మార్గం:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య ధర్మపురి--మొబైల్: 9908554535


  ఒక గురువు వద్దకు ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని పోయి అతడు చదవడం లేదని, అతడు చదివే మార్గాన్ని  చెప్పాలని కోరాడు.

      అప్పుడు ఆ గురువు ఆ బాలుని పిలిచి" నీవు ఎందుకు చదవడం లేదు "అని ప్రశ్నించాడు? " స్వామీ! నాకు కొన్ని విషయాలు చదవడం ఇష్టం లేదు. నా బుర్రకు అవి ఎక్కడం లేదు" అని అన్నాడు.

     " అలా నీకు ఇష్టం లేనప్పుడు  నీవు పది పేజీలకు బదులు ఒక పేజీయే చదువు. నీకు అలవాటు అవుతుంది" అని అన్నాడు గురువు. "నాకు చదువంటేనే ఆసక్తి లేదు "అని అన్నాడు ఆ బాలుడు.

          అప్పుడు ఆ గురువు "రోజూ ఒక బండరాయిని తెచ్చి అక్కడ వెయ్యమన్నాడు .ఇలా రోజూ తన దగ్గరకు రమ్మన్నాడు. ఆ బాలుడు అలాగే చేశాడు. అప్పుడు గురువు ఆ రాళ్లను చూపి లెక్క పెట్టమన్నాడు. అవి "ముప్పది "అని చెప్పాడు ఆ బాలుడు .ఈ రాళ్లను నీవు  కష్టపడి మోసుకొని అక్కడనుండి తెచ్చి ఇక్కడ  వేసే బదులు రోజూ ఒక పేజీ చదివితే నీవు ఎంతో లాభపడే వాడివిగా" అని అన్నాడు గురువు. "గురువు గారూ!ఎలా లాభపడేవాడిని " అని ప్రశ్నించాడు బాలుడు.

          నీవు ఇలా రోజూ  ఒక్క పేజీ చదివితే నెలకు ముప్పది  పేజీలు చదివినట్టు అవుతుంది. కనుక నీకు ఇష్టమైనవి ఎక్కువ పేజీలు, కష్టమైనవి తక్కువ పేజీలు చదివితే నీవు పరీక్షలో ఉత్తీర్ణుడవు అవుతావు" అని అన్నాడు గురువు. 'సరే' అన్నాడు ఆ బాలుడు.

          గురువు గారు చెప్పినట్లు అన్ని విషయాలు చదివి తరగతికే ప్రథముడిగా వచ్చాడు ఆ బాలుడు.అందుకే కష్టపడే బదులు ఇష్టపడి చదవాలి.


కామెంట్‌లు