శివయ్య కుమారుడు వెంకటేశం చాలా సోమరి. తన బంధువులందరికీ వెంకటేశానికి మంచి ఉద్యోగాన్ని చూసి పెట్టమని చెప్పాడు శివయ్య .అతడు ఎక్కడ ఉద్యోగం దొరికినా పోయేవాడు కాదు. ఎన్నోసార్లు శివయ్య అతడిని బ్రతిమిలాడాడు. తాను చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతావని ప్రశ్నించాడు ?ఉద్యోగం ఉంటేనే పెళ్లికి ఎవరైనా పిల్లను ఇస్తారని అన్నాడు.ఎన్ని చెప్పినా ససేమిరా అన్నాడు వెంకటేశం.
ఒకరోజు దూరపు గ్రామమైన సిరికొండ నుండి శివయ్య బంధువు ఒకరు వచ్చి అక్కడ ఒక ఉద్యోగం ఉందని, తాను ఇప్పిస్తానని శివయ్యకు చెప్పాడు. కానీ శివయ్య ఆ సంగతి వెంకటేశాన్నే అడగమని సూచించాడు. ఈసారి వెంకటేశం ఎందుకో ఆ ఉద్యోగానికి వస్తానని చెప్పాడు. శివయ్య ఎగిరి గంతేశాడు. " ఏమిరా !నిజంగానే ఉద్యోగం చేస్తావా .నేను నమ్మలేకపోతున్నాను" అని అన్నాడు శివయ్య. " అవును నాన్నా !ఈ మామయ్య గుర్రపు బండి లోనే రేపు నేను సిరికొండకు ప్రయాణమై పోతున్నాను" అని అన్నాడు వెంకటేశం .
మరుసటి రోజు శివయ్య గుర్రపు బండిలో తన పెట్టెబేడా తో ప్రయాణమైన వెంకటేశాన్ని చూసి ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు శివయ్య .ఊరి పొలిమేర వరకు వారిని సాగనంపాడు .అందరికీ తన కొడుకు ఉద్యోగానికి వెళ్ళాడనీ ఊరంతా చెప్పుకుంటూ, ఇరుగు పొరుగు వారికి కూడా ఆ సంగతిని సంతోషంతో తెలియజేశాడు .నెమ్మదిగా ఇంటికి శివయ్య తిరిగి వచ్చి తలుపు తట్టే సరికి ఆ తలుపు తీసిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు శివయ్య. అతడు ఎవరో కాదు. వెంకటేశం. తన కన్నా ముందే సామానుతో ఇంటికి చేరుకున్నాడు వెంకటేశం.శివయ్య నోట మాట రాక తల పట్టుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి