మంచి స్నేహితుడు:--- సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.-- మొబైల్: 9908554535.


  రాము, సోము స్నేహితులు . రాము బీదవాడు. సోము ధనవంతుడు. ఒకసారి రాము తన మిత్రుడైన సోముతో కలిసి విహారానికి బయలుదేరి వెళ్లాడు.  వారు ఇద్దరూ  ఒక చెరువు వద్దకు వెళ్లారు. రాముకు ఈత రాదు. సోము ముందుగా ఆ చెరువులో స్నానం చేసి వచ్చాడు. రాము చెరువు ఒడ్డున గల ఒక రాయి పై నుండి  ఆ చెరువు అందాన్ని చూడసాగాడు. రామును కూడా సోము స్నానం చేయమని చెప్పాడు .కానీ రాము వినలేదు .అప్పుడు సోము రామును తమాషాకు నీటిలోకి ఒక్క తోపు తోశాడు. సరిగా అదే సమయానికి రాముకు బండమీద కాలుజారింది. తనను నీటిలో పడకుండా  సోము పట్టుకునే ప్రయత్నం చేశాడని రాము అనుకున్నాడు. అతడు తమాషాకు తనను నీటిలో తోసిన  సంగతి రాముకు తెలియదు .

             అప్పుడే ఒక పెద్దపులి ఆ చెరువు వైపు రావడం చూసి సోము ప్రాణభయంతో వెంటనే పరుగెత్తి ఒడ్డున ఉన్న ఒక చెట్టును ఎక్కాడు. " కాపాడండి. కాపాడండి" అని సోము   గట్టిగా అరిచాడు.

       అతని మాటలు దూరాన్నుండి విన్న అక్కడి జాలర్లు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని సోమును  ప్రశ్నించారు? సోము జవాబు చెప్పే లోపునే "కాపాడండి !కాపాడండి "అన్న రాము అరుపులు  వారికి వినిపించాయి .వెంటనే వారు జరిగిన సంగతి గ్రహించి  ఆ నీటిలోకి  దూకి రామును కాపాడారు. ఈ జాలర్లను  దూరం నుండి చూసిన పెద్దపులి  వెనుకకు తిరిగి పారిపోయింది. జాలర్లు ఆ పులిని  గమనించనే లేదు .

    తర్వాత సోము చెట్టు  దిగి  రామువద్దకు వచ్చాడు. రాము సోముకు తన ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. సోము ఆశ్చర్యపోయాడు. తాను పులిని గమనించి చెట్టు ఎక్కాడే తప్ప రాము గురించి కేకలు వేయలేదు. అంతేకాదు.రామును తానే తమాషాకు  ఆ నీటి లోకి తోశాడు.  అతనికి ఈత రాదన్న  సంగతి సోముకు తెలియదు. తనకు ఈత వచ్చినా రామును తాను కాపాడలేదు. అందుకు కారణం పెద్దపులి. అది అటువైపుగా రావడం చూసి భయపడి తాను పారిపోయాడు. కానీ రాము తనను తాను  కేకలు వేసి కాపాడినట్లు అతడు జాలర్ల తో  చెప్పాడు .  సోము తాను చేసిన పనికి మిక్కిలి కుమిలి పోయాడు. రాముతో తనను  క్షమించమని సోము  జరిగిన సంగతిని పూసగుచ్చినట్లు  చెప్పాడు. కానీ రాము ఇది నమ్మలేదు .రాము అతడు చెప్పింది  వినకుండా " నీవే లేకుంటే నా ప్రాణాలు పోయి ఉండేవి. నీవే నా ప్రాణాలను కాపాడావు" అని అన్నాడు.

         ఎవరో చెప్పగా విని ఈ సంఘటనను తెలుసుకున్న రాము  తల్లిదండ్రులు అక్కడకు వచ్చి జాలర్లు చెప్పినది విని సోమును మిక్కిలి పొగిడారు .సోము తాను చేసిన పనికి సిగ్గుపడి మంచి స్నేహితుడైన రాముకు  ఆర్థిక సహాయాన్ని చేసి అప్పటి నుండి  తన బుద్ధిని మార్చుకుని మంచి స్నేహితునిగా పేరు తెచ్చుకున్నాడు.


కామెంట్‌లు