విజయ పతాకమా! శత సహస్ర వందనం!:-నాశబోయిన నరసింహ (నాన),ఆరోగ్యపర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,9542236764
అమరవీరుల త్యాగ నిరతికి నిలువెత్తు సాక్ష్యం
నర నరం దేశభక్తి ఉరకలెత్తించే సమైక్యతా రాగం
విదేశీ శత్రుమూకల భరతం పట్టే సింహ స్వప్నం
భరతజాతి ఔన్నత్యం దశ దిశలా చాటే స్వేచ్ఛాగీతం

తర తరాల బానిసత్వ  విముక్తి శుభ సంకేతం
తల్లి భారతికి వీరతిలకం దిద్దే విజయ సంకల్పం 
కాషాయం తెలుపు ఆకుపచ్చ సమవర్ణాల సంగమం
శాంతి శౌర్యం త్యాగాల ధర్మ చరిత్ర సంకలన గ్రంథం 

సత్య అహింసల ధర్మ ప్రభోధ శాంతి శిఖరం
ప్రాంత భాష కుల మతాలకతీత ప్రగతి రథచక్రం
బిన్నత్వంలో ఏకత్వ భావనా ఉత్తుంగ తరంగం  
తెలుగు తేజం పింగళి వెంకయ్య సృజన కళానైపుణ్యం

సంస్కృతీ సంప్రదాయ వారసత్వ నిలయం
ఒకరినొకరు తోడుగా వందేమాతర నినాదం
శాస్త్ర సాంకేతిక ప్రతిభా పాటవాల కీర్తి కిరీటం 
దయార్ధ్ర హృదయ కరుణ రసాత్మక ప్రవాహం

దేహం తృణ ప్రాయమని చాటే ధీరత్వం
దేశ రక్షణకై తహతహ లాడే అఖండ దీపం
జాతి ఆత్మ గౌరవ మువన్నెల రెపరెపల ధ్వజమా!
వంద వసంతాల విజయ పతాకమా! శత సహస్ర వందనం!

(31మార్చి 2021నాటికి జాతీయజెండాకు వంద ఏళ్లు నిండిన సందర్భంగా...)