్వతీశం గారికి!
       అందుకే ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఊళ్ల లో చిన్న మీటింగ్ లు పెట్టి శుభ్రత,చెట్ల ఆవశ్యకత,నీటి నిల్వలు,వాన నీటిని ఉపయోగించే విధానం,ఇంకుడు గుంతలను గురించి విశేషంగా నిపుణులచేత ఉపన్యాసం ఇప్పించేవాడు.
     ఇలా ఉండగా ఫ్యాక్టరీ లో పనిచేసే రవీంద్ర అనే మేనేజర్ ఒక మంచి సలహా ఇచ్చాడు. 
      ఫ్యాక్టరీ లో పని చేసే పెద్ద ఉద్యోగులందరికీ విజిటింగ్ కార్డులు ప్రింట్ చేయిస్తుంటారు పార్వతీశం గారు.
       పార్వతీశం గారితో ఆ కార్డులను గురించి
రవీంద్ర ఈ విధంగా చెప్పాడు.
        "సార్, విజిటింగ్ కార్డు ఎవరికైనా ఇస్తే  వాటి ఉపయోగం అయ్యాక  పడవేస్తుంటారు. అలా కాకుండా విజిటింగ్ కార్డు వెనుక చెట్ల ను గురించి రెండు మంచి వాక్యాలు,విజిటింగ్ కార్డు కు సరిపోయే చిన్న కవరులో మంచి చెట్ల విత్తనాలు ఇస్తే కనీసం కార్డు తీసుకున్న వారిలో కనీసం నలభై శాతం మంది  ఆ విత్తనాలను పాతితే చెట్లగా మారుతాయి. వాటి వలన వాతావరణానికి
 ఎంతో మేలు కదా.! ఈ విధంగా కొన్ని కంపెనీలు చేస్తున్నట్టు నేను విన్నాను" అని చెప్పాడు రవీంద్ర.
      రవీంద్ర సలహాను పార్వతీశం ఎంతో మెచ్చుకున్న రు. 
     మంచి ఉద్దేశంతో చేసే ఏ మంచి పని అయినా మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన నమ్మకం. అందుకే రవీంద్ర కు మంచి బహుమతి ప్రకటించి ఆ సలహాను ఫ్యాక్టరీ నోటీసు బోర్డులో పెట్టారు.
   కొద్ది రోజుల్లనే
 తన కింద పెద్ద ఉద్యోగులందరికీ  విత్తనాల  విజిటింగ్ కార్డులు కార్డు వెనుక మంచి వాక్యాలతో ఇచ్చారు.
      ఆ విజిటింగ్ కార్డులు అందుకున్న వారికి అవి కేవలం అట్ట ముక్కల లాగ కనబడలేదు. ఒక సందేశం ఇస్తున్న ఒక మంచి ఆలోచన రేకెత్తించే ఉత్తమమైన విజిటింగ్ కార్డులలాగ  కనబడసాగాయి.
         చాలామంది ఆ విత్తనాలను తమ పెరడులో,రోడ్ల కిరువైపులా పాతి అవి చక్కగా పెరిగేటట్టు శ్రద్ధ తీసుకున్నారు. ఆ ఫ్యాక్టరీ చుట్టు పక్కలే కాదు,చుట్టు పక్కల ఊళ్లలో కూడా పార్వతీశం గారి చొరవ వల్ల అనేక చెట్లు ప్రాణం పోసుకున్నాయి. కొందరు ఆ విత్తనాలను చెట్ల ప్రేమికులకు, ఉద్యాన వనాలు పెంచే వారికి ఇచ్చారు. వారికి అంతకన్నా సంతోషం ఏముంటుంది?
       పార్వతీశం గారి మంచి పనిని అనేక వ్యాపార సంస్థలు,ఫ్యాక్టరీలు అనుసరించసాగాయి. కొందరు ఆహ్వాన పత్రికలు, పెండ్లి పత్రికలు కూడా విత్తనాలతో కూడిన సందేశంతో ఇవ్వసాగారు.
       పార్వతీశం గారు చేస్తున్న మంచి పనిని  పత్రికలు వ్యాస రూపంలో ప్రకటించి చాలా మందిలో స్ఫూర్తి నింపాయి!


కామెంట్‌లు