మా మంచి గోవు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 స్వర్గంలో విష్ణువు ఆనేక లోకాల్లో జరుగుతున్న విశేషాలను నిశితంగా విశ్లేషిస్తున్నాడు! అప్పుడే నారదుడు అక్కడికి వచ్చి, "మహానుభావా,భూ లోకంలో మనిషితో పాటు రకరకాల జంతువులను సృష్టించావు.నీ సృష్టికి ఒక అర్థం ఉంటుంది కదా,అందుకని ఒకసారి భూలోకానికి వెళ్ళి అక్కడ జంతువులను, మనుషులను పరిశీలించి వస్తాను"అని ముకుళిత హస్తాలతో చెప్పాడు.
   "అలాగే నారదా నీవు అక్కడి జీవుల గుణ గణాల్ని పరిశీలించివచ్చి నాకు చెప్పు"అని తన ఆశీర్వాదం తెలిపాడు.
        వెంటనే నారదుడు శరవేగంతో ఆకాశంలో ప్రయాణించి ఒక కీకారణ్యంలో దిగాడు.అక్కడ ఒక పులి బద్దకంగా పడుకుని ఉన్నది,దాని మూతికి రక్తం అంటుకుని ఉంది! నారదుడు తను కూడా పులిగా మారి పడుకున్న పులిముందు ప్రత్యక్షమయాడు. ఆ పులి కళ్ళు తెరచి తనకు పోటీగా కొత్త పులి వచ్చిందని,క్రూరంగా అరుస్తూ నారద పులి మీదకు లంఘించింది! "క్రూరత్వం దీని స్వభావం"అనుకుంటూ నారదుడు అక్కడినుండి మాయమయ్యాడు.
        తరువాత నారదుడు ఏనుగ రూపంలో ఓ చెఱువు గట్టున చెరకు గడలు తింటున్న ఏనుగ ముందు ప్రత్యక్షమయి తనకు కొన్ని చెరకు గడలు ఇమ్మనమని అడిగాడు. ఆ ఏనుగ "నాకు రెండు రోజులనుండి తిండి లేదు మహా ఆకలితో ఉన్నాను పుష్కలంగా తనకు గడ్డి,చెరకు దొరికినపుడు పిలుస్తాను" అని నమ్రతగా చెప్పింది.
       నారదుడు దాని ఆకలికి ఆశ్చర్యపోతూ దూరంగా గడ్డి మేస్తున్న గుర్రం వద్దకు గుర్రం రూపంలో వెళ్ళి అది మేస్తున్న గడ్డి కుప్పలోంచి కొంత గడ్డి అడిగాడు.ఆ గుర్రం కనీసం నారద గుర్రం వైపు చూడను కూడా చూడలేదు,తదేకంగా మేస్తూనే ఉన్నది! దాని మంద బుద్దికి నారదుడు ఆశ్చర్య పోయి, అక్కడినండి అల్లంత దూరంలో పచ్చగడ్డి మేస్తున్న ఒక గోవు వద్దకు గోవు రూపంలో వెళ్ళాడు.
      "ఆకలిగా ఉంది కొంచెం గడ్డి ఇవ్వవా" అని అడిగాడు 
     "అయ్యో ఎంత మాట కడుపారా ఈ గడ్డి తిను, మనం తినే దానిలో కొంత అవసరం ఉన్న వాడికి ఇస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయి,ఈ జన్మకు ఒక అర్థం ఉంటుంది"అని ఎంతో ఆధ్యాత్మికంగా చెప్పింది.
      నారదుడు గోవు మాటలకు ఆశ్చర్య పోయాడు.
  నారదుడు ఒక ఊరిలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కర్రతో కొడుతున్నాడు.నారదుడు పరుగున వెళ్ళి ఆవ్యక్తిని ఆపి అతనిని కొట్ట వద్దని చెప్పాడు.
