వనదేవత వాక్కు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు. 9348611445


 (ఇది మా తమ్ముడు కె.ద్వారకా నాథ్ చెప్పిన ఐడియాకి అనుసృజన)

            

         <><><><><><><><>

      చెట్టుమీద పక్షిగూడు. అందులో తల్లి పక్షి,తండ్రి పక్షి తమ చిట్టి పిల్లలకేసి దిగులుగా చూస్తున్నాయి.అప్పుడప్పుడూ భయంతో కిచకిచ మని అరుస్తున్నాయి!

        అప్పుడే ఆకాశంలో అటు వెళుతున్న వనదేవత పక్షుల అరుపుల్లోని బాధను అర్థం చేసుకుని గూటి వద్దకు వచ్చి "ఏమిటి మీ బాధ?" అని అడిగింది.

          "ఏం చెప్పమంటావు తల్లీ,ఆ చెట్టు కింద కట్టెలు కొట్టే వాడు పడుకుని ఉన్నాడు వాడు అడవిలో అనేక చెట్లు నరకడం మేము కళ్ళారా  చూశాము.వాడు నిద్ర లేచిన తరువాత మేమున్న ఈ చెట్టును కొడతాడు.చెట్టుతో పాటు మా గూడు నాశనం అవుతుంది,మా పిల్లలు గూడు లేక చనిపోతాయి.తల్లీ నీశక్తి తో వాడి కళ్ళు తెరిపించు"అని దుఃఖంతో చెప్పాయి.

       వన దేవత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి,ఈ విధంగా చెప్పింది."మీరేం భయపడకండి,వాడి కళ్ళు తెరపించి చెట్లు కొట్టకుండా,ఇంకా చెట్లను కాపాడే విధంగా చేస్తాను"అని వన దేవత చెప్పింది.

         పక్షులు తమ రెక్కలతో వనదేవతకు నమస్కారం పెట్టాయి.కొంతసేపటి తరువాత కట్టెలు కొట్టే వాడు నిద్ర లేచి గొడ్డలి పదును పెట్టుకుని పక్షులున్న చెట్టువద్దకు వచ్చి చెట్టును ఎక్కడ కొడితే బాగుంటుందని చెట్టు చుట్టూ తిరగ సాగాడు.వాడు చూసుకోకుండా ఒక ముళ్ళ కంపపై కాలు వేశాడు.అంతే వాడి కాలు లోంచి రక్తం సర్రున చిమ్మింది. బాధతో వాడు అరిచాడు,అయినా బాధకు ఉపశమనం లభిస్తుందని,ఆ పక్కనే ఉన్న చెట్ల దళసరి ఆకు రసం పిండి గాయం మీద పోశాడు.కొంతసేపటికి వాడికి ఉపశమనం లభించింది.అయినా వాడు చెట్టు కొట్ట లేక ఇంటిదారి పట్టాడు.వాడికి ఆకలి వేయసాగింది, దారిలో ఒక చెట్టు ఎర్రటి పండ్లతో కనపడింది,వాడు ఆ పండ్లు కోసుకుని ఆవురు ఆవురు మని తిన్నాడు,అవి ఎంతో మధురంగా ఉన్నాయి.వాడి ఆకలి తీరి శక్తి పుంజుకున్నాడు.మరి కొంత దూరం వెళ్ళాక  వాళ్ళ ఊరి వైద్యుడు ధర్మయ్య కొన్ని చెట్ల ఆకులు కోసుకుంటూ కనబడ్డాడు.

        "ధర్మయ్ గారూ, మందులకు చెట్ల ఆకులు కోస్తున్నారా?" అని అడిగాడు చెట్లుకొట్టే సుంకన్న.

         "అవునురా,సుంకన్నా చెట్లు దేవతలు.మనకు ఆహార రూపంలో పండ్లు,మందులకు ఆకులు వేళ్ళు, బెరడు ఇస్తాయి అడవులు మేఘాలు ఆపి వానలు కురిపిస్తాయి.మనం బతకడానికి ప్రాణ వాయువు  ఇస్తాయి.ఇన్ని లాభాలిస్తున్న చెట్లను నీవు కొడుతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నావు.చెట్లు కొట్టే బదులు నీ పెరడులో బోలెడు పండ్లు,పూల విత్తనాలు వేయి  అవి చెట్లయితే పండ్లు,పూలు అమ్మి నీవు బతకవచ్చు.చెట్ల దీవెన నీకు ఉంటుంది." అని చెప్పాడు ధర్మయ్య.

          వన దేవత మహిమ వలన వాడి ఆలోచనలో మార్పు వచ్చింది.ఇన్ని లాభాలు ఇస్తున్న చెట్లను కొట్టకూడదని సుంకన్న నిర్ణయించుకున్నాడు,ఇక చెట్లు పెంచాలనుకున్నాడు.వన దేవత ఈ శుభ వార్త గూటి లోని పక్షులకు చెప్పంది.పక్షులు సంతోషంతో వనదేవతకు రెక్కలతో దండం పెట్టాయి.అడవిలో చెట్లు కూడా సంతోషించాయి.

              


కామెంట్‌లు