ఎర్ర పాదరక్షలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445


  దేవపురం రాజు గారు జితవర్మకు ఎనిమిదేళ్ళ కూతురు కాత్యాయని ఉంది.ఆ అమ్మాయి అంటే జితవర్మకు ఎంతో ముద్దు.

    ఒకరోజు కాత్యాయని తన స్నేహితురాళ్ళతో తోటలో ఆడుకుంటూ రంగు రంగు పూలు,రంగు రంగు పక్షుల్ని చూస్తూ ఆనంద పరవశాల్లో మునిగి పోయింది.అలా కాత్యాయని ఒక రాయినెక్కిచేతికందిన  ఓ ఎర్రని పెద్ద పువ్వు కోసి తన స్నేహితురాళ్ళకి చూపించింది.రాయి మీద నుండి కిందకు దూకడంలో  తన పాదరక్ష ఊడి పోయింది.చేతిలో ఎర్రని పూవుతోనే తన పాదరక్ష తొడుక్కుంది.అప్పుడే కాత్యాయని మనసులో ఒక కోరిక రూపుదిద్దుకుంది.

         తన పాదరక్షలన్నీ నలుపు,గోధుమ రంగులోనే ఉన్నాయి.మరి తనకు ఎర్రని పాదరక్షలు ఉంటే ఎంతో బావుంటాయి కదా! అనుకుంది.

        ఆటలయ్యాక కాత్యాయని తండ్రి జితవర్మ వద్దకు వెళ్ళి "నాన్నా నా పాదరక్షలన్నీ నలుపు,గోధుమ రంగులో ఉన్నాయి కదా! నాకు ఎర్రని పాద రక్షలు ఉంటే ఎంతో బాగుంటుంది" అని నవ్వుతూ చెప్పింది.

        కాత్యాయని చెప్పింది విని జితవర్మ ఆశ్చర్యపోయాడు.ఎందుకంటే  పాదరక్షలు కేవలం గేద చర్మం ,ఎద్దు చర్మం వంటి జంతు చర్మాలతోనే తయారు చేస్తారు.ఆ చర్మాలు నలుపు,తెలుపు ,గోధుమ వర్ణాలలోనే లభిస్తాయి! మరి ఇప్పుడు ఎర్రని చర్మ జంతువులు ఎక్కడ దొరుకుతాయి? తన ముద్దుల కూతురు కోరికను ఎలా తీర్చాలి? అని ఆలోచించ సాగాడు

    తన మంత్రి సుబుద్ధితో తన కూతురు ఎర్రపాదరక్షల కోరికను గురించి వివరించాడు.కానీ ఎర్రచర్మం ఏ జంతువునుండి సేకరించాలి?అసలు ఎర్ర జంతువులు ఎక్కడ ఉన్నాయన్న విషయం మీద రాజు, మంత్రి తర్జన భర్జనలు చేయసాగారు.

      ఇక విషయం తేలక ,ఎర్ర జంతువు ఉనికి, లేక దాని చర్మం తెచ్చి ఇచ్చిన వారికి మంచి బహుమతి ఇస్తామని చాటింపు వేయించారు.

      ఆ చాటింపు విన్న  వివేకుడు అనే యువకుడు రాజు జితవర్మను కలసి ఈ విధంగా చెప్పాడు.

       ""రాజా మన రాజ్యానికి తూర్పు దిక్కున సముద్రంలో ఒక దీవి ఉందిఒకొప్పుడు నేను ప్రయాణిస్తున్న ఓడ తుఫానులో చిక్కుకున్న్నప్పుడు,నేను అష్ట కష్టాలు పడి ఆద్వీపం చేరుకున్నాను.అప్పుడు ఆ ద్వీపంలో కొన్ని ఎర్రని జంతువులు,ఎర్రని పక్షులు ఉన్నట్టు గమనించాను,తమరు తగిన ఒక మంచి నౌక,బలవంతులైన సైనికుల్ని ఇస్తే ఆ ద్వీపానికి వెళ్ళి ఆ ఎర్రని జంతువుల్ని బంధించి తెస్తాను,వాటి చర్మంతో కాత్యానీ దేవి గారికి ఎర్రపాదరక్షలు కుట్టించవచ్చు"అని చెప్పాడు.

       వివేకుడు చెప్పిన విషయం రాజుకి,మంత్రికి నచ్చింది.వెంటనే నౌకను ,సైనికులను తోడు ఇచ్చి వివేకుణ్ణి ఆ తూర్పు ద్వీపానికి పంపారు.

      ఆ ద్వీపానికి చేరిన వివేకుడు, సైనికులు అక్కడ ఎర్రని జంతువులు సంచరిస్తున్నట్టు కనుగొన్నారు.వెంటనే వలల సహాయంతో రెండు ఎర్రని జంతువులను బంధించారు.అవి ఎంతో అమాయకంగా ఉన్నాయి!అప్పుడే వివేకునికి, సైనికులకు ఆ జంతువుల మీద ఎనలేని ప్రేమ కలిగింది.

       ఆ జంతువులను తీసుకవెళ్ళి రాజుగారికి చూపించారు.వారు ఇంతకుమునుపెన్నడూ అటువంటి జంతువులను చూసి ఎరుగరు.ఆ ఎర్రని జంతువులను గురించి తెలుసుకున్న జనం తండోపతండాలుగా వచ్చి చూడసాగారు.

       కాత్యాయని ఆ ఎర్రని జంతువులను చూసి ఎంతో ముచ్చట పడింది.వాటిని రాజు,మంత్రి పరిశీలిస్తున్నప్పుడు వివేకుడు ఈ విధంగా చెప్పాడు..

       "రాజా ఇవి ఆ ద్వీపంలో మాత్రమే అరుదుగా దొరికే జంతువులు.వీటి చర్మంతో పాదరక్షలు చేయిస్తే,ఎంతోమంది అటువంటి పాదరక్షలు చేయించుకోవాలని ఆద్వీపానికి వెళ్ళి వాటిని సంహరించి చర్మాలు సేకరిస్తారు.ఇది మంచిది కాదు. భూమి మీద జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది.ఈ అరుదైన జంతు జాతి నశించి పోతుంది.ఇప్పటికే మానవుడి స్వార్థం వలన ఎన్నో అరుదైన జంతువులు,సముద్రాలలో తిమింగలాలు నశించి పోతున్నాయి."అని చెప్పాడు.

        ఈ మాటలు విన్న కాత్యాయని కూడా  ఆ జంతువులను గురించి అర్థం చేసుకుంది.

      "నాన్నగారూ, నాకు ఎర్ర పాద రక్షలు వద్దు,నా పాద రక్షల కోసం ఈ అందమైన జంతువులను చంప వద్దు,వీటిని మన జంతు ప్రదర్శనశాల లో పెంచుకుందాం,నా పాదరక్షలకంటే వాటిని చూస్తూ ఉంటూనే నాకు ఆనందం కలుగుతుంది."అని చెప్పింది కాత్యాయని.

        అంత చిన్న వయస్సులో ఆమె ఆలోచనకు రాజు, మంత్రి,వివేకుడు "జోహార్" అని చప్పట్లుకొట్టారు.ఆ జంతువులను జంతు ప్రదర్శనశాలకు తరలించి జాగ్రత్తగా పెంచసాగారు.

     కాత్యాయని,రాజు,మంత్రి,వివేకుడి మంచి ఆలోచనకు ప్రకృతి కూడా పులకించింది.