ధరణి పైన మర్రి చెట్టు
దద్దరిల్లుతోందిరా
ఎండ వాన కింద పడక
గొడుగు బట్టె చూడరా
చిన్న పిల్లలూయలూగ
ఊడలెన్నొ ఇచ్చెరా
ఊడలన్ని భూమి లోకి
చొచ్చుకొని పోయెరా
తిరిగి మరో చెట్టు వలె
పెరుగు చుండు చూడరా
అడవిలోని పక్షులకు
తన దేహము గూడురా
తేనెటీగలన్ని వాలి
పుట్టతేనె పెట్టురా
తాను తినక నితరులకు 🍯
తేనెఇచ్చి వెళ్ళురా
ఊరులోని పెద్దవారు
రచ్చబండ యందురు
చిన్న పెద్ద తగాదాలు
చెట్టుకింద చేయుదురు
తన నీడన మరో చెట్టు
బతుక నివ్వకుండును
తన తనువులో జీవులకు
స్వేచ్ఛగ చోటుండురా
తన పిల్లలు తన చుట్టే
పెరుగు చుండమురియురా
స్వార్థము ప్రతి మనిషికి
తప్పకుండ యుండురా
స్వార్థం, నిస్వార్థము
బొమ్మ బొరుసు లాంటివిరా
పరుల మేలు కోరి పండ్లు
పక్షులకు నిచ్చురా
విత్తు చిన్నదే గాని
విచిత్ర మెంత గొప్పది
చెట్లు పెట్టకున్న గాని
వున్నవి నరికేయకురా
ప్రకృతిని పాడుజేసి
జల్సా నీవుజేయకురా
నీ తరముకు నష్టము
తరతరాల ప్రాణ నష్టము
అందుకే నడుం కట్టరా
పచ్చని చెట్లు పెట్టురా
హరితహార మందునీవు
సతము చెట్లు బెంచురా