పరామర్శ:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.-మొబైల్: 9908554535.

  ధర్మయ్య ధర్మం తప్పనివాడు. అబద్ధం ఆడని వాడు .ఆ సంగతి ఊళ్లో వాళ్లందరికీ తెలుసు. ఎవరినైనా ముక్కుసూటిగా అనే స్వభావం కలవాడు.
         ఇలా ఉండగా ఆ ఊరి జమీందారు గారి తల్లి ఆకస్మికంగా చనిపోయింది. పరామర్శించడానికి ఎవరూ వెళ్లలేదు .అందుకు కారణం ఆమె పరమ గయ్యాళి .ఆమె చేత దూషింప బడని వాళ్ళు ఆ గ్రామంలో ఎవరూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకు ఆ గ్రామంలో మంచి పేరు లేదు.
        ధర్మయ్య జమీందారు గారిని పరామర్శించడానికి తన నౌకరు కనకయ్యతో వెళ్ళాడు. జమీందారును చూచిన ధర్మయ్య" ముసలామె పాపం పోయింది. ఆమె పోవడం వల్ల కష్టాలు నివారణ అయ్యాయి .ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది "అని ఊరడించాడు.
        ఆ తదుపరి బయటకు వచ్చిన ధర్మయ్య తో కనకయ్య "అయ్యా !మీరు అబద్ధం ఆడరని అంటారు. ఆ ముసలామెను మీరు పొగడి అబద్ధం ఆడారు" అని అన్నాడు .
         అప్పుడు ధర్మయ్య "లేదురా !నేను అబద్దం ఆడలేదు. ముసలామె పాపమే పోయిందని, ఆమె పోవడం వల్ల అందరి కష్టాలు నివారణ అయ్యాయని మాత్రమే అన్నాను. అనగా ఆమెచే తిట్లు ,శాపనార్థాలు తప్పాయని మాత్రమే అన్నాను" అని అన్నాడు.
        మళ్లీ కనకయ్య "అయ్యా !అందరిని ముక్కుసూటిగా అనే మీరు ఇలా గూఢంగా అనడానికి కారణం ఏమిటి" అని అన్నాడు. " అవునురా! చనిపోయిన వారి గురించి ఎవరైనా మంచిగానే మాట్లాడుతారు. ఇక్కడ అబద్ధమాడినా తప్పులేదు. ఇక్కడ ఉన్నది ఉన్నట్లు 'ఆమె గయ్యాళి 'అని అంటే జమీందారుకు కోపం వస్తుంది .చనిపోయిన వారిని ఎవరూ చీదరించుకోరు .అందుకే అలా అనవలసి వచ్చింది" అని అన్నాడు .ధర్మయ్య  ఇచ్చిన వివరణతో కనకయ్య సంతృప్తి చెందాడు.