      "వీ డు నా దగ్గర అప్పు తీసుకుని ఇవ్వడం లేదు, అందుకే వీడిని శిక్షిస్తున్నాను"అని ఖఠినంగా చెప్పాడు.
       "ఆ మాత్రానికే ఇంత శిక్ష వేయాలా,అప్పు తీర్చడానికి కొంత సమయం ఇవ్వవచ్చుకదా"అప్నాడు నారదుడు.
      "లేదు శిక్ష ఖఠినంగా ఉంటే భయపడి బాకీ తీరుస్తాడు"అన్నాడు.
       "నీవు చేసే పని తప్పు,ఏదో పని చేసి నీ అప్పు తీరుస్తాడు"అని చెప్పి నారదుడు అప్పు తీసుకున్న వ్యక్తిలో శ్రమశక్తిని ప్రవేశ పెట్టాడు.ఆ వ్యక్తి పని చేసి డబ్బు సంపాదించి అప్పు తీర్చాలని వెళ్ళి పోయాడు.
        ఒక దేవాలయం వద్ద ఒక వ్యక్తి అన్నదానం చేస్తూ కనబడ్డాడు.అతని అన్నదాన వితరణకు నారదుడు ఆశ్చర్య పోయాడు.
      ఆ విధంగా నారదుడు రకరకా గుణాలు గల మనుష్యలను పరిశీలించి.విష్ణు లోకానికి వెళ్ళి విష్ణువుతో ఈ విధంగా చెప్పాడు.
        "మహానుభావా,నా పరిశీలనలో పులులు క్రూరత్వంతోను,ఏనుగ అతి ఆకలితోనూ, గుర్రం మంద బుద్ది తోనూ మనుషుల్లో మంచివారు,చెడ్డ వారు ఉన్నారు.జంతువులలో గోవు నాకు అత్యుత్తమంగా కనబడింది,దానికి ఏదైనా మేలు చెయ్యండి"అని నారదుడు విష్ణువుకు విన్నవించాడు.
      "పులి క్రూర జంతువు,అది విచ్చల విడిగా పెరిగి పోతున్న కొన్ని జంతువులను మాత్రమే తిని జంతు సమతుల్తను కాపాడుతుంది.ఏనుగ ఆకారం పెద్దది మానవుడు దానిని మచ్చికచేసుకుని పెద్ద బరువులు మోయిస్తాడు.దాని ఆకారానికి తగిన ఆహారం తింటుంది.గుర్రం మంద బుద్దిది దాని చేత పని చేయించుకోవాలంటే అంటే బండికి కట్టినా దాని చూపు ఇటు అటు పోకుండా దాని కళ్ళకు పక్క గంతలు అమరుస్తారు! అది మానవుడి సేవలో తరిస్తోంది
       "ఆవు సాధు జంతువు దానికి ఎన్నో
 మంచి గుణాలు ప్రసాదించాను అది మానవులకు ఎంతో సేవ చేస్తుంది,మంచి బుద్ది కలది అందుకే ఆవు పాలు పిల్లలకి ఎంతోశ్రేష్టం.దాని మూత్రం,పేడ కూడా ఔషద గుణాలు కలిగి ఉంటాయి.అందుకే ఆవు కామధేనువుగా పూజింప బడేటట్లు వరమిచ్చాను"అని అర్థ నిమీలిత నేత్రాలతో చెప్పాడు మహావిష్ణువు.
      "పోతే మానవులలో రకరకాల గుణాలు కలిగిన మనుషులు ఉంటారు అది వారి పూర్వ జన్మ సుకృతం.ఎవరికి వారు సంస్కరించుకుని బాగు పడాల్సిందే"అని వివరించాడు విష్ణువు.
        "నీ సృష్టికి ఎంతో అర్థం ఉంది...నీ లీలలు అధ్బుతం"అని విష్ణువును స్తితించి మరలా లోక సంచారానికి బయలు దేరాడు నారద మహర్షి.