గురుశిష్యులు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్:9908554535.

 ఒకసారి గురుశిష్యులు దేవాలయానికి వెళ్లారు. అక్కడ గురువు గారు ప్రవచనం చేశారు. ఆ ప్రవచనాన్ని విన్న ఒక దుకాణాదారుడు "అయ్యా! ఈ పూట మా ఇంటికి రండి .మా ఆతిథ్యాన్ని ఈపూట  స్వీకరించండి" అని అన్నాడు. అందుకు గురువుగారు అంగీకరించాడు.
      అయితే ఆ దుకాణాదారుని తండ్రి  పిసినిగొట్టు. దుకాణాదారుడు వారిని తన ఇంట్లో దింపి తాను మిఠాయి తేవడానికని  బయటకు వెళ్లాడు. అప్పుడు ఆ పిసినారైన తండ్రి  గురువు గారితో" అయ్యా! మీరు ఎక్కడా  భోజనం  చేయరని అనుకుంటాను" అని అన్నాడు .గురువుగారు మొహమాటస్థుడు. కావున "అవునండీ" అని అన్నాడు ."అలాగే అల్పాహారం కూడా బయట తినరు కావొచ్చు" అని అన్నాడు. " అవునండీ" అన్నాడు గురువుగారు . "టీ, కాఫీలు కూడా తీసుకోరు కావొచ్చు" అని అన్నాడు ఆ తండ్రి . "అవునండీ" అని అన్నాడు గురువుగారు.
        ఈలోపుగా దుకాణదారుడు మిఠాయితో సహా అక్కడికి వచ్చి ఇంటివారిని భోజనాన్ని సిద్ధం చేయమన్నాడు. అప్పుడు అతని తండ్రి "గురువుగారు మన ఇంటిలో  భోజనం చేయరట" అని అన్నాడు . అప్పుడు ఆ శిష్యుడు "నేను చేస్తాగా"అని అన్నాడు . "అది ఏమిటి ?గురువుగారు తినరట గదా" అని అన్నాడు ఆ పిసినారి . "అదేం లేదు .నేను తింటే మా గురువుగారు కూడా నాతో పాటే తింటారు. వారు వ్యతిరేకంగా మాట్లాడుతారు. వారి సంగతి నాకు మాత్రమే తెలుసు ."మీకు  తినను" అని చెబుతారు. అంటే తింటారని అర్థం.  అంతేకాదు. భోజనాల్లో నాలుగు కూరలు, రెండు రకాల మిఠాయిలు కూడా ఉండాలని నాకు చెప్పారు" అని అన్నాడు  ఆ కొంటె శిష్యుడు .
       ఆ మాటలకు పిసినారి తండ్రి తన కొడుకు ముందర ఏమీ అనలేక నోరు మూసుకున్నాడు.