ధైర్యం:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

  గోవిందం గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. గురువు గోవిందంపై   ప్రేమతో అన్ని విద్యలు నేర్పాడు ."ఎంత ఆపద అయినా ధైర్యంగా  ఉండాలి. ఎప్పుడూ ధైర్యాన్ని విడువకు .అది నీకు విజయాన్ని కలిగిస్తుంది "అని అన్నాడు గురువుగారు. "అలాగే గురువు గారు" అని అన్నాడు గోవిందం.
       అతడు ఒకసారి  అడవిగుండా ప్రయాణం చేస్తున్నాడు. ఒక భయంకర రాక్షసుడు అతడిని అడ్డగించాడు. గోవిందానికి చాలా భయమై కళ్ళు మూసుకున్నాడు .కానీ గురువు గారి మాటలు జ్ఞాపకం వచ్చి పైకి ధైర్యంగా ఉన్నాడు. " ఒరేయ్! కళ్ళు తెరిచి నన్ను చూడు" అని అన్నాడు ఆ రాక్షసుడు . "నేను ధ్యానంలో ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నిన్ను చూడ వలసిన అవసరం నాకు లేదు" అని అన్నాడు గోవిందం. రాక్షసుడు ఈ మాటలకు ఆశ్చర్యపోయి "ఇతనికి నేనంటే భయం లేదు. అందుకే అలా ధైర్యంగా తనతో మాట్లాడుతున్నాడు " అని తన మనసులో అనుకొని "ముందుకు వెళ్ళు. నీకు లాభం కలుగుతుంది" అని మాయమయ్యాడు.
         గోవిందం రాక్షసుని పీడ విరగడైపోయిందని సంతోషించి ముందుకు నడిచాడు. అక్కడ నలుగురు దొంగలు అతడిని అడ్డగించి అతని దగ్గర ఉన్న పైకం ఇమ్మన్నారు. గోవిందం వారిని చూసి భయ పడ్డాడు. కానీ గురువు గారి మాటలు అతని చెవిలో గింగురుమంటున్నాయి.  వెంటనే అతడు వారితో తన సంచిలో ఉన్న కత్తిని తీసి చూపించి "నాకు కోపం వచ్చిందంటే ఈ కత్తితో మీ అందర్నీ నరికి వేస్తాను "అని అన్నాడు ."ఏదీ నరకు చూద్దాం" అని అన్నాడు ఒక దొంగ .వెంటనే గోవిందం "ఇదిగో చూడండి . ఈ సంచిలో ఉన్న కుందేలును ఇప్పుడే చంపుతున్నాను" అని తన సంచిలో ఉన్న ఒక దిండును ఆ కత్తితో పొడిచాడు .అందులో ఇది వరకే ఒక సీసాలో ఎర్ర రంగు నీళ్లు పోసుకుని ముందు జాగ్రత్తగా తన వెంట తెచ్చుకున్నాడు . ఆ కత్తి ధాటికి ఆ సీసా పగిలి అందులో ఉన్న ఎర్ర రంగు నీళ్లు కూడా బయటకు వచ్చి వారికి రక్తం లాగా కనిపించింది. వారు కుందేలును గోవిందం చంపాడనుకొని భ్రమపడి భయపడి వారు సంపాదించిన సొత్తంతా అక్కడే వదిలేసి  ఒకే పరుగుతీశారు. గోవిందం ఎంతో సంతోషించాడు.
         గోవిందం మరి కొంత దూరం వెళ్లేసరికి ఒక పెద్దపులి కనిపించింది .వెంటనే అతడు దగ్గర్లో ఉన్న ఒక చెట్టును ఎక్కాడు .పులి వచ్చి ఆ చెట్టు కింద నిలబడి చాలాసేపు వరకు అతడు దిగుతాడేమోనని చూచింది.కానీ గోవిందం ధైర్యంగా దాని వైపే చూశాడు.  చివరకు దానికి విసుగెత్తి  అక్కడినుండి ఆ పులి  వెళ్ళిపోయింది. గోవిందం లేచి తన గ్రామానికి చేరుకొని తాను సంపాదించిన దొంగ సొత్తంతా ఆ గ్రామంలోని అందరికీ పంచాడు. వారు అతని మంచితనానికి మెచ్చి  అతనికి ఒక మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు. గోవిందం తన భార్యతో ఆనందంగా గడిపాడు. కానీ ధైర్యాన్ని మాత్రం వీడలేదు.