బంగారు పండు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  కొన్ని వేల సంవత్సరాల క్రితం కొండపల్లిలో ధర్మయ్య అనే రైతు ఉండే వాడు. ఆయన ఇంటి చుట్టూ పెరడు దానిలో చక్కని తోట ఉండేవి.
       ఒకరోజు ఆకాశంలో ఓ వింత రెక్కల జంతువు  విత్తనాన్ని నోట కరచుకుని వెళుతోంది.అది ధర్మయ్య ఇంటి మీదకు వచ్చేసరికి పెద్దగాలి వీచింది,ఆ గాలి ధాటికి అది నోరు తెరిచింది.అంతే ఆవిత్తనం కాస్త నేరుగా వెళ్ళి ధర్మయ్య పెరటి తోటలో పడిపోయింది! రెండో రోజు విత్తనం మొలకెత్తింది.వారం వారం అది పెరిగి పెద్ద చెట్టుగా తయారయింది..అందమైన ఆకు పచ్చని ఆకులు,బుల్లి బుల్లి రంగులపూలతో చెట్టు అందం సంతరించుకుంది.త్వరలోనే పువ్వులు నిగనిగలాడే బంగారు వర్ణం లో పండ్లుగా మారాయి!
        ధర్మయ్య,అతని ఇద్దరు కొడుకులు వినయ్,వివేక్ లు ఆ పండ్ల రుచి చూస్తే,రుచి అధ్బుతంగా ఉంది.అది మొదలు ఆ చెట్టును,పండ్లను జాగ్రత్తగా కాపాడ సాగారు.
       ఒక రోజు ధర్మయ్య పొద్దున్నే నిద్ర లేచి చూసేసరికి ఇంకేముంది చెట్టుకి పండ్లు లేవు!
       ధర్మయ్య ఆశ్చర్య పోయి వినయ్ ని వివేక్ ని పిలచి పండ్లు లేని ఆ చెట్టుని చూపించాడు.ఎవరో పండ్లు దొంగలించుక పోయారని ముగ్గురికీ అర్థం అయింది. ఐదు రోజుల్లో పిందెలు పండ్లు అయ్యాయి,ఆ రోజు రాత్రి ధర్మయ్య నిద్ర పోలేదు.
రాత్రి మేలుకుని కిటికీలోంచి చెట్టును గమనించ సాగాడు.
     చిత్రంగా అర్థరాత్రి ఆకాశం నుండి ఓ వింత రెక్కల జంతువు ధర్మయ్య తోటలోకి దిగి చెట్టుకి ఉన్న నాలుగు పండ్లను కోసుకుని ఆకాశంలోకి ఎగిరి పోయింది!
      వింత రెక్కల జంతువుని చూసి ధర్మయ్య ఆశ్చర్య పోయి పొద్దునే ఆజంతువు గురించి అది పండ్లు దొంగతనం చేయడం గురించి వినయ్, వివేక్ లకు చెప్పాడు ధర్మయ్య.
    "నాన్నా, ఆవింత జంతువు సంగతి నేను చూసుకుంటాను,మీరేం ఆలోచించకండి"అని ధైర్యంగా చెప్పాడు వినయ్.
        "జాగ్రత్త అది వింత రెక్కల జంతువు,మనం ఇంతకు మునుపు అటువంటి దానిని చూచి ఎరుగం" చెప్పాడు ధర్మయ్య.
       పది రోజుల్లోనే చెట్టు మరలా బంగారు పండ్లు కాచింది! వినయ్ ఒక పెద్ద పదునైన కత్తి తీసుకునితోటలో ఒక పెద్ద చెట్టు పొదలో నక్కి కూర్చున్నాడు.
        అర్థ రాత్రి ఆ వింత రెక్కల జంతువు ఎగురుకుంటూ వచ్చితోటను పరిశీలించింది.చెట్టు పొదలో కూర్చున్న వినయ్ ని అది గమనించింది.వెంటనే అది ఒక వింత అరుపు అరచింది! అంతే ఆ అరుపు వినే సరికి వినయ్ కి నిద్ర ముంచుకొచ్చింది.అలాగే చెట్టు కింద నిద్ర పోయాడు.పండ్లను కోసుకుని అది ఎగిరి పోయింది! పొద్దున నిద్ర లేచిన వినయ్ జంతువు అరుపులో నిద్ర పుచ్చే శక్తి ఉన్నట్లు గ్రహించి ఆవిషయాని తండ్రి కి వివేక్ కి వివరించాడు.
            "నిద్ర రాకుండా ఉండాలంటే  ఏదో ఆలోచనో, బాధో ఉండాలి,నాకునేను కొంచెం బాధ కల్పించుకుని మేల్కొంటాను.అప్పుడు ఆ జంతువు ఏం చేసినా నాకు నిద్ర రాదు.దానిని తగిన విధంగా శిక్షించి మన తోటలోకి రాకుండా చేస్తాను"అని చెప్పాడు వివేక్.
       "ఏ బాధ కల్పించుకుంటావు? దానికి ఏవో శక్తులు కూడా ఉన్నట్టు ఉన్నాయి...జాగ్రత్త నాయనా" అని చెప్పాడు ధర్మయ్య.
       మరలాచెట్టుకి పండ్లు కాచాయి.బాగా కారం ఉన్న అస్సాం మిరప కాయలను నూరి చెట్టు పండ్లకు పూశాడు..అర్థ రాత్రి అయ్యాక కారం పొడిని కొంత నోట్లో వేసుకుని ఆ కారపు బాధ అనుభవించ సాగాడు,ఆ బాధతో నిద్ర రాదు కదా!
          అనుకున్నట్టుగానే రెక్కల జంతువు వచ్చి తోటను పరిశీలించి, పొదలో ఉన్న వివేక్ ని గమనించింది.అది వివేకుడి వైపు తిరిగి వింతగా అరచింది! అయినా వివేక్ నిద్ర పోలేదు!ఆ జంతువు వివేక్ ను చూసి ఆశ్చర్య పోయింది.అయినా అది చెట్టు నుండి ఒక పండు తెంపింది.దానిని అది నోట్లో పెట్టుకుంటే ఆ పండు అతి కారం అనిపించి వివేక్ కి ఏవో శక్తులు ఉన్నాయని అది అనుకుంది, ఈ లోపల చెట్టు చాటునుండి వివేక్ వేగంగా బయటకు వచ్చి కత్తితో దాని రెక్క మీద ఒక్క దెబ్బ వేశాడు.ఆ దెబ్బకు అది భయపడి కీచుమని అరుస్తూ కోసిన పండును తోటలో పారవేసి ఆకాశంలోకి ఎగిరి పోయింది.
        అప్పటినుండి ధర్మయ్య కుటుంబానికి ఆ వింత రెక్కల జంతువు బాధ తప్పి పోయింది.
       చూశారా, ఏదైనా సాధించాలంటే ఎంతో కొంత సాహసం చెయ్యాల్సిందే.ఆ వింత జంతువు సంగతి తెలిసిన వివేక్  కారపు బాధను భరించి ఆ జంతువు ఆట కట్టించాడు! కాస్తంత ఆలోచిస్తే ఏ సమస్యకయినా పరిష్కారం దొరుకుతుంది కదా!
(బల్గేరియా జానపద కథ ఆధారం)
          ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