నెమళ్ళపాలెంలోని అరుంధతమ్మకు శివయ్య ఒక్కడే కొడుకు. తండ్రిలేని వాడు ఏదైనా పని సంపాదించి అమ్మను సుఖపెట్టాలని కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు.
ఒకరోజు దానవులపాడులోని జమీందారు తనవద్ద కొలువు కొరకు చాటింపు వేయించాడని తెలుసుకుని వెళ్ళాడు. అక్కడ జమీందారు, ఆయన భార్య వసుంధర వచ్చిన వారికి కొన్నిరకాల పరీక్షలు పెట్టారు. ఆపరీక్షల్లో నలుగురు ఎన్నికయ్యారు.వారి ఊరిపేరు, తల్లిదండ్రులగురించిన వ్యక్తిగత వివరాలడిగారు. మామనుష్యులు మీఊరికొచ్చి మీవ్యక్తిత్వం గురించి విచారిస్తారు.తర్వాత కొలువులో చేరడానికి మీకు కబురందుతుందని చెప్పి పంపారు. శివయ్య ఊరు చేరాడు.
మరుసటిరోజు ఉదయమే అరుంధతమ్మ ఇంటిముందు గుర్రంబగ్గీ ఆగింది. ఓయువతిదిగి ఇంట్లోకొచ్చింది. ఆమెను చూసి శివయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆమె జమీందారు భార్య వసుంధర. ఆమె అరుంధతమ్మ దగ్గర కూర్చుని "అమ్మా!నన్ను గుర్తుపట్టావా?"అంది.
అరుంధతమ్మ ఆమెను పరిశీలనగా చూసి"నువ్వు వసుంధరవు కదా! మీ అమ్మ నీవు మాఇంటి దగ్గరలో ఉండేవారుకదా! ఊరొదిలివెళ్ళి పోయారు కదా! ఇప్పుడు ఎక్కడున్నారు?మీఅమ్మ సరోజ ఎలాఉంది?" అడిగింది అరుంధతమ్మ. అరుంధతమ్మ సరోజఇళ్ళు పక్కపక్కనే ఉండేవి.అరుంధతమ్మ భర్త చిన్నకొలవులో ఉండేవాడు.సరోజమ్మ భర్త పాముకాటుతో చనిపోయాడు.ఆమెకు వసుంధర అనే యుక్తవయస్కురాలైన కూతురు ఉండేది. సరోజ కూలిపనికి వెళ్ళేది.
ఒకసారి వసుంధరకు తీవ్రమైన జబ్బు చేసింది. వైద్యుడిని సంప్రదిస్తే ఆరునెలలకాలం మందులు వాడాలని చికిత్సకయ్యే ఖర్చు గురించి చెప్పాడు. ఆలస్యం చేస్తే ప్రాణందక్కదన్నాడు. అంతడబ్బు ఆమె దగ్గర లేకపోవడంతో ఏంచేయాలో తోచక బాథపడసాగింది. విషయం తెలుసుకున్న అరుంధతమ్మ తాను ఎంతోకాలం నుండి పొదుపు చేసుకున్న డబ్బును ఇచ్చి ఆదుకుంది. వసుంధరను కాపాడింది.ఆమె మంచితనానికి, దయాగుణానికి తల్లీకూతురు చేతులెత్తి నమస్కరించారు.జరిగిపోయిన సంగతులు గుర్తుచేసుకుంటూ,తర్వాత జరిగిన విషయాలు చెప్పింది వసుంధర. ఆరోజునుండి వసుంధరకు వైద్యం నేర్చుకోవాలనే పట్టుదలకల్గింది. పేదవారు ఎవరూ తమలాగా ఇబ్బందిపడకుండా ఉచితవైద్యం అందించాలని మనసులో ఆశయం ఏర్పడింది.తల్లితో కలిసివెళ్ళి, చాలామంది వైద్యులను కలిసింది. చివరకు దానవులపాడులో ఉన్న వయస్సుపైబడి తనఅనంతరం ఎవరికైనా మంచివారికి వైద్యం నేర్పాలనుకుంటున్న ఘనవైద్యుడు నీలకంఠయ్య ఆఅమ్మాయికి వైద్యవిద్యను నేర్పడానికి ఒప్పుకున్నాడు. తల్లీకూతురిద్దరూ ఊరొదిలివెళ్ళి దానవులపాడు చేరారు. వసుంధర చాలాకష్టపడి నీలకంఠయ్య దగ్గర వైద్యవిద్య నేర్చుకుంది. సంవత్సరకాలంలో నే ప్రావీణ్యం సంపాదించింది. సంతానంలేని ఆయన తనవైద్యశాలను శిష్యురాలైన వసుంధరకు అప్పజెప్పి కన్నుమూశాడు. అనతికాలంలోనే ఘనవైద్యురాలిగా వసుంధరపేరు చుట్టుపక్కల మార్మోగింది.
ఒకసారి దానవులపాడు జమీందారుకొడుకు అనారోగ్యంతో వసుంధరవద్ద కొంతకాలం చి
కిత్సపొందాడు.ఆమె సేవాభావానికి, మంచితనానికి ముచ్చటపడ్డాడు. తండ్రిని ఒప్పించి వసుంధరను వివాహమాడాడు. వివాహం అనంతరం ఆమె సేవలను మరింత మందికి చేరువయ్యేలా చేసింది.సరోజమ్మ వసుంధర వద్దనే ఉంది. ఈవిషయాలన్నీ అరుంధతమ్మకు, శివయ్యకు వివరించి చెప్పింది వసుంధర.
"అమ్మా!మేము ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు.నాకు వైద్యం చేయించి నాప్రాణం కాపాడారు. మీసహాయం అమూల్యమైనది.పనికోసం వచ్చిన శివయ్యను గుర్తుపట్టాను. శివయ్యను ఉన్నత కొలువుకు ఎంపికచేశాము. అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. మీరు ఉండటానికి అన్నిఏర్పాట్లు చేశాము." చెప్పింది వసుంధర.
అరుంధతమ్మ కళ్ళలో ఆనందబాష్పాలు తిరిగాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి