పొగడ్త:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

  భూషయ్యకు పొగడ్తలంటే గిట్టదు. అతడు గొప్ప దానశీలి. ఎవరు ఏది అడిగినా లేదనే వాడు కాడు. ఆ గ్రామంలో భూషయ్య సహాయం పొందని వారు ఎవరూ లేరు .
      భూషయ్య వద్దకు పొరుగు గ్రామం నుండి రంగడు అనే యువకుడు వచ్చి" అయ్యా !మీరు కర్ణుని లాంటివారు .నాకు ఐదువందల రూపాయలు ఇప్పించండి "అని అన్నాడు. అందుకు భూషయ్య "చూడు బాబూ! నీవు నన్ను కర్ణుడు, శిబి చక్రవర్తి అని పొగడితే  నాకు నచ్చదు. నీవు ఊరకే డబ్బు ఇమ్మన్నా ఇస్తాను కానీ నన్ను పొగిడే వారికి నేను ఇవ్వను" అని అన్నాడు. 
      అందుకు రంగడు ఊరుకోకుండా" అయ్యా! పొగడ్తలకు ఎలాంటి వారైనా లొంగవలసిందే .మీరు పొగడ్తలకు లొంగరు అని  అంటే ఎవరూ నమ్మరు" అని అన్నాడు. అప్పుడు భూషయ్య" నేను పొగడ్తలకు లొంగనని  ముందే చెప్పాను. ఒకవేళ లొంగితే నీవు కోరినంత ధనం ఇస్తాను "అని అన్నాడు. అందుకు రంగడు సరేనన్నాడు.
       ఒక్కసారి భూషయ్య వద్దకు  కొందరు రైతులు వచ్చి తమకు ఆర్థిక సహాయం చెయ్యమన్నారు. వారు భూషయ్యను" ఇంద్రుడు ,చంద్రుడు" అంటూ పొగిడారు. భూషయ్య దగ్గర ఉన్న రంగడు "ఆయనకు పొగడ్తలు అంటే గిట్టదు" అని అన్నాడు. అప్పుడు రైతులు నోరు మూసుకున్నారు. భూషయ్య వారిని వొట్టిచేతులతో పంపేశాడు. 
      తర్వాత భూషయ్య దగ్గరకు ఎందరు వచ్చినా  రంగడు" వీరికి పొగడ్త అంటే గిట్టదు "అని చెప్పసాగాడు .దానితో వచ్చిన వారు పొగడడం మానేశారు.భూషయ్య ఎంతో సంతోషించాడు .అప్పుడు రంగడు "అయ్యా !నేనే గెలిచాను. నాకు మీరన్న ప్రకారం కోరినంత ధనం ప్రసాదించండి" అని అన్నాడు. భూషయ్య "నీవు ఎక్కడ గెలిచావు ? నేను  పొగడ్తలకు లొంగ లేదుగా! నేను లొంగితే నీకు కోరినంత ధనం ఇస్తానన్నాను కానీ నేను లొంగలేదుగా" అని అన్నాడు.
      అప్పుడు రంగడు "అయ్యా! నేను ప్రతి వారితో వీరికి పొగడ్తలంటే గిట్టదని చెప్పాను .ఇది కూడా ఒక పొగడ్తనే. అంటే మీరు పొగడ్తల కన్నా ఎక్కువైన  కీర్తిని కోరుకుంటున్నారని మాకు అర్థమైంది. అందుకే వచ్చిన వారంతా మిమ్మల్ని పొగడ లేదు సరికదా మిమ్మల్ని పొగడే అర్హత వారికి లేదని అనుకుంటున్నారు. అందువల్ల మీరు పొగడ్తలకు లొంగినట్లే "అని అన్నాడు.
          ఈ మాటలు విన్న భూషయ్య రంగని మాటలతో ఏకీభవించి వాడికి కోరినంత ధనం ఇచ్చి పంపాడు.